తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు తేవాల్సిందే! | Govt urged to create Telanga administrative service | Sakshi
Sakshi News home page

తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు తేవాల్సిందే!

Published Wed, Oct 26 2016 2:43 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

Govt urged to create Telanga administrative service

అధికారుల కమిటీతో రెవెన్యూ, గ్రూప్-1, గెజిటెడ్ సంఘాలు
విధివిధానాల్లోనే మార్పులు అవసరమని వెల్లడి

 
సాక్షి , హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును (టీఏఎస్) అమల్లోకి తేవాల్సిందేనని వివిధ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. అయితే విధి విధానాల రూపకల్పనలో మాత్రం అన్ని విభాగాల ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరాయి. ప్రభుత్వం మరింత లోతుగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. టీఏఎస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ నేతృత్వంలో నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం సచివాలయంలో గ్రూప్-1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ, గెజిటెడ్ అధికారుల సంఘం నేతలతో సమావేశమైంది. ఆయా సంఘాల అభిప్రాయాలను స్వీకరించింది.

ఈ సందర్భంగా గ్రూప్-1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి చేసిన అధ్యయన నివేదికలను అందజేసి.. వాటిలోని అంశాలపై చర్చించాయి. సమావేశంలో గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, రెవెన్యూ అధికారుల జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి, కన్వీనర్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్-1 అధికారుల సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘాలు టీఏఎస్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొనగా, రెవెన్యూ అధికారుల సంఘం మాత్రం టీఏఎస్ అక్కర్లేదని, ఒకవేళ ఏర్పాటు చేస్తే రెవెన్యూ అధికారులతోనే ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ప్రస్తుత రెవెన్యూ విధానాన్ని టీఏఎస్‌గా మార్చాలి: రెవెన్యూ జేఏసీ
చిన్న జిల్లాల నేపథ్యంలో టీఏఎస్ అవసరం లేదు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఆందోళనలో ఉన్నారు. పని లేక, అవకాశాలు లేక చాలా మంది వెయిటింగ్‌లో ఉన్నారు. ఒకవేళ చేస్తే రెవెన్యూ విధానాన్ని టీఏఎస్‌గా మార్చాలి. దీనిపై అవసరమైతే మేం మరిన్ని రాష్ట్రాల్లో మరోసారి అధ్యయనం చేస్తాం. కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్ర పరిపాలన సర్వీసుల్లో 50 శాతం డెరైక్టు నియామకాల విధానం ఉంది.
 
అందరికి అవకాశం వచ్చేలా టీఏఎస్: గెజిటెడ్ అధికారుల సంఘం

అందరికి అవకాశాలు వచ్చేలా టీఏఎస్ ఉండాలి. విధి విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలి. గ్రూప్-1 సర్వీసెస్ స్థానంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేయాలి. గ్రూప్-1 సర్వీసులోని ఉద్యోగులను టీఏఎస్‌లో జూనియర్, సీనియర్, సూపర్ సీనియర్ కేటగిరీలుగా విభజించాలి. ఈ కేటగిరీల కిందే ఉద్యోగాలను భర్తీ చేయాలి. టీఏఎస్‌లో వారి కామన్ సీనియారిటీని కొనసాగించాలి. ఒక్క శాఖకే పరిమితం చేయకుండా టీఏఎస్ పరిధిలోనే బదిలీలు ఉండాలి. ఒక్క సబ్జెక్టుతో వచ్చిన వారైన ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ వారిని వెనక్కి పంపించాలి. డిపార్ట్‌మెంట్లలోని సీనియర్లనే విభాగాధిపతులుగా నియమించాలి. అందరిని ఒప్పించి చేయాలి. మేం అధ్యయనం చేస్తాం. అధికారుల కమిటీ కూడా అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకోవాలి.
 
టీఏఎస్ తప్పనిసరి: గ్రూప్-1 అధికారుల సంఘం
రాష్ట్రంలో టీఏఎస్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతమున్న గ్రూప్-1 అధికారులతో టీఏఎస్ తొలి కేడర్ సంఖ్యను నిర్దేశించాలి. ప్రస్తుతమున్న గ్రూప్1 సర్వీసుల నియామకాలు యథాతథంగా కొనసాగించాలి. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయ్యాక టీఏఎస్‌కు బదిలీ చేయాలి. టీఏఎస్‌లో 3 గ్రేడ్‌లుండాలి. 8 ఏళ్ల గ్రూప్-1 సర్వీసు పూర్తి చేసిన వారిని 12 ఏళ్ల వరకు జూనియర్ గ్రేడ్‌గా పరిగణించాలి. 12-16 వరకు సీనియర్ గ్రేడ్, 16 ఏళ్ల సర్వీసు నిండిన వారిని సూపర్ టైమ్ గ్రేడ్‌గా పరిగణించాలి. వివిధ విభాగాధిపతులు (హెచ్‌వోడీ), ఎండీలు, రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లుగా టీఏఎస్ అధికారులను నియమించాలి. ఐఏఎస్ పదోన్నతుల్లో అన్ని శాఖలకు అవకాశమివ్వాలి. డిప్యూటీ కలెక్టర్లతోపాటు నాన్ రెవిన్యూ అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement