mulakalapalli
-
రక్త మార్పిడి కలకలం: యువకుడి మృతిపై అనుమానాలు?
ములకలపల్లి: రక్త మార్పిడి చేయించుకున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్ఎంపీ అందించిన వైద్యం వికటించి మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమలాపురంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు జక్కా రామకృష్ణ (29) మంగళవారం ఆకస్మిక మృతి చెందగా..ఆర్ఎంపీ వైద్యం వికటించడంతోనేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజులుగా నీరసంగా ఉంటోందని మా«ధారంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. సోమవారం ములకలపల్లి సెంటర్లోని ఓ రక్తపరీక్షా కేంద్రంలో కమలాపురం గ్రామానికి చెందిన చెందిన ఓ యువకుడి రక్తాన్ని సేకరించి..సదరు మాధారం ఆర్ఎంపీ పర్యవేక్షణలో ఎక్కించారు. ఈ క్రమంలో రామకృష్ణ ఆరోగ్యం క్షీణించి..చనిపోయాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. చదవండి: ప్రాణం తీసిన పేకాట.. మద్యంమత్తులో బండరాయితో మోది.. ఆర్ఎంపీ నివాసంలో రక్తం పరిశీలిస్తున్న వైద్యారోగ్య శాఖ అధికారులు అధికారుల విచారణ మృతుడికి భార్య సమ్మక్క, ఏడాది వయసు కూతురు ఉంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పోటు వినోద్ కమలాపురం వెళ్లి వివరాలు సేకరించారు. రక్తం ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లిలోని రక్త పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి తాత్కాలికంగా సీజ్ చేశారు. మాధారంలోని ఆర్ఎంపీ ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేడు. అక్కడ మందులను పరిశీలించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ తెలిపారు. మృతుడి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
అండగా నేనుంటా: పొంగులేటి
ములకలపల్లి: కాలికి స్టీల్ రాడ్లతో ఏడాదిగా ఇబ్బందిపడుతున్న మౌనికకు అండగా ఉంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుర్రం మౌనిక ఏడాది కింద రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆమె ఎడమ కాలికి స్టీల్ రాడ్లు వేశారు. వీటిని 15 రోజుల్లో రాడ్లు తొలగించాల్సి ఉన్నా భర్త, కుటుంబం పట్టించుకోకపోవడంతో నడవలేక పాకుతూ గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ ఘటనపై ‘ఏడాదిగా.. కాళ్లకు స్టీల్ రాడ్లతోనే’శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. మౌనిక చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు తాను భరించి, ఖమ్మంలో చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన సూచన మేరకు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బత్తుల అంజి, ఎస్సై బాల్దె సురేశ్ గ్రామానికి వెళ్లి మౌనిక భర్త మహేశ్‌ను శ్రీనివాసరెడ్డితో మాట్లాడించారు. వాహనం ఏర్పాటు చేసి, ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి మౌనికను తరలించారు. ఎస్సై సురేశ్ రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. -
ఏడాదిగా కాళ్లకు స్టీల్ రాడ్లతో..
ములకలపల్లి: సాఫీగా సాగుతున్న కుటుంబంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం ఓ మహిళ జీవితాన్ని ఆగం చేసింది. భర్త పట్టించుకోకపోవడంతో ఏడాదిగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుర్రం మహేశ్ ఇల్లందుకు చెందిన మౌనికను ఐదేళ్ల కింద వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. ఏడాది కింద మౌనిక ములకలపల్లి వెళ్లి వస్తుండగా బైక్ ఢీకొట్టడంతో మౌనిక కాలికి తీవ్రగాయమైంది. దీంతో ఆమెను వరంగల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, ఆపరేషన్ చేసిన వైద్యులు కాలులో స్టీల్ రాడ్లు అమర్చారు. 15 రోజుల తర్వాత తొలగించాల్సి ఉండగా, కొన్ని రోజులు బాగానే చూసుకున్న భర్త మహేశ్, అత్తమామలు లక్ష్మి, ఏసురత్నం ఆ తర్వాత ఆమెను, ఆమె కుమారుడిని వదిలేశారు. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక గత్యంతరం లేక కాలికి ఉన్న స్టీల్ రాడ్‌తోనే ఏడాదిగా గ్రామంలోని ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేస్తోంది. రాత్రి వేళ ఇళ్ల అరుగులు, చెట్ల కింద తలదాచుకుంటోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వానలకు, కాలికి ఉన్న రాడ్లతో నడవలేక ఆమె ఇబ్బంది పడుతుండటాన్ని గురువారం చూసిన ఎస్సైలు బాల్దె సురేశ్, నాగభిక్షం ఆమె వివరాలు సేకరించారు. మౌనిక భర్త మహేశ్ సెంట్రింగ్ పని కోసం పాల్వంచ వెళ్లగా ఫోన్లో మాట్లాడారు. ఆమె అత్తమామలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పలుమార్లు ఇంటికి రావాలని కోరినా మౌనిక స్పందించలేదని ఆమె అత్త తెలిపింది. దీంతో మౌనికను ఆటోలో ఆమె ఇంటికి తరలించారు. మౌనిక కాలికి ఉన్న రాడ్లు తొలగించేందుకు సహకరిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. -
కుక్కలు చంపాయి.. ఊరంతా పంచుకున్నారు
ములకలపల్లి (భద్రాద్రి కొత్తగూడెం) : దాహం తీర్చుకునేందుకు గ్రామంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడిచేయడంతో మృతి చెందింది. ఈ క్రమంలో మృత్యువాత పడిన దుప్పిని కోసిన గ్రామస్తులు మాంసాన్ని పంచుకున్నారు. దీంతో అటవీ అధికారులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి శివారు అటవీ ప్రాంతం నుంచి ఓ దుప్పి దాహార్తి తీర్చుకునేందుకు గ్రామంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఊరకుక్కలు దాడి చేయడంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొందరు దుప్పిని కోసి మాంసం పంచుకున్నారు. జరిగిన విషయం అటవీ అధికారులకు తెలియడంతో ఎఫ్ఎస్ఓ కిషన్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి వేళ గ్రామంలో తనిఖీలు చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిదిమంది గ్రామస్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చాపరాలపల్లి (ఈస్ట్) బీట్ ఆఫీసర్ మల్లికార్జునరావు శనివారం వెల్లడించారు. -
కన్నీరుకూ కరోనా భయమే..!
సాక్షి, రామగిరి: మాయదారి కరోనా.. చివరి మజిలీలోనూ ఇబ్బందులకు గురి చేస్తోంది. మృతదేహం వద్ద బంధువులు, కుటుంబ సభ్యులు నోటికి దస్తీలు కట్టుకుని రోదించాల్సిన పరిస్థితి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ సర్పంచ్ బడికెల విజయ నాన్నమ్మ అక్కెమ్మ శనివారం మధ్యాహ్నం చనిపోయింది. బంధువులు నోటికి దస్తీలు, రుమాలు కట్టుకుని రోదించారు. (కరోనా: ఊపిరితిత్తులు ఎంతగా నాశనమయ్యాయో..) జోలెలో గర్భిణీని మోసుకొచ్చిన ఆశ వర్కర్లు సాక్షి, ములకలపల్లి: రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలందడంలేదు. వాహనం సౌకర్యంలేక ఓ గొత్తికోయ మహిళ అటవీ ప్రాంతంలోనే ప్రసవించింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఆదివాసీ గొత్తికోయ గ్రామమైన పూసుగూడెం పంచాయతీ సోయం గంగులునగర్‌కు చెందిన మడకం ధూలెకు శనివారం పురిటి నొప్పులు వచ్చాయి. అయితే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు. దీంతో ఆశ కార్యకర్త ధనలక్మి, అంగన్వాడీ టీచర్ దుర్గ, ఏఎన్ఎం జ్యోతిలు కలసి జోలెలో గర్భిణీని 3 కిలో మీటర్లు మోసుకుంటూ వచ్చారు. నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే కాన్పు చేశారు. ధూలె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను మంగపేట పీహెచ్‌సీకి తరలించారు. కష్టకాలంలో వెద్య సేవలందించిన ఆశ కార్యకర్త, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్‌కు ధూలె భర్త కృతజ్ఞతలు తెలిపాడు. (ప్రతి 22 మందిలో ఒకరు మృతి) -
ఆ తాబేళ్లు ఎక్కడివి?
సాక్షి, ములకలపల్లి(ఖమ్మం) : మండల శివారులో ఆదివారం తెల్లవారుజామున భారీగా తాబేళ్లు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. మండల పరిధిలోని పొగళ్లపల్లి, తిమ్మంపేట మధ్య ఆర్అండ్బీ రోడ్డు పక్కనే తాబేళ్లు కనిపించాయి. ఉదయం పత్తి తీసేందుకు వెళ్తున్న కూలీలు వాటిని చూశారు. అయితే తాబేళ్లలో కొన్ని మృత్యువాత పడగా, మరికొన్ని ప్రాణాలతోనే ఉన్నాయి. దీంతో స్థానికులు కొందరు ఆ తాబేళ్లను ఇంటికి తీసుకువెళ్లారు. తాబేళ్ల కోసం స్థానికులు ఎగబడటంతో విషయం బయటకు పొక్కింది. ఆనోట.. ఈనోట పాకి మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మండలంలో తొలిసారిగా భారీగా తాబేళ్లు బయటపడటం గమనార్హం. కాగా ఆంధ్రా నుంచి ములకలపల్లి మీదుగా భద్రాచలం ఏరియాకు వీటిని తరలించే క్రమంలో గుట్టురట్టయినట్లు తెలుస్తోంది. చేపల లోడుతో తాబేళ్లను తరలించే సమయంలో అటుగా పోలీసులు రావడంతో రోడ్డు పక్కన వాటిని పడేసినట్లు పలువురు అనుమానిస్తున్నారు. తాబేళ్లను తరలించడం అక్రమార్కుల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. విచారణ చేపట్టాం.. ఘటనా స్థలాన్ని అటవీ శాఖాధికారులు పరిశీలించి విచారణ చేపట్టారు. ములకలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు నేతృత్వంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 40 తాబేళ్లను పట్టుకోగా, వాటిల్లో 14 మృతిచెంది ఉన్నాయి. మిగిలిన 26 తాబేళ్లను పాల్వంచలోని కిన్నెరసాని రిజర్వాయర్‌కు తరలించారు. భారీగా తాబేళ్లు దొరికిన విషయంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై సురేశ్ సైతం ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
హఠాత్తుగా వేలకొద్ది తాబేళ్లు.. ఎగబడుతున్న స్థానికులు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాబేళ్లు కలకలం రేపాయి. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, తిమ్మంపేట మార్గం మధ్యలో గుర్తుతెలియని వాళ్లు వేలకొద్ది తాబేళ్లను వదిలివెళ్లారు. దీంతో అక్కడ తాబేళ్లను చూసేందుకు స్థానికులు గుమిగూడారు. కొందరు తాబేళ్లను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పెద్దమొత్తంలో ఎక్కడికో తరలించే క్రమంలో పోలీసులు కంటబడటంతో దొంగలు తాబేళ్లను ఇలా వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. స్థానికులు తాబేళ్ల కోసం ఎగబడుతుండటంతో ఇక్కడ కోలాహలం నెలకొంది. -
గుడారమే ‘ఆధారం’
ములకలపల్లి: వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదశ్రామికులు.. ఆంధ్రాలోని నర్సీపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జామాయిల్ తోటలు నరికేందుకు ఇక్కడకు వచ్చారు.. పనిచేసేచోటే తాత్కాలికంగా గుడారాలు వేసుకొని తోటలు నరుకుతున్నారు.. వానైనా, వరదైనా వారికి ఈ గుడారాలే జీవన ‘ఆధారం’.. ఒక్కో గుంపులో సుమారు యాభై మంది వరకూ నివసించే ఈ కష్టజీవుల జీవనానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యం. -
నాన్నకు ప్రేమతో..
ములకలపల్లి: చేసేది చిరుద్యోగమైనా గ్రామానికి ఉపయోగపడాలనే ఆకాంక్షను నెరవేర్చిందీ మహిళ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాధారంలో ఐసీడీఎస్‌లో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది బోడపట్ల భూషమ్మ. తన తండ్రి జ్ఞాపకార్థం రూ.12 లక్షల వ్యయంతో ప్రధాన సెంటర్లో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించింది. గ్రామస్తుల సహకారంతో అయిదేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాలతోపాటు నిత్యపూజలకు లోటురాకుండా ప్రత్యేకంగా పూజారిని ఏర్పాటు చేసింది. చింతల వెంకయ్య స్మారకార్థం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెపుతున్న భూషమ్మ పలువురికీ ఆదర్శంగా నిలుస్తోంది. అయిదు దశాబ్ధాల క్రితం చింతల వెంకయ్య, వెంకమ్మ దంపతులు విద్యుత్‌శాఖలో ఉద్యోగరీత్యా ములకలపల్లి మండల పరిధిలోని మాధారంలో స్థిరపడ్డారు. వీరి ముగ్గురు కుమార్తెల్లో భూషమ్మ తొలి సంతానం కాగా, ఇదే గ్రామంలో భూషమ్మ అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. తన తండ్రి మరణానంతరం అతని జ్ఞాపకార్థంగా చిరస్థాయిగా నిలిచిపోయేలా ఏదైనా ఓఆథ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాలని భూషమ్మ తలంచింది. ఈ క్రమంలో తాను నివాసం ఉండే మాదారంలోని ప్రధాన సెంటర్లో శిథాలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్మించేందుకు ఉపక్రమించింది. గ్రామస్తుల సహకారంతో తాను తలపెట్టిన దైవకార్యాన్ని ముందుకు నడిపించింది. రూ.12 లక్షల వ్యయంతో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయాన్ని పునర్మించింది. మే 25, 2013న వైభంగా ప్రత్యేక పూజల అనంతరం నిర్మించిన ఆలయాన్ని గ్రామానికి అంకితమిచ్చింది. ఆలయం పేరిట రూ. రెండు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసి, వాటిపై వచ్చే వడ్డీని ఆలయ నిర్వహణకు వెచ్చిస్తోంది. ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, నిత్యపూజలు నిరాటకంగా జరిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. భర్త సహకారంతోనే.. నా భర్త బోడపట్ల ముత్తయ్య, పిల్లలు, కుటుంబ సభ్యుల ప్రోద్భలంతో ఆలయ పునః నిర్మాణ పనులు చురుగ్గా సాగాయి. నిర్మాణ సమయంలో గ్రామస్తుల సహకారం మర్చిపోలేనిది. తండ్రి వెంకయ్య జ్ఞాపకార్థం ఆలయం నిర్మించాలనే నా కోరిక నెరవేరింది. గ్రామంలో భక్తిభావం నెలకొనాలన్నదే నా ఆశయం. -
తల్లి లేని నన్ను కాపాడు నాన్నా..
తండ్రి ఇంటి ఎదుట కూతురి దీక్ష ములకలపల్లి: ‘నాన్నా..! తల్లి లేని నన్ను కాపాడు. నువ్వు ఆదరించకపోతే మరణమే దిక్కు. నన్ను కాపాడే వరకు మంచినీళ్లు కూడా తాగను. నీ కాళ్లు మొక్కుతా నాన్నా.. ఇట్లు.. నీ కూతురు దీపిక’ అని ఫ్లెక్సీ పెట్టి ఓ కూతురు తన తండ్రి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం పంచాయతీ పరిధి సుబ్బనపల్లి లో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన తాటిపల్లి రామచంద్రయ్య ఒడ్డురామవరానికి చెందిన గుగులోత్ శారదను 15 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఓ పాప (దీపిక) జన్మించింది. పాపకు నాలుగేళ్ల వయసున్నప్పుడు శారద అనారోగ్యంతో మృతిచెం దింది. అనంతరం దీపికను వాళ్ల అమ్మమ్మ ఇం ట్లో వదిలేసి రాంచంద్రయ్య మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కాగా, దీపికకు థైరాయిడ్ ఉందని, ఆపరేషన్‌కు రూ.50 వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఇన్నాళ్లు బాగోగులు చూసిన అమ్మమ్మ వృద్ధురాలు కావడం తో తనకు భోజనం పెట్టడమే కష్టంగా మారిం దని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. పలుమార్లు గ్రామపెద్దలను ఆశ్రయించి తనను ఆదుకోవాలని వేడుకున్నప్పటికీ ఫలితం లేకుం డా పోయిందని తెలిపింది. కాగా, జగదాంబ గిరిజన సేవా సంఘం దీపికకు సంఘీభావం ప్రకటించారు. దీపికను తండ్రి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
సర్పంచి కుటుంబంపై దాడి
ములకలపల్లి(ముదినేపల్లి రూరల్), న్యూస్‌లైన్ : పాతకక్షల నేపథ్యంలోమండలంలోని ములకలపల్లిలో సర్పంచి కుటుంబంపై దాడి జరిగింది. సర్పంచి ప్రత్తిపాటి రాజేష్ పోలీసులకిచ్చిన ఫిర్యాదు ప్రకారం... గత జులైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందిన నాటి నుంచి తనపై టీడీపీ నేతలు కక్షగట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గురువారం రాత్రి కే మధుబాబు, మిఖాయేలు, జే రాజేష్, అశోక్, వినోద్, ఆశ్వీరరావు తన పైన, తనతల్లి మీరమ్మపై దాడి చేశారని సర్పంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడ్డ సర్పంచి, మీరమ్మ గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా సర్పంచి వర్గీయులే తమపై దాడి చేశారంటూ ప్రత్యర్థి వర్గీయులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఎస్ఐ బీ వెంకటేశ్వరరావు ఇరువర్గాల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నాయకుల పరామర్శ గాయపడ్డ సర్పంచి రాజేష్, ఆయనతల్లి మీరమ్మను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, మండల కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు, సేవాదళ్ మండల కన్వీనర్ తాళ్ళూరి వెంకటేశ్వరరావు పరామర్శించారు. దాడికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.