సముద్రంలోకి తాబేలు పిల్లలను వదులుతున్న వన్యప్రాణి విభాగం అధికారులు
సముద్రపు తాబేలుగా పిలిచే అలివ్‌రిడ్లీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్ర జలాలను శుద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడుతున్న ఈ అలివ్‌రిడ్లీ తాబేళ్లు కడలి కలుషితం కారణంగా పదుల సంఖ్యలో చనిపోతున్నాయి. సముద్రంలో ఆక్వా రసాయనాలు అధికంగా కలుస్తుండడంతో ఈ తాబేళ్లు మృతిచెందుతున్నట్లు తెలుస్తోంది.
సాక్షి, వాకాడు: వాకాడు మండల పరిధిలోని కొండూరుపాళెం, శ్రీనివాసపురం, వైట్‌కుప్పం, పూడి కుప్పం, నవాబుపేట సముద్ర తీరంలో 2013 నుంచి వన్యప్రాణి విభాగం సూళ్లూరుపేట, ట్రీ పౌండేషన్ చెన్నై ఆధ్వర్యంలో అలివ్‌రిడ్లీ తాబేళ్ల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తాబేళ్ల గుడ్లను సేకరించి వాటి పిల్లలను సముద్రంలోకి వదులుతున్నారు. అయితే మానవుడి స్వార్థ ప్రయోజనాల కారణంగా పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాలను సముద్రంలోకి వదిలిపెట్టడం వల్ల తాబేళ్లు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయి. సముద్ర తీరంలో రొయ్యల హేచరీలు, రొయ్యల చెరువులు వెలసి వాటి నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదులుతున్నారు.
దీని కారణంగా కడలి విషపూరితమైన వ్యర్థాలతో నిండిపోతోంది. తద్వారా తాబేళ్లు జీర్ణశక్తిని కోల్పోయి ఊపిరాడక రోజుకి పదుల సంఖ్యలో మృతిచెందుతున్నాయి. అలాగే నిబంధనలను అతిక్రమించి చెన్నైకు చెందిన మరబోట్లు ఈ ప్రాంతంలో వేట చేయడం వల్ల తాబేళ్లు వాటికి తగిలి మృత్యువాత పడుతున్నాయి. సహజంగా మెరైన్ యాక్ట్ 1999 ప్రకారం మరబోట్లు తీరం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో చేపల వేట చేయాలి. నిబంధనలను ఉల్లంగించి వేట చేయడం వల్ల గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చే తాబేళ్లు బోట్ల కింద చనిపోతున్నాయి.
అలివ్‌రిడ్లీతో ప్రయోజనం
అలివ్‌రిడ్లీ తాబేళ్లు సముద్ర జలాల్లోని పాచి, మొక్కలు వివిధ వ్యర్థ పదార్థాలను తింటూ సముద్రం కలుషితం కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా సముద్ర జీవరాశులను అంతరించి పోకుండా ఇవి పరిరక్షిస్తున్నాయి. సముద్రంలో ఆక్సిజన్ పెంచడంలో ఈ తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. అలివ్‌రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టే సమయంలో తీరంలో ఒక రకమైన జెల్‌ను విడుదల చేస్తాయి. అది భూమిలో బంకలా అతుక్కుపోయి విపత్తుల సమయంలో తీరం కోతకు గురికాకుండా నివారిస్తుంది. అనేక ఉపయోగాలు ఉన్న ఈ అలివ్‌రిడ్లీ తాబేళ్ల సంరక్షణ నేడు గాల్లో దీపంలా మారింది. తాబేళ్ల సంరక్షణకు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వాకాడు మండల తీరప్రాంత గ్రామాల్లో తాబేళ్ల పెంపకానికి ప్రత్యేక నిధులతో హేచరీలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణి విభాగం అధికారులు ప్రతి ఏడాది అధిక మొత్తంలో గుడ్లను సేకరించి హేచరీల ద్వారా పిల్లలను ఉత్పత్తి చేసి సముద్రంలో విడిచి పెడుతున్నారు.
వైట్‌కుప్ప సముద్ర తీరంలో మృతిచెందిన పెద్దసైజు అలివ్‌రిడ్లీ తాబేలు
ఇప్పటివరకు 29,784 గుడ్లను సేకరించి వాటి ద్వారా పిల్లలను ఉత్పత్తి చేసి 19,102 వరకు పిల్లలను సముద్రంలోకి వదిలారు. ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో సముద్ర తీరంలో ప్రత్యేక గుంతల్లో గుడ్లను పొదుగుతారు. ఇవి దాదాపు 45 నుంచి 60 రోజుల లోపు పిల్లలుగా తయారవుతాయి. తాబేళ్ల అభివృద్ధికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరిస్తున్నాయి. అందులో ట్రీ ఫౌండేషన్, బయోవర్సీటీ కంజర్వేషన్ ఫౌండేషన్ సంస్థలు వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నాయి. అలివ్‌రిడ్లీ తాబేలు 3 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, సుమారు 45 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ తాబేళ్ల పిల్లలు సముద్రంలోకి ఏ మార్గం నుంచి వెళతాయో అవి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే స్థావరానికి రావడం వీటి ప్రత్యేకత. తాబేళ్లను చంపినా, వాటి గుడ్లను తిన్నా, ధ్వంసం చేసినా వన్యప్రాణి చట్టం 1972 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంలో నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
తాబేళ్ల సంరక్షణ మన కర్తవ్యం
పర్యావరణాన్ని కాపాడే సముద్రపు తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కొందరు సముద్రంలోకి వ్యర్థాలను వదిలిపెట్టడం వల్ల, నిబంధనలకు విరుద్ధంగా మరబోట్లు నడపడం వల్ల తాబేళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. తాబేళ్లను తిన్నా, చంపినా, వీటి ఆవాసాలను నాశనం చేసిన వారు శిక్షార్హులు. వణ్యప్రాణి చట్టం 1972 ప్రకారం ఈ జాతిని షెడ్యూల్–1 లో పొందుపరిచి ప్రత్యేక రక్షణ కల్పించడం జరిగింది.
– గాయం శ్రీనివాసులు, వన్యప్రాణి బీట్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment