నేస్తానికి కష్టకాలం | The difficulty of Olive ridley sea turtle survival | Sakshi
Sakshi News home page

నేస్తానికి కష్టకాలం

Published Mon, Apr 9 2018 11:48 AM | Last Updated on Mon, Apr 9 2018 11:48 AM

The difficulty of  Olive ridley sea turtle survival - Sakshi

విజయనగరం పూల్‌భాగ్‌: ఆలీవ్‌ రిడ్లే తాబేళ్లు.. సముద్ర తాబేళ్లుగా పేరొందిన వీటికి పర్యావరణ నేస్తాలు అని పిలుస్తుంటారు. తీర ప్రాంతంలో పరిశ్రమలు అధికం కావడం, సముద్రంలో పెద్దబోట్లు తిరుగుతుండడంతో వీటి మనుగడే కష్టంగా మారింది. అలాంటి సమయంలో అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు తాబేళ్ల సంరక్షణకు శ్రీకారం చుట్టారు. పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐదేళ్ల కాలంలో 1,52,232 గుడ్లను సేకరించారు.

1,22,658 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. జిల్లాలోని  సముద్రతీరం వెంబడి 2014లో విజయనగరం అటవీశాఖ వన్యప్రాణి విభాగం వారు భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 28 కిలోమీటర్లు సముద్రతీరంలో 10 ఆలివ్‌రిడ్లే తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

పెంపకం ఎలా అంటే..?

ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సముద్రంలోని తల్లి తాబేళ్లు తీరానికి చేరుకుని గుడ్లు పెడతాయి. వీటిని నక్కలు, అడవి పందులు తినేయకుండా అటవీ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాబేళ్ల పునరుత్పత్తికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందో ముందుగా గుర్తించి, అక్కడ మినీ హేచరీ ఏర్పాటు చేసి అందులో రెండు నుంచి మూడు అడుగుల సైజు గుంతలు తవ్వి గుడ్లు ఉంచుతారు.

గుంతల్లో పొదిగిన గుడ్లు నుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు 45 రోజుల నుంచి 60 రోజుల సమయం పడుతుంది. డిసెంబర్‌ నుంచి జూన్‌ వరకు ఉత్పత్తి కేంద్రాల ద్వారా తాబేళ్లను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో ట్రీ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెట్టిన గుడ్లను సురక్షిత ప్రాంతాల్లో ఉంచి 20 మంది కాపలాదారులను నియమించారు.

చంపినా, తిన్నా నేరమే..

తాబేళ్లను వేటాడి చంపినా, వాటి గుడ్లను తిన్నా వన్యప్రాణి సంరక్షణ చట్టం – 1972 కింద నేరంగా పరిగణిస్తారు. మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరం వెంబడి 500 మీటర్ల పరిధిలో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేపట్టకూడదు. భారత ప్రభుత్వం ఈ తాబేళ్ల చట్టం పరిధిలో షెడ్యూల్‌–1ను చేర్చింది.

ఎంత సాయమంటే..?

తాబేళ్లు సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి. దీంతో తీర ప్రాంతాల్లో నివశించే ప్రజలకు సముద్రపు గాలి సోకడం వల్ల అంటు వ్యాధులు రావని అధికారులు చెబుతున్నారు. సముద్రంలో ఆక్సిజన్‌ పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. అడ్డదిడ్డంగా ఉండే సీ గ్రాస్‌ను తాబేళ్లు తినడంతో సీ గ్రాస్‌ బెడ్‌ ఏర్పడుతుంది. దీంతో సముద్రంలో ఉన్న జీవరాశులు బెడ్‌పై గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తిని చేస్తాయి. దీంతో మత్స్య సంపద పెరుగుతుంది.

ఇదీ ప్రత్యేకత..

ఆలివ్‌ రిడ్లే తాబేలు సుమారు 45 కిలోల బరువు, మూడడుగుల పొడవు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉంటుంది. పుట్టిన పిల్ల మూడు సెంటీమీటర్లు పొడవు, అరంగులం వెడల్పు ఉంటుంది. ఆడ తాబేలు ఒడ్డుకు వచ్చి 60 నుంచి 150 గుడ్లు వరకు పెడుతుంది.

మగ తాబేలు 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆడ తాబేలు 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే బయటకు వస్తాయి. ఆడ తాబేలు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ తీరం నుంచి సముద్రతీరంలోకి వెళతాయో పెద్దయ్యాక అదే తీరానికి వచ్చి గుడ్లు పెట్టడం ప్రత్యేకత. తాబేలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవిస్తాయి. 

అధికారుల ఆదేశాలతోనే.. 

ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలివ్‌ రిడ్లే తాబేళ్లను సంరక్షించే బాధ్యత తీసుకున్నాం. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని సముద్ర తీర ప్రాంతంలో 1,52,232 గుడ్లను సేకరించి పునరుత్పత్తి కేంద్రాల ద్వారా 1,22,658 పిల్లలను ఉత్పత్తిచేసి సముద్రంలో విడిచి పెట్టాం. బయోశాప్, కాంపా స్కీములు, బీడీఎస్‌(బయో డైవర్సిటీ కాంపౌండ్‌) ద్వారా వచ్చిన ని«ధులతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం.      – గంపా లక్ష్మణ్, డీఎఫ్‌ఓ (టెరిటోరియల్‌), విజయనగరం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement