ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లు. అత్యంత అరుదైన జాతికి చెందినవి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి అవి విశిష్ట అతిథులు.. గత కొన్నేళ్లుగా ఈ తాబేళ్ల జాడ అంతగా కనిపించడం లేదు.. ఈ ఏడాది ఒడిశా తీర ప్రాంతంలో ఈ తాబేళ్ల సంఖ్య గణనీయంగా పెరగడం పర్యావరణవేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. 1994 సంవత్సరంలో ఒడిశా తీరానికి 30 వేల తాబేళ్లు మాత్రమే వచ్చేవి..ఆ తర్వాత కాలంలో వాటి సంఖ్య లక్షలకి చేరుకుంది.. ఈ ఏడాది ఏకంగా 4 లక్షల 27 వేల తాబేళ్లు గుడ్లు పెట్టడానికి రావడం ఒక రికార్డుగా చెబుతున్నారు.
ఆలివ్ రిడ్లీ ప్రత్యేకతలు
ఈ తాబేళ్లు రెండు అడుగుల వరకు పొడవు ఉంటాయి. చూడడానికి హృదయం ఆకారంలో ఉండి ఆలివ్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తాయి. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ఈ తాబేళ్లు ఎంతో అవసరం. ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమ సంతానం అభివృద్ధి కోసం శ్రీలంక, ఆస్ట్రేలియా దేశాల నుంచి సుదీర్ఘంగా ప్రయాణించి మరీ వస్తాయి. తమకి సురక్షితమని భావించిన చోట మగతాబేలు, ఆడతాబేలు జంటగా వచ్చి ఇసుకలో మీటర్ లోతు గోతిని తవ్వి గుడ్లు పెడతాయి. తర్వాత ఆ గోతిని పూడ్చేసి తిరిగి వెళ్లిపోతాయి. ఆ తర్వాత 40 నుంచి 45 రోజుల్లో వాటి నుంచి పిల్లలు వస్తాయి.. తల్లి తాబేలు సహకారం లేకపోయినా వాటంతట అవి నడుచుకుంటూ సముద్రంలోకి వెళ్లిపోతాయి. అవి గుడ్లు పెట్టిన తర్వాత వాటిని కాపాడుకోవడమే అత్యంత కీలకం.. చాలా ప్రయాసతో కూడుకున్న పని..
అడుగడుగునా ఆపదలే
అంత దూరం నుంచి వచ్చిన ఈ విశిష్ట అతిథులకు మన దగ్గర రక్షణ కరువవుతోంది.. కుక్కలు, నక్కలు ఈ గుడ్లని తినేయడం, మత్స్యకారుల మర బోట్ల కింద పడి అప్పుడే పుట్టిన తాబేళ్లు మృత్యువాత పడడం జరుగుతోంది. తీర ప్రాంతాల్లో ఈ సమయంలో చేపలవేటను నిషేధించినా అక్రమ జాలర్ల కారణంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు ముప్పు వాటిల్లుతోంది. ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయన వ్యర్థాల కాలుష్యం కూడా ఈ అరుదైన తాబేళ్ల ఉసురు తీస్తోంది. సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో వెయ్యిగుడ్లలో ఒక్క దాని నుంచి మాత్రమే పిల్ల వస్తోందంటే ఈ జాతి ఎంత ప్రమాదంలో ఉందో తెలుస్తుంది. గతంలో ప్రతీ ఏడాది 10 వేలవరకు తాబేళ్లు చనిపోతే, ఇటీవలికాలంలో వాటి సంఖ్యను 5 వేల వరకు తగ్గించగలిగారు..
తాబేళ్ల సంరక్షణకు ఒకే ఒక్కడు
ఒడిశాకు చెందిన రవీంద్రనాథ్ సాహు చేసిన కృషి ఫలితంగా ఈ అరుదైన తాబేళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది. టర్టల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించిన సాహు వీటిని కాపాడడానికి గత 25 ఏళ్లగా కృషి చేస్తున్నారు. రుషికుల్య తీర ప్రాంతంలో ఈ తాబేళ్లు పెట్టే గుడ్లను సంరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఇందుకోసం పెళ్లి కూడా మానేశారు. పక్షవాతం సోకినా కూడా లెక్క చేయలేదు. తాబేళ్ల గుడ్లను సంరక్షించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ తాబేళ్లు సాక్షాత్తూ విష్ణుమూర్తి రెండో అవతారమని నమ్మే వారంతా సాహుకి అండగా ఉండి తాబేళ్ల సంరక్షణకి చర్యలు తీసుకున్నారు. కేవలం ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మాత్రమే కాదు, ఇతర వన్య్రప్రాణులను కూడా సంరక్షిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment