బీజేపీని బలోపేతం చేయమంటే.. నిండా ముంచారు! | Daggubati Purandeswari always support to TDP and Chandrababu | Sakshi
Sakshi News home page

బీజేపీని బలోపేతం చేయమంటే.. నిండా ముంచారు!

Published Sun, Apr 14 2024 4:24 PM | Last Updated on Sun, Apr 14 2024 5:00 PM

Daggubati Purandeswari always support to tdp and chandrababu - Sakshi

కప్పుకునేది కాషాయం కండువా. చేసేది పసుపు రాజకీయం. ఇదీ ఏపీ బిజెపి చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలి. సంక్షోభంలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని బతికించుకోడానికి.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేందుకు పురందేశ్వరి పడని పాట్లు లేవు. ఏపీలో బిజెపిని బలోపేతం చేయవమ్మా అని అధ్యక్ష పదవి కట్టబెడితే.. బిజెపిని నిండా ముంచి మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం ఎందాకైనా వెళ్తానంటున్నారు పురందేశ్వరి.

టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయినపుడు  పురందేశ్వరి దంపతులే మంచి కత్తి ఒకటి చంద్రబాబుకు కానుకగా ఇచ్చారని అప్పట్లో వైస్రాయ్ కోళ్లు  ఆగ్రహంగా కూశాయి. వైస్రాయ్ ఎపిసోడ్‌లో.. తన తండ్రిని  ముఖ్యమంత్రి పీఠం నుండి నిర్దాక్షిణ్యంగా దించేసిన  కుట్రలో ఎన్టీయార్ తనయ దగ్గుబాటి  పురందేశ్వరి.. ఆమె భర్త వెంకటేశ్వరరావులు భాగస్వాములన్నది బహిరంగ రహస్యం. వెన్నుపోటులో తనకు అండగా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని అంటారు. తీరా వెన్నుపోటు పొడిచేసి కత్తికంటిన నెత్తుటిని తుడిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత  దగ్గుబాటి విషయాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు.

ఇవాళో రేపో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని దగ్గుబాటి కొద్ది రోజులు వెయిట్ చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిదని దాని వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మనసా వాచా కర్మేణా నమ్మడం వల్ల వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి రాలేదు. అప్పటికి కానీ తాము మోసపోయామని దగ్గుబాటి దంపతులు గ్రహించలేకపోయారు. తెలిసిన తర్వాత ఉక్రోషంతో టిడిపి నుండి బయటకు వచ్చి చంద్రబాబుపై కారాలూ మిరియాలను మిక్సీలో వేసి రుబ్బారు. కొంతకాలం బిజెపిలో మరి కొంతకాలం కాంగ్రెస్ లో కాలక్షేపం చేసిన వెంకటేశ్వరరావు ఖాళీ సమయంలో ఓ ఆత్మకథ రాసి అందులో చంద్రబాబును  నిర్మా వాషింగ్ పౌడర్ తో ఉతికి ఆరేశారు.

ఆ కోపం చాలా ఏళ్ల పాటు చంద్రబాబులో ఉండిపోయింది. అందుకే 2014లో టిడిపి-బిజెపిలు పొత్తు పెట్టుకున్నా.. రాజంపేట నుండి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరిని దగ్గరుండి మరీ ఓడించారు చంద్రబాబు.ఎన్నికల ఫలితాల రోజున పురందేశ్వరి ఓడారని తెలిసిన తర్వాతనే చంద్రబాబు సంతృప్తిగా నవ్వారని  టిడిపి వర్గాలంటాయి.

రెండు దశాబ్దాలకు పైగా నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం అలానే కొనసాగింది.  2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం చెందడం ఆ తర్వాత వరుసగా  అన్ని స్థానిక ఎన్నికల్లోనూ టిడిపి అడ్రస్ గల్లంతు కావడం జరిగిపోయాయి. 2024 ఎన్నికల్లోనూ టిడిపి లేచి నిలబడే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ సమయంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండె సంబంధ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరితే పరామర్శ పేరిట చంద్రబాబు వెళ్లారు. అలా వెళ్లడానికి రామోజీ సలహాయే కారణమంటారు. విడిపోయిన నారా-దగ్గుబాటి కుటుంబాలు మళ్లీ కలవకపోతే  వైఎస్సార్‌ కాంగ్రెస్ను ఎదుర్కోలేమని రామోజీరావే  రెండు కుటుంబాలకూ నూరిపోశారని కృష్ణా జిల్లా కోళ్లు  మొహమాటంగా కూశాయి.

అలా రాజగురువు ఇచ్చిన టిప్ తో ఆసుపత్రిలో  దగ్గుబాటి దంపతలు కాళ్లమీద పడిపోయిన చంద్రబాబు వెన్నుపోటు ఘటన అనంతరం తాను  చేసిన ద్రోహాన్ని ఒప్పుకుని క్షమించమన్నారట. దాంతో దగ్గుబాటి దంపతులు  చంద్రబాబును క్షమించేసి ఇకనుంచి కలిసుందాం  రా అన్నారట.ఆ క్రమంలోనే ఎన్టీయార్ నాణెం విడుదల చేసినపుడు పురందేశ్వరే  ప్రణాళిక రచించి చంద్రబాబును  ఎన్టీయార్ నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబ సభ్యుల ముసుగులో ఆహ్వానించారు. అక్కడ బిజెపి  అధ్యక్షుడు నడ్డాతో  వన్ టూ వన్ మాట్లాడుకునే వీలూ కల్పించారు. బిజెపితో తిరిగి పొత్తుకు ఆ క్షణానే చంద్రబాబు నడ్డాను మోహించినట్లు నటించారు.

ఆ తర్వాత 371 కోట్ల రూపాయలు దోచుకు తిన్న స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుణ్ని కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేసి జైలుకు పంపగానే.. టిడిపి నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులకన్నా కూడా ముందుగా స్పందించింది పురందేశ్వరే. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమం అని ఆమె ముందస్తుగా ఖండించేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాలకోసం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతల అపాయింట్ మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే పురందేశ్వరి ఏపీ బిజెపి నేతలకు కూడా చెప్పకుండా అర్జంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి  హస్తినలో దిగి అక్కడ తన చెల్లెలి కొడుకు నారా లోకేష్ ను తీసుకుని పార్టీ అగ్రనేత కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ కుదిర్చి  తన వంతు సాయం అందించారు.

ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో టిడిపితో పొత్తు విషయంలో బిజెపి జాతీయ నాయకత్వం  అనాసక్తిగా ఉండడంతో పురందేశ్వరే జోక్యం చేసుకుని టిడిపితో పొత్తు కుదిరేలా అగ్రనేతల దగ్గర మంత్రాంగం నడిపారని అంటారు. మొత్తం మీద టిడిపి-బిజెపిల మధ్య పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత ఏపీ బిజెపిలో  చంద్రబాబు అనుకూల నేతలకు టికెట్లు ఇప్పించారు. చంద్రబాబు అవినీతిని  అను నిత్యం  ఎండగట్టిన సోము వీర్రాజు, జి.వి.ఎల్. నరసింహారావులకు టికెట్ దక్కకుండా పక్కన పెట్టారు పురందేశ్వరి. అలా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలకోసం తాను ఏమైనా చేస్తానని చాటుకున్నారు.

తాజాగా  టిడిపి నేతల అవినీతి విషయంలో   చట్ట ప్రకారం నడుచుకుంటూ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలంటూ ఏకంగా ఈసీకే లేఖ రాసి బరితెగించేశారు పురందేశ్వరి.ఫలానా అధికారులు ఉంటే అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం వేరు..వారిని తప్పిస్తే ఆ స్థానాల్లో ఎవరిని వేయాలో కూడా పురందేశ్వరే   సిఫారసు చేస్తూ  జాబితా పంపడం వివాదస్పదం అయ్యింది. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి స్థాపించిన టిడిపి గెలిచి అధికారంలోకి రాలేకపోతే ఇక  పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని పురందేశ్వరి భయపడుతున్నారు. తన తండ్రి పెట్టిన పార్టీని గుంజుకుని..తన తండ్రి ఆశాయలకు తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి జారుకోకూడదని పాపం పురందేశ్వరి విపరీతంగా కష్టపడుతున్నారు. అయితే ఏవీ వర్కవువ్ కావంటున్నారు రాజకీయ పండితులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement