సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 స్థాయి అధికారుల సేవలను అన్ని విభాగాల్లో సమర్థవంతంగా వినియోగించుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలనుకున్న తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) అటకెక్కింది. మూడేళ్ల కిందట టాస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఇంతవరకు ఆచరణ దిశగా అడుగులు పడలేదు. గ్రూప్–1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ, గెజిటెడ్ అధికారుల సంఘాలు.. కేరళ, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పనితీరు తెలుసుకుని, మన రాష్ట్రంలో ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి ఏడాది కిందట నివేదికలు ఇచ్చాయి.
ఆ నివేదికను పట్టించుకున్న నాథుడే లేడు. పైగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ నేతృత్వంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులతో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ.. ఎంజీ గోపాల్ రిటైర్‌మెంట్ తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. అసలు కమిటీ ఉందా, లేదా అనే దానిపైనా స్పష్టతలేదు. ఫలితంగా అన్ని విభాగాల్లో గ్రూప్–1 స్థాయి అధికారుల సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలన్న లక్ష్యం నెరవేరక పోగా, కన్ఫర్డ్ ఐఏఎస్ కోటాలో రెవెన్యూ యేతర విభాగాలకు చెందిన గ్రూప్–1 స్థాయి అధికారులకు తగిన ప్రాతినిధ్యం ఎండమావిగానే మిగిలింది.
కన్ఫర్డ్ ఐఏఎస్ తేనెతుట్టె!
ఓవైపు ‘టాస్’ప్రక్రియ అలాగే నిలిచిపోగా, తాజాగా చేపట్టిన కన్ఫర్డ్ ఐఏఎస్ పదోన్నతుల ప్రక్రియ వివాదాస్పదం అవుతోంది. రెవెన్యూ యేతర గ్రూప్–1 స్థాయి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, సీనియారిటీ విషయంలో రెవెన్యూ విభాగానికి చెందిన ప్రమోటీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టాస్ ఏర్పాటు చేసి తమకు ఐఏఎస్ పోస్టుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని నాన్ రెవెన్యూ గ్రూప్–1 స్థాయి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, నాన్ రెవెన్యూ అనే తేడా లేకుండా టాస్‌ను ఏర్పాటు చేసి, గ్రూప్–1 స్థాయి వారందరిని స్టేట్ సివిల్ సర్వీసెస్ కిందకు తీసుకురావాలని కోరుతున్నారు. మరోవైపు రెవెన్యూలో డైరెక్ట్ రిక్రూటీస్, ప్రమోటీల సీనియారిటీ కేసుకు సంబంధించి.. హైకోర్టు తీర్పు వెలువడకముందే ఆగమేఘాలపై కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం జాబితాను కేంద్రానికి పంపడంపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టించినట్లు..’
డిప్యూటీ కలెక్టర్ల విభజన ఈనెల 29న పూర్తయినట్టు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందులో తెలంగాణకు అలాట్ అయిన వారు కొందరు ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోనే పని చేస్తున్నారు. అధికారికంగా తెలంగాణలో చేరలేదు. ఇంకొందరికి 8 ఏళ్ల సర్వీసు పూర్తి కాలేదు. ఇలా తెలంగాణలో చేరని వారి పేర్లు, 8 ఏళ్ల కనీస సర్వీసు పూర్తి కాని వారి పేర్లు కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం జాబితాలో చేర్చడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఏపీ స్థానికత కలిగిన వారు కూడా అందులో ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నిబంధనలివీ..
రాష్ట్ర సర్వీసుల్లో విశేష అనుభవం, సమర్థత ఉన్న అధికారులకి కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతులు కల్పించాలని నియమ నిబంధనలు చెబుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా రెవెన్యూ వారికే ప్రాధాన్యం ఇస్తుండటంపై నాన్ రెవెన్యూ అధికారుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ప్రమోషన్) రెగ్యులేషన్స్–1955 ప్రకారం రాష్ట్ర సర్వీసుల్లో రెవెన్యూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్యూటీ కలెక్టర్ లేదా అంతకంటే పైహోదా కలిగిన వారు ‘రాష్ట్ర సివిల్ సర్వీస్’కింద పని చేస్తూ ఉండాలి. వారికి కనీసం 8 ఏళ్ల సర్వీసు ఉండాలి. కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఇంత వరకు ఏ సర్వీసునూ ‘రాష్ట్ర సివిల్ సర్వీస్’గా గుర్తించలేదు. రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులంటే స్పష్టత లేదు. కనీసం పాత జీవోలను కూడా అడాప్ట్ చేసుకోలేదు. కానీ రెవెన్యూ వారినే పరిగణనలోకి తీసుకు ని ఐఏఎస్ కోసం జాబితా రూపొందించి పంపారని నాన్ రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. 20 రాష్ట్రాల్లో గ్రూప్–1 స్థాయి అధికారులు అందరితో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఏర్పాటు చేశారని, కేరళ ప్రభుత్వం కూడా జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానుందని పేర్కొంటున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఆ దిశగా అడుగులు పడకపోవ డంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment