
భారత్‌లో కుదరకపోతే దక్షిణాఫ్రికాలో..
ఐపీఎల్-7పై చైర్మన్ బిస్వాల్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్ ఎక్కడ జరుగుతుందనే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఏప్రిల్ 9 నుంచి జూన్ 3 వరకు ఐపీఎల్ జరగాల్సి ఉన్నా ఇదే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో మ్యాచ్‌లకు భద్రత విషయంలో ఇబ్బంది ఎదురవనుంది.
మరోవైపు వేదికపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐపీఎల్ అధికారులు వచ్చే వారం హోం మంత్రిత్వ శాఖతో సమావేశం కానున్నారు. ‘మేం చాలా ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నాం. షిండేతో సమావేశమయ్యాక మాకు వీలయ్యే తేదీల గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాతే పాలక మండలి ద్వారా కచ్చితమైన షెడ్యూల్ విడుదలవుతుంది. సాధ్యమైనంత మేరకు భారత్‌లోనే అన్ని మ్యాచ్‌లను జరపాలని చూస్తున్నాం. ఒకవేళ వీలు కాకుంటే దక్షిణాఫ్రికాలో జరుపుతాం’ అని లీగ్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ తెలిపారు.