తాబేళ్ల కోసం సొరంగ మార్గం
టోక్యో: శత్రుసేనల ఆటకట్టించడం కోసం, తమ వ్యక్తిగత విషయాల కోసం సొరంగాలు తవ్వారన్న విషయాన్ని మనం చరిత్రలో చదివాం. ఈ మధ్య జపాన్‌లో తాబేళ్ల కోసం కూడా సొరంగాలు తవ్వారు. అయితే ఈ సొరంగ మార్గాల వెనుక ఆసక్తికర విషయం ఉంది. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం మూగ జీవాలు బలవుతుంటాయి. వాటిని కాపాడేందుకు మనం ఎలాంటి ప్రయత్నం చేయం. అసలు అవెందుకు అలా బలవుతున్నాయనే విషయాన్ని కూడా ఆలోచించం. కానీ రైల్వే ట్రాక్‌లు దాటుతూ తరచూ తాబేళ్లు చనిపోతాయన్న విషయం జపనీయులను కదిలించింది. ఈ కారణంగా అక్కడ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండటం వారిని ఆలోచింపజేసింది.
దీంతో తాబేళ్లను సంరక్షించాలనే సంకల్పంతో కోబెలోని సుమా ఆక్వాలైఫ్ పార్క్, వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీలు సంయుక్తంగా రైల్వే ట్రాక్‌ల కింద వాటి కోసం సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు అక్కడ తాబేళ్లు ఎంచక్కా తమ దారిలో పోతూ రహదారి గండం నుంచి తప్పించుకున్నాయి.