పునః నిర్మించిన ఆంజనేయ ఆలయం..
ములకలపల్లి: చేసేది చిరుద్యోగమైనా గ్రామానికి ఉపయోగపడాలనే ఆకాంక్షను నెరవేర్చిందీ మహిళ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాధారంలో ఐసీడీఎస్‌లో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది బోడపట్ల భూషమ్మ. తన తండ్రి జ్ఞాపకార్థం రూ.12 లక్షల వ్యయంతో ప్రధాన సెంటర్లో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించింది. గ్రామస్తుల సహకారంతో అయిదేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి ధూపదీప నైవేద్యాలతోపాటు నిత్యపూజలకు లోటురాకుండా ప్రత్యేకంగా పూజారిని ఏర్పాటు చేసింది.
చింతల వెంకయ్య స్మారకార్థం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెపుతున్న భూషమ్మ పలువురికీ ఆదర్శంగా నిలుస్తోంది. అయిదు దశాబ్ధాల క్రితం చింతల వెంకయ్య, వెంకమ్మ దంపతులు విద్యుత్‌శాఖలో ఉద్యోగరీత్యా ములకలపల్లి మండల పరిధిలోని మాధారంలో స్థిరపడ్డారు. వీరి ముగ్గురు కుమార్తెల్లో భూషమ్మ తొలి సంతానం కాగా, ఇదే గ్రామంలో భూషమ్మ అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. తన తండ్రి మరణానంతరం అతని జ్ఞాపకార్థంగా చిరస్థాయిగా నిలిచిపోయేలా ఏదైనా ఓఆథ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాలని భూషమ్మ తలంచింది.
ఈ క్రమంలో తాను నివాసం ఉండే మాదారంలోని ప్రధాన సెంటర్‌లో శిథాలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్మించేందుకు ఉపక్రమించింది. గ్రామస్తుల సహకారంతో తాను తలపెట్టిన దైవకార్యాన్ని ముందుకు నడిపించింది. రూ.12 లక్షల వ్యయంతో శ్రీఅభయాంజనేయస్వామి ఆలయాన్ని పునర్మించింది. మే 25, 2013న వైభంగా ప్రత్యేక పూజల అనంతరం నిర్మించిన ఆలయాన్ని గ్రామానికి అంకితమిచ్చింది. ఆలయం పేరిట రూ. రెండు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసి, వాటిపై వచ్చే వడ్డీని ఆలయ నిర్వహణకు వెచ్చిస్తోంది. ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, నిత్యపూజలు నిరాటకంగా జరిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
భర్త సహకారంతోనే..
నా భర్త బోడపట్ల ముత్తయ్య, పిల్లలు, కుటుంబ సభ్యుల ప్రోద్భలంతో ఆలయ పునః నిర్మాణ పనులు చురుగ్గా సాగాయి. నిర్మాణ సమయంలో గ్రామస్తుల సహకారం మర్చిపోలేనిది. తండ్రి వెంకయ్య జ్ఞాపకార్థం ఆలయం నిర్మించాలనే నా కోరిక నెరవేరింది. గ్రామంలో భక్తిభావం నెలకొనాలన్నదే నా ఆశయం.
Comments
Please login to add a commentAdd a comment