ఇక తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్!
► స్టేట్ సివిల్ సర్వీస్‌గా గ్రూప్-1
► ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయిన అధికారులకు టీఏఎస్ హోదా
► మూడు గ్రేడ్‌లుగా నియామకానికి ప్రతిపాదనలు
► ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అధికారుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్)ను ఏర్పాటు చేయాలని గ్రూప్-1 అధికారుల సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రస్తుతమున్న గ్రూప్-1 సర్వీసులను యథాతథంగా కొనసాగించాలని, ఈ సర్వీసునే రాష్ట్ర సివిల్ సర్వీస్‌గా గుర్తించాలని కోరింది. ఎనిమిదేళ్ల కనీస సర్వీసు పూర్తి చేసిన గ్రూప్-1 అధికారులతో టీఏఎస్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.
విస్తృతంగా అధ్యయనం చేసి..తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్) ఏర్పాటు, కొత్త అడ్మినిస్ట్రేటివ్ నిబంధనల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ ఎం.జి.గోపాల్ ఆధ్వర్యంలో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. టీఏఎస్ ఏర్పాటు, కేడర్ సంఖ్య, ఏయే పోస్టులు, ఏయే విభాగాల ఉన్నతాధికారులను అందులో చేర్చాలి.., గ్రేడ్‌లు, పేస్కేళ్లు, నియామక విధానం, ప్రమోషన్లకు అనుసరించాల్సిన పద్ధతి, ఇప్పుడున్న గ్రూప్-1 అధికారులకు టీఏఎస్ పదోన్నతి, టీఏఎస్ అధికారులకు శిక్షణ తదితర అంశాలను అధ్యయనం చేయాలని గ్రూప్-1 అధికారుల అసోసియేషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గ్రూప్-1 అధికారుల బృందం కేరళ, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి... అక్కడ అమల్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రూల్స్‌ను అధ్యయనం చేసి వచ్చింది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అమలు చేయాల్సిన విధివిధానాలపై ఓ సమగ్ర నివేదికను రూపొం దించింది. 197 పేజీలతో కూడిన ఈ నివేదికను శుక్రవారం సచివాలయంలో ఎంజీ గోపాల్ కమిటీకి అందజేసింది. తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు ఆవశ్యకతను నివేదికలో ప్రధానంగా ప్రస్తావించింది. గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్, హన్మంతునాయక్, శశికిరణాచారి, అశోక్‌రెడ్డి, రఘుప్రసాద్, హరికిషన్, అరవిందరెడ్డి, అలోక్‌కుమార్, శ్రీనివాసులు, భాస్కరాచారి, చంద్రకాంత్‌రెడ్డి, రవీందర్‌రావు, అజయ్, సోమశేఖర్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. తమ ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రూప్-1 అధికారుల బృందం నివేదికలోని ప్రధాన అంశాలు..
♦ వెంటనే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలి.
♦ ప్రస్తుతమున్న గ్రూప్-1 ఆఫీసర్లతో టీఏఎస్ తొలి కేడర్ సంఖ్యను నిర్దేశించాలి. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులై ఎనిమిదేళ్ల కనీస సర్వీసు ఉన్న వారికి ఈ అవకాశమివ్వాలి.
♦ కొత్త నియామకాలు చేపట్టేందుకు శాఖలవారీగా ప్రస్తుతమున్న గ్రూప్-1 సర్వీసుల నియామకాలు యథాతథంగా కొనసాగించాలి. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయ్యాక టీఏఎస్‌కు బదిలీ చేయాలి.
♦ టీఏఎస్‌లో మూడు గ్రేడ్‌లుండాలి. 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని 12 ఏళ్ల వరకు జూనియర్ గ్రేడ్ (పేస్కేల్ 52,590-1,03,290)గా పరిగణించాలి. 12-16 వరకు సీనియర్ గ్రేడ్ (పేస్కేలు 73,270-1,08,330), 16 ఏళ్ల సర్వీసు నిండిన వారిని సూపర్ టైమ్ గ్రేడ్ (పేస్కేలు 87,130-1,10,850)గా పరిగణించాలి. సర్వీసు కాలాన్ని బట్టి పదోన్నతి కల్పించాలి. ఐఏఎస్‌లకు ఇచ్చిన తరహాలో శిక్షణను ఎంసీహెచ్‌ఆర్‌డీ కేంద్రంగా ఇప్పించాలి.
♦ టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్-1 డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ చేపట్టాలి.
♦ వివిధ శాఖాధిపతులు (హెచ్‌వోడీ), ఎం డీలు, రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లుగా టీఏఎస్ అధికారులను నియమించాలి.
♦ ఐఏఎస్ పదోన్నతుల్లో అన్ని శాఖలకు అవకాశమివ్వాలి. డిప్యూటీ కలెక్టర్లతో పాటు నాన్ రెవెన్యూ అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను సంస్కరించాలి.
♦ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఐఏఎస్ అధికారుల కొరతను దృష్టిలో ఉంచుకుని గ్రూప్-1 సీనియర్ అధికారులను అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లుగా నియమించాలి.