
ములకలపల్లిలో ప్రత్యక్షమైన తాబేళ్లు
సాక్షి, ములకలపల్లి(ఖమ్మం) : మండల శివారులో ఆదివారం తెల్లవారుజామున భారీగా తాబేళ్లు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. మండల పరిధిలోని పొగళ్లపల్లి, తిమ్మంపేట మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనే తాబేళ్లు కనిపించాయి. ఉదయం పత్తి తీసేందుకు వెళ్తున్న కూలీలు వాటిని చూశారు. అయితే తాబేళ్లలో కొన్ని మృత్యువాత పడగా, మరికొన్ని ప్రాణాలతోనే ఉన్నాయి. దీంతో స్థానికులు కొందరు ఆ తాబేళ్లను ఇంటికి తీసుకువెళ్లారు. తాబేళ్ల కోసం స్థానికులు ఎగబడటంతో విషయం బయటకు పొక్కింది. ఆనోట.. ఈనోట పాకి మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మండలంలో తొలిసారిగా భారీగా తాబేళ్లు బయటపడటం గమనార్హం. కాగా ఆంధ్రా నుంచి ములకలపల్లి మీదుగా భద్రాచలం ఏరియాకు వీటిని తరలించే క్రమంలో గుట్టురట్టయినట్లు తెలుస్తోంది. చేపల లోడుతో తాబేళ్లను తరలించే సమయంలో అటుగా పోలీసులు రావడంతో రోడ్డు పక్కన వాటిని పడేసినట్లు పలువురు అనుమానిస్తున్నారు. తాబేళ్లను తరలించడం అక్రమార్కుల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
విచారణ చేపట్టాం..
ఘటనా స్థలాన్ని అటవీ శాఖాధికారులు పరిశీలించి విచారణ చేపట్టారు. ములకలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు నేతృత్వంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 40 తాబేళ్లను పట్టుకోగా, వాటిల్లో 14 మృతిచెంది ఉన్నాయి. మిగిలిన 26 తాబేళ్లను పాల్వంచలోని కిన్నెరసాని రిజర్వాయర్‌కు తరలించారు. భారీగా తాబేళ్లు దొరికిన విషయంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై సురేశ్ సైతం ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment