ఆశ్చర్యపరుస్తున్న ఓ పులి అసాధారణ ప్రవర్తన
అడవులను వదిలి రోడ్లు, వ్యవసాయ భూములు, జనావాసాల వద్ద సంచారం
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో రెండ్రోజుల క్రితం బంధించిన అధికారులు
ఈ ప్రవర్తనకు కారణాలు తెలుసుకోవడానికి సీసీఎంబీకి నమూనాలు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పెద్ద పులులు జనసంచారానికి ఆమడదూరంలో ఉంటూ అడవుల్లోనే సంచరిస్తుంటాయి. కానీ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా విరూర్ అటవీ రేంజ్ పరిధిలోని రాజూరా తాలూకాలో రెండు రోజుల కిందట అధికారులు బంధించిన ఓ పులి మాత్రం భిన్నంగా కొన్ని రోజులపాటు అసాధారణ రీతిలో ప్రవర్తించింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్ల వెంబడి, జనావాసాలు, వ్యవసాయ భూముల వద్ద తచ్చాడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో ఆ పులిని బంధించిన అధికారులు దాని ప్రవర్తనకు గల కారణాలు ఏమిటో కనిపెట్టే పనిలో పడ్డారు.
పులి నుంచి పలు నమూనాలు సేకరించి వాటిని హైదరాబాద్‌లోని సీసీఎంబీతోపాటు బెంగళూరులోని మరో ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపారు. అలాగే మరిన్ని పరీక్షలు చేపట్టేందుకు వీలుగా దాన్ని చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్ (టీటీసీ)కు తరలించారు. ఈ అంశంపై స్పష్టత వచ్చాక తెలంగాణ అటవీ అధికారులతో వివరాలు పంచుకుంటామని చెబుతున్నారు.
మనుషులపై దాడి ఆ పులి పనేనా?
మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ఇటీవల ఓ పులి పలువురిని హతమార్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకరిని చంపడంతోపాటు మరొకరిపై దాడి చేసింది. అలాగే మహారాష్ట్ర సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల్లోనూ పలువురిని చంపింది. పత్తి ఏరివేత సీజన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలు ఇరు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా పట్టుబడిన పులి అదేనా అని నిర్ధారించుకొనేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి నేపథ్యం ఏమిటో, అది ఎక్కడిదో తెలుసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఆ పులి ప్రవర్తన తెలుసుకోవడం కష్టమే..
పులుల సహజ స్వభావాన్ని బట్టి చూస్తే వాటికి మనుషుల పొడ గిట్టదు. అకస్మాత్తుగా పులి ఎదురైతే మనిషి ఎలా భయాందోళనకు గురవుతాడో అంతకంటే ఎక్కువగా పులి భయానికి గురవుతుంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న పులులను గమనిస్తే అవి అక్కడ కూడా మనుషులు, పశువులపై దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పులులు ఇక్కడకు వచ్చాక కూడా ఆ అలవాటును మానుకోలేక పోతున్నట్లు అంచనా వేస్తున్నాం. పులుల కదలికలు ఎలా ఉంటాయో కచ్చితంగా చెప్పలేం. చంద్రాపూర్‌లో బంధించిన పులి నుంచి సేకరించిన నమూనాలతో వాటి అసాధారణ ప్రవర్తన గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమే.
– ఎ.శంకరన్, వైల్డ్‌లైఫ్ ఓఎస్‌డీ, తెలంగాణ అటవీశాఖ
Comments
Please login to add a commentAdd a comment