Telangana Administrative Service
-
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: అన్ని శాఖల అనుభవజ్ఞులైన అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్) ఏర్పాటు చేయాలని తెలంగాణ గ్రూప్–1 అధికారుల సంఘం కోరింది. అన్ని శాఖల్లో పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకున్నందుకు సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను తెలంగాణ గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్‌నాయక్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా గ్రూప్ 1 అధికారులతో పాటు స్థానిక సంస్థలశాఖలైన పంచాయత్ రాజ్, మున్సిపల్‌శాఖల అధికారులను నియమించాలని, నాన్ రెవెన్యూ కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఐఏఎస్ పోస్ట్‌లను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టీఏఎస్ నేతలు అరవిందరెడ్డి, హరికిషన్, అంజన్ రావ్, శశిధరా చారి, నాగరాజు, రమేష్, పద్మజా రాణి, ప్రశాంతి, రజనీకాంత్‌రెడ్డి ,అమర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తెరపైకి టీఏఎస్...
సాక్షి, హైదరాబాద్: ఇకపై రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు (టీఏఎస్) విధానం రాబోతోంది. దీని ద్వారా రాష్ట్ర పరిపాలన అధికారులను నియమించే కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కొత్తగా రూపుదిద్దుకుంటున్న రెవెన్యూ చట్టంలో ఈ సర్వీసు విధి విధానాలను పొందుపరుస్తోంది. ప్రస్తుతం గ్రూప్–1 పరీక్ష విధానంతో ఎంపికవుతున్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఇకపై టీఏఎస్ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే టీఏఎస్ ద్వారా ఎంపికైన వారికి నేరుగా రెవెన్యూ, వాణిజ్య పన్నులు, పోలీసు, ఎక్సైజ్, రవాణా శాఖల్లో పోస్టింగ్ ఇస్తారు. మహారాష్ట్ర రెవెన్యూ చట్టం తరహాలో... ప్రస్తుతం కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసింది. వచ్చే శాసనసభ సమావేశాల తరువాత అమల్లోకి రానున్న కొత్త రెవెన్యూ చట్టం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇది మహా రాష్ట్ర రెవెన్యూ చట్టం తరహాలో ఉంటుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. రెవెన్యూ శాఖలో ఉన్న వీఆర్వోలను పంచాయతీరాజ్ శాఖలో, వీఆర్ఏలను నీటిపారుదల శాఖలో విలీనం చేయనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తహసీల్దార్లకు ఉన్న అధికారాల్లో కోతపెట్టనున్నారు. కొనుగోలు చేసిన లేదా వంశపారంపర్యంగా సంక్రమించిన భూముల మ్యుటేషన్‌ను సరళీకృతం చేస్తారు. సబ్ రిజిస్ట్రార్– తహసీల్దార్ కార్యాలయాలను అనుసంధానం చేస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియగానే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోవడంతో పాటు పాసు పుస్తకాన్ని కూడా జారీ చేస్తారు. భూమి రిజిస్ట్రేషన్ తరువాత రోజులు, నెలల తరబడి మ్యుటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు. రైతు పాసు పుస్తకాల్లోనూ మార్పులు తీసుకురానున్నారు. (బడికి పోయేదెట్లా..!) భూముల వర్గీకరణ... ఇకపై భూములను నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజావసరాలు, గ్రామ కంఠం భూములుగా ఉంటాయి. పాసు పుస్తకాల్లో సైతం భూమి కేటగిరీని పొందుపరుస్తారు. భూ వివాదాలు తలెత్తితే పరిష్కరించే బాధ్యత ఇకపై కలెక్టర్లు తీసుకుంటారు. రెవెన్యూ వ్యాజ్యాలను కలెక్టర్లు 40 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అధికారాల్లో కూడా కోత పడనుంది. -
‘టాస్’ను ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లోని ప్రతిభావంతులు, సమర్థులైన అధికారులతో తెలంగాణ అడ్మిని స్ట్రేటివ్ సర్వీస్ (టాస్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ గ్రూప్–1 అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో శుక్రవారం అసో సియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కీలక అధికారుల కొరత నేపథ్యంలో టాస్ అవసరం ఎంతో ఉందన్నారు. గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని గ్రూప్–1 అధికారుల్లో అనుభవం, సమర్థత కలిగిన అధికారులను జాయింట్ కలెక్టర్లుగా, డైరెక్టర్లుగా, ఎండీలుగా నియమించాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు కోసం అధ్యయన కమిటీ ఏర్పాటు.. నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అవగాహన సదస్సుల నిర్వహణ.. గ్రూప్–1 కేటగిరీల్లోని పోస్టులు అన్నింటికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. కొత్తగా వివిధ శాఖల్లో నియమితులైన గ్రూప్–1 అధికారులను సన్మానించారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి హన్మంతునాయక్, ఇతర నేతలు శశికిరణాచారి, అరవిందరెడ్డి, అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పేలని ప‘టాస్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 స్థాయి అధికారుల సేవలను అన్ని విభాగాల్లో సమర్థవంతంగా వినియోగించుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలనుకున్న తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) అటకెక్కింది. మూడేళ్ల కిందట టాస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఇంతవరకు ఆచరణ దిశగా అడుగులు పడలేదు. గ్రూప్–1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ, గెజిటెడ్ అధికారుల సంఘాలు.. కేరళ, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పనితీరు తెలుసుకుని, మన రాష్ట్రంలో ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి ఏడాది కిందట నివేదికలు ఇచ్చాయి. ఆ నివేదికను పట్టించుకున్న నాథుడే లేడు. పైగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ నేతృత్వంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులతో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ.. ఎంజీ గోపాల్ రిటైర్మెంట్ తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. అసలు కమిటీ ఉందా, లేదా అనే దానిపైనా స్పష్టతలేదు. ఫలితంగా అన్ని విభాగాల్లో గ్రూప్–1 స్థాయి అధికారుల సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలన్న లక్ష్యం నెరవేరక పోగా, కన్ఫర్డ్ ఐఏఎస్ కోటాలో రెవెన్యూ యేతర విభాగాలకు చెందిన గ్రూప్–1 స్థాయి అధికారులకు తగిన ప్రాతినిధ్యం ఎండమావిగానే మిగిలింది. కన్ఫర్డ్ ఐఏఎస్ తేనెతుట్టె! ఓవైపు ‘టాస్’ప్రక్రియ అలాగే నిలిచిపోగా, తాజాగా చేపట్టిన కన్ఫర్డ్ ఐఏఎస్ పదోన్నతుల ప్రక్రియ వివాదాస్పదం అవుతోంది. రెవెన్యూ యేతర గ్రూప్–1 స్థాయి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, సీనియారిటీ విషయంలో రెవెన్యూ విభాగానికి చెందిన ప్రమోటీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టాస్ ఏర్పాటు చేసి తమకు ఐఏఎస్ పోస్టుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని నాన్ రెవెన్యూ గ్రూప్–1 స్థాయి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, నాన్ రెవెన్యూ అనే తేడా లేకుండా టాస్‌ను ఏర్పాటు చేసి, గ్రూప్–1 స్థాయి వారందరిని స్టేట్ సివిల్ సర్వీసెస్ కిందకు తీసుకురావాలని కోరుతున్నారు. మరోవైపు రెవెన్యూలో డైరెక్ట్ రిక్రూటీస్, ప్రమోటీల సీనియారిటీ కేసుకు సంబంధించి.. హైకోర్టు తీర్పు వెలువడకముందే ఆగమేఘాలపై కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం జాబితాను కేంద్రానికి పంపడంపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టించినట్లు..’ డిప్యూటీ కలెక్టర్ల విభజన ఈనెల 29న పూర్తయినట్టు నోటిఫికేషన్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందులో తెలంగాణకు అలాట్ అయిన వారు కొందరు ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోనే పని చేస్తున్నారు. అధికారికంగా తెలంగాణలో చేరలేదు. ఇంకొందరికి 8 ఏళ్ల సర్వీసు పూర్తి కాలేదు. ఇలా తెలంగాణలో చేరని వారి పేర్లు, 8 ఏళ్ల కనీస సర్వీసు పూర్తి కాని వారి పేర్లు కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం జాబితాలో చేర్చడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఏపీ స్థానికత కలిగిన వారు కూడా అందులో ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలివీ.. రాష్ట్ర సర్వీసుల్లో విశేష అనుభవం, సమర్థత ఉన్న అధికారులకి కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతులు కల్పించాలని నియమ నిబంధనలు చెబుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా రెవెన్యూ వారికే ప్రాధాన్యం ఇస్తుండటంపై నాన్ రెవెన్యూ అధికారుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ప్రమోషన్) రెగ్యులేషన్స్–1955 ప్రకారం రాష్ట్ర సర్వీసుల్లో రెవెన్యూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్యూటీ కలెక్టర్ లేదా అంతకంటే పైహోదా కలిగిన వారు ‘రాష్ట్ర సివిల్ సర్వీస్’కింద పని చేస్తూ ఉండాలి. వారికి కనీసం 8 ఏళ్ల సర్వీసు ఉండాలి. కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఇంత వరకు ఏ సర్వీసునూ ‘రాష్ట్ర సివిల్ సర్వీస్’గా గుర్తించలేదు. రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులంటే స్పష్టత లేదు. కనీసం పాత జీవోలను కూడా అడాప్ట్ చేసుకోలేదు. కానీ రెవెన్యూ వారినే పరిగణనలోకి తీసుకు ని ఐఏఎస్ కోసం జాబితా రూపొందించి పంపారని నాన్ రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. 20 రాష్ట్రాల్లో గ్రూప్–1 స్థాయి అధికారులు అందరితో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఏర్పాటు చేశారని, కేరళ ప్రభుత్వం కూడా జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానుందని పేర్కొంటున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఆ దిశగా అడుగులు పడకపోవ డంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు తేవాల్సిందే!
► అధికారుల కమిటీతో రెవెన్యూ, గ్రూప్-1, గెజిటెడ్ సంఘాలు ► విధివిధానాల్లోనే మార్పులు అవసరమని వెల్లడి సాక్షి , హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును (టీఏఎస్) అమల్లోకి తేవాల్సిందేనని వివిధ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. అయితే విధి విధానాల రూపకల్పనలో మాత్రం అన్ని విభాగాల ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరాయి. ప్రభుత్వం మరింత లోతుగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. టీఏఎస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ నేతృత్వంలో నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం సచివాలయంలో గ్రూప్-1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ, గెజిటెడ్ అధికారుల సంఘం నేతలతో సమావేశమైంది. ఆయా సంఘాల అభిప్రాయాలను స్వీకరించింది. ఈ సందర్భంగా గ్రూప్-1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి చేసిన అధ్యయన నివేదికలను అందజేసి.. వాటిలోని అంశాలపై చర్చించాయి. సమావేశంలో గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, రెవెన్యూ అధికారుల జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి, కన్వీనర్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్-1 అధికారుల సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘాలు టీఏఎస్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొనగా, రెవెన్యూ అధికారుల సంఘం మాత్రం టీఏఎస్ అక్కర్లేదని, ఒకవేళ ఏర్పాటు చేస్తే రెవెన్యూ అధికారులతోనే ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రస్తుత రెవెన్యూ విధానాన్ని టీఏఎస్గా మార్చాలి: రెవెన్యూ జేఏసీ చిన్న జిల్లాల నేపథ్యంలో టీఏఎస్ అవసరం లేదు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఆందోళనలో ఉన్నారు. పని లేక, అవకాశాలు లేక చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. ఒకవేళ చేస్తే రెవెన్యూ విధానాన్ని టీఏఎస్గా మార్చాలి. దీనిపై అవసరమైతే మేం మరిన్ని రాష్ట్రాల్లో మరోసారి అధ్యయనం చేస్తాం. కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్ర పరిపాలన సర్వీసుల్లో 50 శాతం డెరైక్టు నియామకాల విధానం ఉంది. అందరికి అవకాశం వచ్చేలా టీఏఎస్: గెజిటెడ్ అధికారుల సంఘం అందరికి అవకాశాలు వచ్చేలా టీఏఎస్ ఉండాలి. విధి విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలి. గ్రూప్-1 సర్వీసెస్ స్థానంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేయాలి. గ్రూప్-1 సర్వీసులోని ఉద్యోగులను టీఏఎస్‌లో జూనియర్, సీనియర్, సూపర్ సీనియర్ కేటగిరీలుగా విభజించాలి. ఈ కేటగిరీల కిందే ఉద్యోగాలను భర్తీ చేయాలి. టీఏఎస్‌లో వారి కామన్ సీనియారిటీని కొనసాగించాలి. ఒక్క శాఖకే పరిమితం చేయకుండా టీఏఎస్ పరిధిలోనే బదిలీలు ఉండాలి. ఒక్క సబ్జెక్టుతో వచ్చిన వారైన ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వారిని వెనక్కి పంపించాలి. డిపార్ట్మెంట్లలోని సీనియర్లనే విభాగాధిపతులుగా నియమించాలి. అందరిని ఒప్పించి చేయాలి. మేం అధ్యయనం చేస్తాం. అధికారుల కమిటీ కూడా అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకోవాలి. టీఏఎస్ తప్పనిసరి: గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్రంలో టీఏఎస్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతమున్న గ్రూప్-1 అధికారులతో టీఏఎస్ తొలి కేడర్ సంఖ్యను నిర్దేశించాలి. ప్రస్తుతమున్న గ్రూప్1 సర్వీసుల నియామకాలు యథాతథంగా కొనసాగించాలి. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయ్యాక టీఏఎస్‌కు బదిలీ చేయాలి. టీఏఎస్‌లో 3 గ్రేడ్లుండాలి. 8 ఏళ్ల గ్రూప్-1 సర్వీసు పూర్తి చేసిన వారిని 12 ఏళ్ల వరకు జూనియర్ గ్రేడ్‌గా పరిగణించాలి. 12-16 వరకు సీనియర్ గ్రేడ్, 16 ఏళ్ల సర్వీసు నిండిన వారిని సూపర్ టైమ్ గ్రేడ్‌గా పరిగణించాలి. వివిధ విభాగాధిపతులు (హెచ్‌వోడీ), ఎండీలు, రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లుగా టీఏఎస్ అధికారులను నియమించాలి. ఐఏఎస్ పదోన్నతుల్లో అన్ని శాఖలకు అవకాశమివ్వాలి. డిప్యూటీ కలెక్టర్లతోపాటు నాన్ రెవిన్యూ అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలి. -
ఇక తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్!
► స్టేట్ సివిల్ సర్వీస్‌గా గ్రూప్-1 ► ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయిన అధికారులకు టీఏఎస్ హోదా ► మూడు గ్రేడ్లుగా నియామకానికి ప్రతిపాదనలు ► ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అధికారుల కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్)ను ఏర్పాటు చేయాలని గ్రూప్-1 అధికారుల సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రస్తుతమున్న గ్రూప్-1 సర్వీసులను యథాతథంగా కొనసాగించాలని, ఈ సర్వీసునే రాష్ట్ర సివిల్ సర్వీస్‌గా గుర్తించాలని కోరింది. ఎనిమిదేళ్ల కనీస సర్వీసు పూర్తి చేసిన గ్రూప్-1 అధికారులతో టీఏఎస్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. విస్తృతంగా అధ్యయనం చేసి..తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్) ఏర్పాటు, కొత్త అడ్మినిస్ట్రేటివ్ నిబంధనల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ ఎం.జి.గోపాల్ ఆధ్వర్యంలో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. టీఏఎస్ ఏర్పాటు, కేడర్ సంఖ్య, ఏయే పోస్టులు, ఏయే విభాగాల ఉన్నతాధికారులను అందులో చేర్చాలి.., గ్రేడ్లు, పేస్కేళ్లు, నియామక విధానం, ప్రమోషన్లకు అనుసరించాల్సిన పద్ధతి, ఇప్పుడున్న గ్రూప్-1 అధికారులకు టీఏఎస్ పదోన్నతి, టీఏఎస్ అధికారులకు శిక్షణ తదితర అంశాలను అధ్యయనం చేయాలని గ్రూప్-1 అధికారుల అసోసియేషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గ్రూప్-1 అధికారుల బృందం కేరళ, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి... అక్కడ అమల్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రూల్స్‌ను అధ్యయనం చేసి వచ్చింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అమలు చేయాల్సిన విధివిధానాలపై ఓ సమగ్ర నివేదికను రూపొం దించింది. 197 పేజీలతో కూడిన ఈ నివేదికను శుక్రవారం సచివాలయంలో ఎంజీ గోపాల్ కమిటీకి అందజేసింది. తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు ఆవశ్యకతను నివేదికలో ప్రధానంగా ప్రస్తావించింది. గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్, హన్మంతునాయక్, శశికిరణాచారి, అశోక్‌రెడ్డి, రఘుప్రసాద్, హరికిషన్, అరవిందరెడ్డి, అలోక్‌కుమార్, శ్రీనివాసులు, భాస్కరాచారి, చంద్రకాంత్‌రెడ్డి, రవీందర్రావు, అజయ్, సోమశేఖర్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. తమ ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అధికారుల బృందం నివేదికలోని ప్రధాన అంశాలు.. ♦ వెంటనే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలి. ♦ ప్రస్తుతమున్న గ్రూప్-1 ఆఫీసర్లతో టీఏఎస్ తొలి కేడర్ సంఖ్యను నిర్దేశించాలి. డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులై ఎనిమిదేళ్ల కనీస సర్వీసు ఉన్న వారికి ఈ అవకాశమివ్వాలి. ♦ కొత్త నియామకాలు చేపట్టేందుకు శాఖలవారీగా ప్రస్తుతమున్న గ్రూప్-1 సర్వీసుల నియామకాలు యథాతథంగా కొనసాగించాలి. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయ్యాక టీఏఎస్‌కు బదిలీ చేయాలి. ♦ టీఏఎస్‌లో మూడు గ్రేడ్లుండాలి. 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని 12 ఏళ్ల వరకు జూనియర్ గ్రేడ్ (పేస్కేల్ 52,590-1,03,290)గా పరిగణించాలి. 12-16 వరకు సీనియర్ గ్రేడ్ (పేస్కేలు 73,270-1,08,330), 16 ఏళ్ల సర్వీసు నిండిన వారిని సూపర్ టైమ్ గ్రేడ్ (పేస్కేలు 87,130-1,10,850)గా పరిగణించాలి. సర్వీసు కాలాన్ని బట్టి పదోన్నతి కల్పించాలి. ఐఏఎస్‌లకు ఇచ్చిన తరహాలో శిక్షణను ఎంసీహెచ్ఆర్డీ కేంద్రంగా ఇప్పించాలి. ♦ టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్-1 డెరైక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలి. ♦ వివిధ శాఖాధిపతులు (హెచ్‌వోడీ), ఎం డీలు, రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లుగా టీఏఎస్ అధికారులను నియమించాలి. ♦ ఐఏఎస్ పదోన్నతుల్లో అన్ని శాఖలకు అవకాశమివ్వాలి. డిప్యూటీ కలెక్టర్లతో పాటు నాన్ రెవెన్యూ అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను సంస్కరించాలి. ♦ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఐఏఎస్ అధికారుల కొరతను దృష్టిలో ఉంచుకుని గ్రూప్-1 సీనియర్ అధికారులను అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లుగా నియమించాలి. -
ఇక తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్!
అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీ నియామకం హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అయిన ఐఏఎస్ తరహాలో... రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్) ఏర్పా టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఈ తరహాలో కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఏఎస్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక అందజేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జీవో నం. 777ను జారీ చేశారు. ఈ కమిటీకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, సాధారణ పరిపాలన(పొలిటికల్) శాఖల ముఖ్యకార్యదర్శులు, స్పెషల్ సెక్రటరీ (ఎస్ఆర్/ఐఎఫ్) సభ్యులుగా వ్యవహరిస్తారు. సర్వీసెస్, హెచ్ఆర్ఎం కార్యదర్శి సభ్యుడిగా, కన్వీనర్‌గా ఉంటారు. రెవెన్యూయేతర అధికారుల్లో ఆశలు.. ఇన్నాళ్లూ రాష్ట్ర స్థాయి సర్వీసు అయినగ్రూప్-1లో ఒక్క రెవెన్యూ వైపు ఉన్న అధికారులనే పదోన్నతిపై ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు (కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం) సిఫారసు చేసే విధానం ఉంది. ఇతర విభాగాల గ్రూప్-1 అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా పొందే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో ని గ్రూప్-1 అధికారులకు ప్రాతినిధ్యం కల్పిం చేలా రాష్ట్రస్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీ స్ ఉండాల ని, దాని నుంచి సీనియారిటీ ప్రకా రం కన్ఫర్డ్ ఐఏఎ స్కు సిఫారసు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. హరగోపాల్ కమిటీ కూడా తెలంగాణ సివిల్ సర్వీసెస్ ఉం డటం అవసరమని పేర్కొంది. టీఏఎస్కి కమిటీని ఏర్పాటు చేయడంపై తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.