మహారాష్ట్ర బార్డర్‌లోకి వెళ్తుండగా చూసిన రైల్వే గ్యాంగ్‌మన్లు
హుడికిలి గ్రామంలో గేదె దూడపై దాడి
ములుగు ఏజెన్సీలో బెంగాల్ టైగర్ కదలికలు?
కాజీపేట రూరల్/ సిర్పూర్ (టి)/ములుగు/వెంకటాపురం(కె): రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా పెద్దపులి కనిపించడంతో రైల్వే గ్యాంగ్‌మన్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గజగజ వణికిపోయారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు రైల్వే స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో సిర్పూర్ కాగజ్‌నగర్–మకోడి రైల్వే స్టేషన్‌ల మధ్య అన్నూర్ గ్రామంలో మంగళవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న పులిని గ్యాంగ్‌మన్లు చూశారు.
ట్రాక్ దాటుతున్న వీడియో తీశారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అప్రమత్తమై బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆయా సెక్షన్‌లలో గల దట్టమైన అటవీ ప్రాంతాల సమీపంలో గల రైల్వే స్టేషన్ల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పులి తెలంగాణ సరిహద్దులో నుంచి మహారాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించి కావలి కారిడార్ దట్టమైన ఫారెస్ట్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు.
కాగా, సిర్పూర్ (టి) మండలం హుడికిలి గ్రామానికి చెందిన దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసి ఉన్న గేదె దూడపై మంగళవారం వేకువజామున పెద్దపులి దాడి చేసి చంపింది. గ్రామంలోకి పెద్దపులి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించి పాదముద్రలు గుర్తించారు.
బోధాపురం అటవీ ప్రాంతంలో బెంగాల్ పులి ఆనవాళ్లు
ఏడాదికాలంగా ప్రశాంతంగా ఉన్న ములుగు ఏజెన్సీ జిల్లాలో మళ్లీ పెద్ద పులి కలవరం మొదలైంది. రాయల్ బెంగాల్ టైగర్‌గా భావిస్తున్న ఈ పెద్దపులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్ అటవీ ప్రాంతాలను దాటి ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం బోధాపురం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారి చంద్రమౌళి నిర్ధారించారు.
ఈ పులి బోధాపురం గ్రామ సమీపంలోని గోదావరి నదిని దాటి మంగపేట మండలం మల్లూరు వైల్డ్ లైన్ జోన్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బోధాపురంతో పాటు ఆలుబాక గ్రామాల శివారుల్లోని గోదావరి లంకల్లో సాగు చేసిన పుచ్చతోట వద్ద సోమవారం రాత్రి సంచరించిందని, పెద్దగా గాండ్రించినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.
తోటల వద్ద కాపలాకు వెళ్లిన రైతులు మంగళవారం ఉదయం పరిశీలించగా పులి పాదముద్రలు కనిపించాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి పులి అడుగులుగా నిర్ధారించారు. పులులకు ఇది మేటింగ్ సమయం కావడం వల్ల గత ఏడాది ఇదే సమయంలో ఆడపులి ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానుంచి ఏటూరునాగారం వైల్డ్ లైన్‌లో (ఎస్1) సంచరించింది.
Comments
Please login to add a commentAdd a comment