akshara tuniram
-
కొంచెం కొంచెం.. ఇప్పుడిప్పుడే..
కొంచెం కొంచెం, ఇప్పుడిప్పుడే లెక్కలు తేలుతున్నాయ్. క్యాపిటల్ అమరావతి భూకుంభకోణం వ్యవ హారంలో రమారమి నాలుగువేల ఎకరాల బినామీ ఉంటుందని ఆరో పణ. దీనిపై నిజం నిగ్గు తేలాల్సి ఉంది. అయితే, అమరావతి పునాది బినామీ భూముల మీదే పడింద న్నది సత్యం, పునఃసత్యం. అప్పట్లో మన ప్రియతమ ముఖ్య మంత్రి నాలుగు జిల్లాలకి ఆశపెట్టి చివరకు ఆయన కట్ట పెట్టాలనుకున్నవారికి సంపూర్ణంగా న్యాయం చేకూర్చారు. అయితే, అది నెమర్లకు మాత్రం అందడం లేదు. కథ అడ్డంగా తిరిగింది. ముప్పై వేల ఎకరాల పూలింగ్ ఒక చిత్రం. అసలు అంత పచ్చటి భూమి అవసరమా అంటే ఇంకా అవసరం అన్నారు. ప్రధానమంత్రి మట్టి పిడతలతో అనేక నదీ జలాలు, నదుల మట్టి వారి దీవెనలతో రంగరించి క్యాపిటల్ శంకుస్థాపన పవిత్రం చేశారు. ముహూర్త బలం ఉన్నట్టు లేదు. ఆ పునాది ఏ మాత్రం ఎక్కి రాకుండా గుంటపూలు పూస్తోంది. పైగా ఆ గుంటలో నిజాలు రోజుకొక్కటి పూస్తు న్నాయ్. వాళ్లని వీళ్లని ఆఖరికి తెల్లరేషన్ కార్డు వారిని, అసలు కార్డే లేని వారిని బెదిరించి స్వాములు చదరాలు చదరాలుగా భూమి కొనేశారు. ఇక క్యాపిటల్ వస్తే ఆ నేలలో పైకి విస్తరిం చడమేనని కలలు కన్నారు. అసలీ వేళ క్యాపిటల్ ఎక్కడున్నా ఒకటే. ఏడాది కాలంలో కరోనా ప్రత్యక్షంగా బోలెడు పాఠాలు నేర్పింది. గొప్పగొప్ప ఐటీ పార్కులు, సాఫ్ట్వేర్ సామ్రాజ్యాలు ఓ మూలకి ఒదిగిపోయి కూర్చున్నాయ్. వర్క్ ఫ్రం హోం సంస్కృతి వచ్చింది. కాలుష్యాలు తగ్గాయి. ఎవరిల్లు వారి వర్క్ ప్లేస్ అయింది. పెద్ద పెద్ద షోరూములన్నీ ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయ్. ఎటొచ్చీ మనీట్రాన్స్‌ఫర్ చేస్తే చాలు ధనాధన్ సరుకు గుమ్మంలో ఉంటుంది. టెలీ మెడిసిన్ ప్రాచుర్యం పొందుతోంది. టెక్నాలజీ రోజురోజుకీ చిలవలు పలవలుగా వృద్ధి చెందుతోంది. ఈ సందర్భంలో ముప్పై వేల ఎకరాల మూడు పంటల భూమి క్యాపిటల్‌కి అవస రమా? టోక్యోలో, కియోటోలో వంద చదరపు అడుగుల్లో కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తుందిట. మనవి అసలే పచ్చని వ్యవసాయ క్షేత్రాలు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఇంకా ముందుకువెళ్లి అతి తక్కువ స్పేస్‌లో ఇమిడిపోతాయి. అన్ని అవసరాలు తీరుస్తా. నేడు మహా విశ్వం మనిషి గుప్పి ట్లోకి వచ్చేసింది. అతి త్వరలో రానున్న సాంకేతిక విప్లవం అనేక పెను మార్పులు తీసుకురానుంది. ఆధునిక మానవుల్లారా! మనతోపాటు ఒక మట్టి గడ్డ కూడా రాదని తెలిసి నేలమీద భ్రమలు వదలండి. నిన్నగాక మొన్ననే కోవిడ్ నేర్పిన పాఠాలు మన కళ్లముందు కదులుతు న్నాయి. జీవితం క్షణభంగురం, బుద్బుదప్రాయం ఇత్యాది ఎన్నో ఉపమానాలు మనకు తెలుసు కానీ లక్ష్యపెట్టం. ఆఖ రికి ఆరడుగుల నేల కూడా కరువైంది కాదా?! మనది వేద భూమి, కర్మక్షేత్రం. మనది వేదాలు, ఉపనిషత్తులు పండిన నేల. ప్రపంచాన్ని జయించి విశ్వవిజేతగా పేరుపొందిన అలెగ్జాండర్ ది గ్రేట్ భారతీయ రుషి ప్రపంచాన్ని పలక రించాలనుకున్నాడు. తన గుర్రం మీద ఒక రోజు సాంతం తెల్లారకుండానే రుష్యాశ్రమాలవైపు బయలు దేరాడు. దూరంగా ఒక ఆశ్రమం దగ్గర గుర్రందిగి మెల్లగా వినయంగా నడుచుకుంటూ కదిలాడు అలెగ్జాండర్. అక్కడ భారతీయ రుషి అప్పుడప్పుడే లేలేత అరుణ కిరణాలతో ఉదయిస్తున్న సూర్యునికి అభిముఖంగా తిరిగి, రకరకాల భంగిమలలో నమస్కరిస్తూ మంత్రాలతో అర్చిస్తున్నాడు. కాసేపు గమనిం చాడు. విశ్వవిజేతకి ఏమీ అర్థం కాలేదు. నాలుగు అడుగులు ముందుకు వేసి, మహాత్మా! నన్ను అలెగ్జాండర్ అంటారు. విశ్వవిజేతని. ఈ మహా ప్రపంచంలో నాది కానిది ఏదీ లేదు. మీ దర్శనభాగ్యం అబ్బింది. చెప్పండి. తమరికేమి కావాలో ఆజ్ఞాపించండి. మీ పాదాల వద్ద పెట్టి వెళ్తాను. సంకోచించ కండి అంటూ ప్రాధేయపడ్డాడు. రుషి ఒక్కసారి వెనక్కు తిరిగి ప్రతి నమస్కారం చేశాడు. ‘అయ్యా, ధన్యవాదాలు. ప్రస్తుతానికి నాకేమీ అవసరం లేదు. కాకపోతే చిన్న విన్నపం. మీరు కొంచెం పక్కకి తప్పుకుంటే, నాపై ఎండపొడ పడు తుంది. సూర్య భగవానుడి స్పర్శ తగులుతుంది. అదొక్కటి ప్రసాదించండి చాలు’ అన్నాడు రుషి. వేద భూమి నిర్వచనం విశ్వవిజేతకి అర్థమైంది. తర్వాత కాలం చెల్లి అంతటి విశ్వవిజేతా గతించాడు. నన్ను అంతిమయాత్రగా తీసుకువెళ్లేటప్పుడు, నా రెండు చేతులూ బయటకు ఉంచి, ఇంతటి విజేత ఆఖరికి రిక్త హస్తాలతో వెళ్తున్నాడని సాటివారికి ఎరుకపరచండి. నా జీవితం కడసారి ఈ సందేశం జాతికి ఇవ్వాలని విన్నవిం చుకున్నాడు. చాలా చిన్నది జీవితం. చేయతగిన మంచి ఇప్పుడే చేయాలి. వేలాది ఎకరాలు వీపున పెట్టుకు వెళ్తామని ఆశించవద్దు. అది జరిగే పని కాదు. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
కరోనాతో కలిసి బతకాల్సిందే!
ఈ మాట చాలా ముందస్తుగా అన్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మీద నిప్పులు చెరిగారు. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అన్నారని కరోనా తీవ్రత గురించి ఆయనకేం తెలియదని.. మాట లొచ్చి మైకు దొరికిన టీడీపీ నాయ కులంతా దుయ్యబట్టారు. పది, పదిహేను రోజుల వ్యవధిలో కింది నుంచి పైదాకా ఇదే మాటకి వచ్చి స్థిరపడ్డారు. ముందన్నవాడు దోషి. తర్వాతి వారంతా దిశానిర్దేశకులు. మన భారతదేశంలో ముందుగా కరోనా వైరస్ బారిన పరోక్షంగా పడి, బతికి బట్టకట్టినవారు పాండవులు. వారు ద్వాపర యుగంలో పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని ఏడాది అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. ఇది చాలా ప్రమాద కరం. చాలా భయంకరం! తేడా వస్తే మళ్లీ పన్నెండేళ్లు అర ణ్యవాసం... ఇక ఇంతే సంగతులు. అందుకని పాండవులు, ద్రౌపది చాలా విపత్తు మధ్యన ఏడాది గడిపారు. దుర్యో ధనాదులు ఎలాగైనా వీరి జాడ తెలుసుకోవాలని గూఢచా రులను పెంచారు. పాండవులు కీచకుడితో, బకాసురుడితో దెబ్బలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జనమంతా జాగరూక తతో ఉంటే కరోనా ఏమీ చెయ్యదని అంటున్నారు. ఈలోగా నడుస్తున్న ప్రభుత్వంమీద ఏదో ఒక రాయి విస రడం అపోజిషన్‌కి ఉత్సాహం. వారు నిత్యం వార్తల్లో ఉండకపోతే మరుగున పడిపోతామని భయం. అంతేగానీ ఇలాంటి సంకట స్థితిలో మన విమర్శలని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనే ఆలోచనే ఉండదు. కరోనాతో కలిసి జీవించటమంటే, చిన్న చిన్న ఉపకారాలు అవసరంలో ఉన్నవారికి చేస్తే చాలు. అదే పదివేలు. పాకిస్తాన్ యుద్ధ సమయంలో నాటి మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి– దేశం కోసం ప్రతి ఒక్కరూ ఒక్క చపాతీ తగ్గించుకుని త్యాగం చెయ్యండని అభ్యర్థించారు. దేశం బాగా స్పందిం చింది. ఇప్పుడు కూడా అన్నానికి అలమటిస్తున్న వారెం దరో ఉన్నారు. ఒక్క పిడికెడు మెతుకులు అన్నార్తులకు తీసిపెట్టండి. పుణ్యం పురుషార్థం. పంచగలిగిన వారు పదంటే పది పాల ప్యాకెట్లు పంచండి. ఇప్పుడు అందరం మంచి ఆహారం తీసుకోవలసిన సమయం. పోనీ రెండు గుడ్లు, ఏదైనా ఒక పండు. వీటికి ఏమాత్రం శ్రమ పడన క్కర్లేదు. జేబులో చెయ్యిపెట్టి కొంటే చాలు. మీరు కాకుంటే బోలెడు స్వచ్ఛంద సంస్థలు సేవ చేస్తున్నాయ్. వారికి వ్వండి. మహా ప్రసాదంగా పంచిపెడతారు. వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్నాడు మహాకవి గురజాడ. ఇంకా జరుగుబాటు, ఆర్థిక స్తోమత ఉన్న పింఛన్‌దార్లు తమ పెన్షన్‌ని పూర్తిగా లేదా పాక్షికంగా త్యాగం చెయ్యొచ్చు. సర్వీస్‌కంటే అధికంగా పెన్షన్ స్వీక రిస్తున్నవారు చాలామంది ఉంటారు. అది వారి హక్కే కావ చ్చుగానీ ఈ విపత్కర పరిస్థితిలో ప్రపంచాగ్నికొక సమిధని ఆహుతి ఇవ్వచ్చు. ఈ తరుణంలో వాకిట్లోకి వచ్చే కూరల బండ్ల దగ్గర, పండ్ల దగ్గర గీచిగీచి బేరాలు చెయ్యకుండా కొనండి. చాలు, వారిలో అత్మస్థైర్యం పెరుగుతుంది. అందులో కొంతభాగం పండించే రైతుకి కూడా చేరుతుంది. అనుభవజ్ఞులు సూచించిన జాగ్రత్తల్ని పాటించండి. వ్యక్తి గత పరిశుభ్రత ముఖ్యం. ఎవర్నీ రాసుకు, పూసుకు తిరగ వద్దు. ఎక్కడైనా ఏ రేషన్ షాపుదగ్గరైనా, ఏ బ్యాంక్ వద్ద యినా రద్దీ చెయ్యద్దు. అందరికీ ఇస్తారు. ఇవ్వాళ కాకుంటే రేపు. బ్యాంకులో మీ ఖాతాలో జమ అయ్యాక ఆ డబ్బు ఇక మీదే. ఒక్కరోజు కొందరు సంయమనం పాటిస్తే చాలు. దొరికినంతలో మంచి ఆహారం తీసుకోండి. ఖరీదైనవి చాలా గొప్పవని భావించవద్దు. ఆకుకూరలు చాలా మంచిది. దేశవాళీ పళ్లు బలవర్ధకమైనవి. స్తోమతగల ప్రతివారూ తమచుట్టూ ఉండే నాలుగైదు కుటుంబాల యోగక్షేమాల్ని, ఆకలినీ పట్టించుకుంటే చాలు. ఈ తరు ణంలో దీనికి మించిన దేశభక్తి దేవుడి భక్తి వేరే లేదు. అపోజిషన్ వాళ్లం కాబట్టి, విధిగా రాళ్లు వెయ్యాలనే సంక ల్పంతో ఉండవద్దు. మంచి సూచనలివ్వండి. గత్తరలో ఉన్న ఈ ప్రజని మరింత గత్తర పెట్టకండి. మా ఊళ్లో ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు. సహృద యుడు, సంస్కారి. వందల ఎకరాల భూమి ఉండేది. పొలం పనులు వస్తే అట్టే ఊడ్పులు, కలుపులు, కోతలు వగైరాలకు ఊరు కూలినాలి జనమంతా వెళ్లేవారు. ఆయ నకో లెక్క ఉండేది. ఆడపిల్ల పైట వేసుకుంటే, మగ పిల్లాడు పంచెకట్టుకుంటే అందరితో సమంగా కూలి ముట్టజెప్పే వారు. అందుకని అయిదారేళ్ల ఆడపిల్లలకి గౌను మీద పైట, నిక్కర్‌మీద పంచె బిగించి చేలో దిగేవారు. ఈ మోసం అందరికీ తెలుసు. ఒకసారి ఆ భూస్వామితో అంటే– ‘పర్వాలేదులే, అయినా అంతా వాళ్ల కష్టం నించి వచ్చిం దేగా. నామీద ఇష్టంతో, దయతో వచ్చి చాకిరీ చేస్తున్నారు. ఇంతకంటే మనం చేసి చచ్చే పుణ్యకార్యాలేముంటాయ్’ అన్నాడు. అదీ మన భారతీయత. అదీ మన సంప్ర దాయం. గుర్తు చేసుకుని కరోనాతో కలిసి జీవిద్దాం. శుభమస్తు! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
క్షీరసాగర మథనం
చాలా రోజుల తర్వాత నిషా తిరిగి మబ్బులా ఆవరించింది. వీధులమీద చిత్రవిచిత్రమైన సందళ్లు. ఎప్పుడూ ఇంత స్తబ్దుగా ఈ సమాజం ఉన్నది లేదు. ఎంత డబ్బు?! నమ్మలేని నిజాలు! రోజువారీ రాష్ట్ర అమ్మకాల్లో సామాన్యుడి వాటా పదిహేను కోట్లు. అందులో పేదవాడి చెమట నెత్తురు కనీసం ఏడె నిమిది కోట్లు. ఇంతాచేసి ఇది ఒక్కరోజు కలెక్షను. పైగా ఇది కేవలం ద్రవాల వెల మాత్రమే, ఇందులో ఉపద్రవాలపై ఖర్చు ఉంటుందని అనుభవజ్ఞుడి అంచనా. ఇది పుట్టినప్పుడు దీనికి ‘సురాపానం’ అని నామకరణం చేశారు. అంటే దేవతల అధికారిక డ్రింక్. (చదదవండి: ఐఏఎస్‌లకు ఏం తెలుసు?) ఇది ఎప్పటికీ అసురపానం కాలేదుగానీ క్రమంగా ఓ మెట్టు పైకి చేరినకొద్దీ సురలే అసురులై పోతారని ‘మధు మోహం’ లేనివారు విశ్లేషిస్తుంటారు. కృతయుగంలో ఏ దివ్యముహూర్తాన క్షీర సాగర మహాక్రతువు ఆరంభమైందోగానీ ఆ మహా మథనంలో ఎన్నో వింతలు విశేషాలు పుట్టు కొచ్చాయి. ఐరావతమనే తెల్లఏనుగు నించి వెన్నె లలు కురిపించే చందమామ దాకా ఆ చిలకడంలో వెన్నెముద్దల్లా తేలాయి. దీన్ని జయప్రదం చేయ డానికి విష్ణుమూర్తి రెండు అవతారాలు ధరించాడు. కూర్మమై మునిగిపోతున్న మంథరగిరి కవ్వాన్ని వెన్నంటి నిలిపాడు. శివదేవుడు ఘోర కాకోలమైన విషం చెలరేగినపుడు జుంటి తేనెలా స్వీకరించి గొంతులో నిలిపి గరళ కంఠుడైనాడు. మధ్యలో అనేకానేక విశేషాలు వింతలు వచ్చాయి. అచ్చర కన్నెలు నాట్యభంగిమలతో పాల నురగల్లో కలిసి పోయారు. ఒక దశలో ‘వారుణి’ దిగి వచ్చి ఏరులై ప్రవహించింది. సేవించిన వారందరికీ తిమ్మి రెక్కింది. తిక్క రేగింది. దేవ దానవులు రెచ్చి పోయారు. కలిపిన పట్టువదిలి ఊగసాగారు. విష్ణు మూర్తి, ఇంకో నాలుగు తిప్పులు తిప్పితే ఆశించిన అమృతం సిద్ధిస్తుంది లేకపోతే ఎక్కడికో జారి పోతుందని హెచ్చరించాడు. నిజంగానే అమృతం జాడ పొడకట్టింది. నిత్య యవ్వనంతోబాటు, జర రుజ మరణాల్ని నియంత్రించే అమృతం వచ్చేసరికి మాకంటే మాకంటూ సురాసురులు ఎగబడ్డారు. విష్ణుమూర్తి గమనించాడు. అన్యాయం, అక్రమం, స్వార్థం, భయం, పక్షపాత బుద్ధి అక్కడే పడగ విప్పాయి. దేవుడు మోహినిగా అవతారం ధరిం చాడు. వడ్డన సాగించాడు. ధర్మ సంస్థాపన కోసం జరగాల్సిన దగా దేవుడి చేతుల మీదుగా జరిగి పోయింది. చివరకు సురలకే అమృతం దక్కింది. అసురలకు శ్రమలో వాటా చిక్కింది. కలియుగంలో ఎన్టీఆర్ పాలనలో తెలుగు వారుణి వాహినిగా ప్రభుత్వ సారాయిగా జనం మీదకు వచ్చింది. అన్న గారు కిలో రెండు రూపాయల బియ్యం పథకం దేశాన్ని కుదిపేసింది. ఆనాడు ఆ బియ్యం ధర శ్రామిక వర్గాన్ని నిషా ఎక్కించింది. మిగిలిపోతున్న డబ్బులు వారుణి వాహిని వైపు మొగ్గు చూపాయి. అప్పుడే చాలామంది కష్టపడి ఈ కొత్త మత్తుని అలవాటు చేసుకున్నారు. ప్రభుత్వం ఆ చేత్తో ఇచ్చి, ఈ చేత్తో లాక్కుందని జనం వాపోయారు. (చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా) ఇప్పుడు షాపులు తీశారని ఒక విమర్శ. రాష్ట్ర సరిహద్దు కూత వేటు దూరంలో ఉంటుంది. భాగ్యనగర్ వైన్స్‌కి, బెజవాడ వైన్స్‌కి పది అంగల దూరం ఉంటుంది. ఆ దూరాన్ని ఎవడాపగలడు. అప్పుడు మళ్లీ అదొక విమర్శ. జగన్ మద్యం ధరలు పెంచారట. కొందరైనా విముఖత చూపుతారని ఆశతో. బీద బిక్కి దీనివల్ల చితికి పోతున్నారని చంద్రబాబు ఒక మద్యాస్త్రం సంధించారు. ఎవరి మద్యం వారే కాచుకోండి అంటే ఎట్లా ఉంటుంది? ప్రతి ఇల్లూ ఒక బట్టీ అవుతుంది. ధరలు తగ్గు తాయి. ఏదైనా ఎదుటివారికి చెప్పడం చాలా తేలిక. మనం ఏం చేశామో మనకి గుర్తుండదు. అందుకే నేటి అపోజిషన్ లీడర్లు పాత పేపర్లు తీరిగ్గా చదువు కోవడం మంచిదని ఒక పెద్దాయన సూచిస్తున్నారు. మా ఊరి పెద్దాయన చంద్రబాబు వీరాభిమాని, ‘రోజూ హీనపక్షం రెండు లేఖలు వదుల్తున్నారండీ’ అంటే ఆయన చిద్విలాసంగా నవ్వి, పోన్లెండి ఇవ్వా ల్టికి ఇంటిపట్టున ఉన్నాడు. తాజా కూరలు తాజా పాలు, వేళకి తిని తగినంత విశ్రాంతి తీసుకుంటు న్నట్టున్నాడు. రోజూ ఒకటికి రెండుసార్లు ఇబ్బంది లేకుండా అవుతున్నట్టున్నాయ్ మంచిదే! అన్నారు. అంటే నిత్యం చంద్రబాబు వదుల్తున్న లేఖల్ని మా వూరి పెద్దాయన ఎలా భావిస్తున్నారో చాలా లౌక్యంగా చెప్పారు. అందుకని ఈ దినచర్య మార్చండి. వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
అర్ధరాత్రి శపథాలు
రెండు రోజుల్లో పాత సంవత్సరం వెళ్లిపోయి, ఘల్లుఘల్లుమని బంగరు గజ్జెల చప్పుళ్లతో కొత్త సంవత్సరం విశ్వమంతా అడుగు పెట్టనుంది. ఈ నవ వత్సర శుభవేళ అంద రికీ శుభాకాంక్షలు. డిసెం బర్ 31 అర్ధరాత్రి దాకా మేలుకుని గడచిన సంవ త్సరానికి వీడ్కోలు చెబుతూ, ఆ వెంటనే వచ్చే కొత్త వత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుకుంటారు. ఆశావాదులు 2020 అన్ని విధాలా లాభసాటిగా ఉంటుందని బోలెడు నమ్మ కాలతో పాత సంవత్సరపు చివరి రాత్రిని గడు పుతారు. నిరాశావాదులు చప్పరింతలతో ‘ఏం తేడా ఉంటుంది. అంతా మన భ్రమ తప్ప’ అంటూ సందేశాలు ఇస్తుంటారు. అసలు పాత కొత్త అనే తేడా లేనే లేదు. కాలం అనేది పెద్ద దారపు బంతి అయితే, అందులో ప్రతి జానెడు నిడివి ఒక ఏడాది అంటే క్రీస్తు శకంలో 2019 జానలు అయిపోయి, తర్వాతి జాన మొదలైనట్టు అన్నమాట. ఆస్తికులు ఆ జాన సాక్షాత్తూ దేవుడిదని నమ్ముతారు. నాస్తికులు నమ్మరు. హేతువాదులు అసలు కాలాన్ని ఇంకో విధంగా నిర్వచిస్తారు. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల రోజులు, సూర్యుడి చుట్టూ తిరగడంవల్ల సంవత్సరాలు లెక్కకు వస్తున్నాయంటారు. ప్రాణం ఉన్నప్పుడే కాలం గణనకి వస్తుంది. రాయికి, రప్పకి కాల ప్రభావం, ఆయుర్దాయం ఉండవు. ఇలా హేతు వాదంతో అప్లయిడ్ ఫిజిక్స్లోకి, సాలిడ్ స్టేట్ కెమి స్ట్రీలోకి తీసికెళ్లి చివరకు ఎన్సైక్లోపీడియా ఇరవై రెండో వాల్యూమ్‌లో మనల్ని నించోబెట్టి వాళ్లదా రిన వాళ్లు వెళ్లిపోతారు. అందుకే హేతువాదుల వెంట నడిచేటప్పుడు ఆచితూచి అడుగులు వెయ్యండి. ఆ మధ్య కరడుగట్టిన ఓ హేతువాది బారినపడ్డా. ‘మీ తాతగారు నిజంగా మీ తాత గారని గ్యారంటీ లేదు. అదొక నమ్మకం మాత్రమే. పాక్షిక సత్యం. డీఎన్ఏలు చూసి నిర్ధారించిన పూర్ణసత్యాలు కావు’ అంటూ సశాస్త్రీయ తర్కంలోకి దిగాడు. నాకు మా తాతగారి మీద డౌట్ వచ్చింది. మా నాయనమ్మని అడిగా. ఆవిడ నవ్వేసి ఎవడ్రా నీకు చెప్పిన అంట్లవెధవ అని అడిగింది. మీ తాత ఛండాలపు బుద్ధులన్నీ అమర్చినట్టు నీకు వచ్చి పడ్డాయ్. ఇంతకంటే రుజువేం కావాలి’ అంటూ తాతగారిని తలచుకుంటూ కంటతడి పెట్టింది. ఈ సంధి కాలంలో, పాత కొత్తల బేసందులో అందరం ఎన్నెన్ని తీర్మానాలు చేసుకుంటామో.. ఆలోచిస్తే గుండె చెరువైపోతుంది. ‘ఏ అమృత ఘడియల్లో సిగరెట్లు తాగడం అంటుకుందోగానీ నన్నది వదలడం లేదు. ఈసారి వదిలేస్తా. అదేం పెద్ద కష్టం కాదు’ అంటూ శపథం చేశాడొక మిత్రుడు. ‘ఏడేళ్లుగా ఈ మాటమీదే ఉన్నావ్ మిత్రమా’ అంటే ‘ఇన్నేళ్లు సీరియస్‌గా తీసుకో లేదు. ఇప్పుడు ఖాయం’ అన్నాడు. చూడాలి. ముచ్చటగా మూడ్రోజులు ఆగితే జాతకం తెలిసి పోతుంది. కొందరు కొన్ని అలవాట్లని ‘వ్యస నం’గా తీర్మానించారు. అది చాలా తప్పు. ‘ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఓ క్రమశిక్షణతో నమ్ముకున్న అలవాటుని పద్ధతిగా ఆచరించడం వ్యసనం ఎట్లా అవుతుంది. అదొక కమిట్మెంట్’ అని ఓ మహా కవి జాతికి సందేశం ఇచ్చారు. ‘సిగరెట్లు మానె య్యడం కష్టమేమీ కాదు. నేను చాలాసార్లు మానే శాను’ అంటూ భరోసా ఇచ్చేవారు ఆరుద్ర. ‘మీరు పైపు కాలుస్తారా... ఎందుకండీ’ అని విస్తుపోతూ అడిగిన తన అభిమానికి – ‘మరి పైపులున్నది కాల్చడానికే కదండీ’ అని జవాబిచ్చారు. ‘నేను కూడనివన్నీ మానేస్తా. కానీ జనవరి ఒకటిన కాదు. ఎప్పుడో ఇంకోప్పుడు....’ అని నిర్ణయించుకు న్నారు వెంకటరమణ. ఇంకోప్పుడంటే ఎప్పుడండీ అని అడిగితే, అది వ్యక్తిగత విషయం కదా అని భయపెట్టేవారు. పాత సంవత్సరంలో విశేషమైన అరిష్టం పోయి, నవ శకం ఆరంభమైందని ఎక్కువ మంది సంతోషపడుతున్నారు. అనేకానేక భరోసా పథకాలు జగన్ పాలనతో పేదముంగిళ్లకి వచ్చాయ్. పల్లెల్లో ఉద్యోగాలు విస్తృతంగా మొలక లెత్తాయి. ఇంగ్లిష్ మాటలు వినిపిస్తున్నాయ్. అప్పట్లో వాస్తు రీత్యా అమరావతి క్యాపిటల్ పర మాద్భుతం అన్నారు. మరి వాస్తు అంత ప్రశస్తంగా ఉంటే ముందుకు నడవాలి కదా, ఇట్లా గుంట పూలు పూస్తూ పునాదుల్లోనే ఆగడం ఏమిటి? 2020 శుభాకాంక్షలు. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
కిరాయికి తెల్ల ఏనుగులు
పరువు, ప్రతిష్ట, పదవి సర్వం పోయాయ్. మరిప్పుడు ఏమి చేస్తున్నారంటే, అదృష్టపు తావీ దులు అమ్ముతున్నానన్నాడట వెనకటికో మాంత్రికుడు. చంద్ర బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతి దీనంగా ఓడిపోయారు. కేవలం పరిపాలనలో అవకతవకలు, అతి నమ్మకం దెబ్బతీశాయి. సొంతవర్గం చుట్టూ చేరి నిరంతరం పెద్ద శృతిలో భజనలు చేస్తూ ఉండటంవల్ల సామాన్య ప్రజల ఆర్తనాదాలు మూలవిరాట్ చెవిన పడలేదు. భజనపరులు ఎప్పటికప్పుడు కొత్తపాటలు సమకూర్చారు. వినసొంపుగా కొత్త బాణీలు కట్టారు. ఆ వరస, ఆ చిందు భక్త బృందా నికే కాక అసలాయనకే తన్మయత్వం, పూనకం కలిగేలా సాగాయి. చివరకవే కొంప ముంచాయి. ఎన్నికల ఫలితాలు చూశాక శ్రీవారు దిమ్మెరపోయారు. కలయో, నిజమో, ఈవీఎంల మాయో తెలియక తికమకపడ్డారు. ‘అవేమీ కాదు బాబూ, అంతా స్వయంకృతం. తమరు భజన మైకంలో పడ్డారు. చివరకు కిందపడ్డారు’ అని విశ్లేషకులు తేల్చి చెప్పారు. ‘నేను భజనలకు లొంగేవాణ్ణి కాదు. జనం పొరబడ్డారు. నెల తిరక్కుండా వారికి సత్యం బోధపడుతోంది. అప్పుడే గాలి తిరిగింది’ అని బోలెడు ధైర్యం పుంజుకున్నారు బాబు. ఆ ఉత్సాహంతో చంద్రబాబు రోజూ ప్రెస్మీట్లు పెడుతూ కొత్త ప్రభుత్వాన్ని అడుగడుగునా దుయ్యబట్టి వదులుతున్నారు. టీడీపీ హయాంలో పెద్ద పదవి వెలిగించిన ఒకాయన ఎక్కడా కనిపించడం మానేశారు. ఎంతకీ ఒక్క బాబుగారే దర్శనమిస్తున్నారు. ‘ఏవండీ బొత్తిగా నల్లపూస అయ్యారు. మీరు ప్రతిదానికీ తీవ్రంగా స్పందించేవారు కదా. అస్సలు కనిపించకపోతే జనం బెంగ పెట్టుకోరా’ అని అడిగాను. ఆయన నవ్వి జనం నాడి మాకు తెలిసినంత స్పష్టంగా ఎవరికి తెలుస్తుందండీ. వాళ్లు వూరికే ఫార్స్ చూస్తుంటారు. వాళ్లకి బ్రిటిష్ వాళ్లయినా, కాడి జోడెద్దులైనా, ఆవూ దూడ పార్టీ అయినా, కమలం అయినా, సైకిల్ గుర్తయినా ఒకటే! రాజకీయాల్ని మేమెంత లైట్‌గా తీసుకుంటామో, ఓటర్లు అంతకంటే లైట్‌గా తీసుకుంటారు’ అంటూ చాలాసేపు మాట్లాడాడు. చివరకి ‘పవర్లో ఉండగా అంతా హడావుడి గందరగోళంగా ఉంటాం. డొంకమీది గడ్డిలా అందింది అందినట్టు తింటాం. పైగా భయమొకటి. ఇదిగో ఇన్నాళ్లకి కొంచెం తీరికొచ్చింది. మీరు నమ్మదగినవారు, సరసులు కనుక ఉన్న సంగతి చెబుతున్నానంటూ గొంతు తగ్గించి, తిన్నది నెమరేసి ఒంటికి పట్టించుకోవడానికి ఇదే కదా సమయం. అందుకని ఆ పనిలో ఉన్నా’నని ముగించాడు. అంతకుముందు ఆయన ముఖాన నవ్వు చూసెరగం. ఓడిపోయాక చంద్రబాబు చాలా నవ్వులు కురిపిస్తున్నారని ఒకాయన చాలా సీరియస్‌గా అన్నాడు. జగన్‌మీద, జగన్ ప్రభుత్వంమీద వ్యంగ్యా్రస్తాలు విసురుతూ, ఆయన చమత్కారాలు శ్రోతలకు అర్థం కావేమోనని ఆయనే ముందస్తుగా నవ్వు అందిస్తున్నారని కొందరనుకుంటున్నారు. నిజానికి నెలదాటిన ఆర్టీసీ సమ్మె విషయంలో ఒక్క సారి కూడా చంద్రబాబు తలపెట్టలేదు. రేపెప్పుడో పన్నెండు గంటలపాటు ఇసుకలో తలపెట్టబోతున్నారు. దీన్నే ఉష్ట్రపక్షి తీరు అంటారు. ప్రస్తుతం చంద్రబాబుకి మనుషుల కొరత తీవ్రంగా ఉంది. నిన్న మొన్నటిదాకా కుడిచెయ్యి ఎడమచెయ్యిగా ఉన్నవారు కూడా కని్పంచడం లేదు. మళ్లీ ఎప్పటికి గెలిచేను, గెలిచినా..., అయినా... ఇలా సవాలక్ష ప్రశ్నలు. అందుకని రాజ పోషకులు, మహారాజ పోషకులు కూడా చేతులు ముడుచుకు కూర్చున్నారు. పైగా ఇప్పుడున్నవన్నీ కిరాయికి వచి్చన తెల్ల ఏనుగులు. భరించడం చాలా బరువు. అవి బాదం, పిస్తా, జీడిపప్పులు తప్ప ఇతరములు తినవు. యాపిల్ జ్యూస్‌లు, మాగిన ద్రాక్ష రసాలు తప్ప తాగవు. ఇంతా చేసి వాటివల్ల పెద్ద ప్రయోజనమూ ఉండదు. తెల్ల ఏనుగు కాబట్టి చూడాలని చాపల్యం. దాంతో జనం విరగబడతారు. అర్థం చేసుకున్నా ఆ ఖర్చు ఆపలేరు, పాపం. పార్టీని ఈవిధంగా ‘సాకడం’ కష్టతరం. ఇంతా చేసినా అట్నించి అమిత్ షా, మోదీ రాహు కేతువుల్లా చంద్రుణ్ణి మింగేసేట్టున్నారు. వ్యూహ రచనలో అమిత్ షా రాఘవేంద్రం లాంటి వాడు. అంటే– భయంకరమైన సముద్ర జీవి. మొసలిని మింగెయ్యగలదు తిమింగలం. తిమింగలాన్ని అవలీలగా కబళించగల జీవి ‘తిమింగల గిలం’, ఈ గిలాన్ని బుగ్గన పెట్టుకోగల సముద్ర జీవి రాఘవేంద్రం. చూస్తుండగా దేశాన్ని బాహువుల్లోకి తీసుకున్న సందర్భం చూశాం. రేపు ఆం.ప్ర.లోకి తొంగిచూస్తే మొదట తెలుగుదేశం కనుమరుగు అవుతుందని అనుభవజు్ఞలు అంటున్నారు. వ్యాసకర్త: శ్రీరమణ ,ప్రముఖ కథకుడు -
వరదలో బురద రాజకీయాలు
అసలీ వరద మనది కాదు. బురద మాత్రం మనం పూసుకుంటున్నాం. ఎక్కడో పైన ఏ మహారాష్ట్రలోనో వా నలు పడితే కృష్ణమ్మ చెంగనాలు వేస్తుంది. దారి పొడుగునా జలాశయాలు నింపి, గేట్లు వదిలించుకుని దిగువకు నడుస్తుంది. మనకున్న జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడడం ఒక పండుగ. ఇదిగో , మొన్న సర్వత్రా కురిసి న వర్షాలకు వాగులు వంకలు పొంగి వరదలొచ్చినా యి. ఎవరికి వారు లాకులు ఎత్తివేశారు. తలుపులు తెరిచారు. దాంతో కావల్సినంత కరెంటు, అక్కర్లేనన్ని నీళ్లు! కట్టలు తెంచుకున్నప్పుడు వరదలొస్తాయ్. కృష్ణమ్మకి చివ్వరి మెట్టు విజయవాడ ప్రకాశం బ్యారేజి. ఆ బ్యారేజి దిగువకు నీళ్లొదిలితే కృష్ణ వూళ్ల వీదపడుతుంది. మొన్న అదే జరిగింది. ఇళ్లు ఊళ్లు మునిగి పోయాయి. పంటలు నీళ్లలో మురిగి పోయాయి. రైతులు గగ్గోలు పెట్టారు. అక్కడ నించి అమరావతిలో వరదకు మించి రాజకీయాలు వెల్లువెత్తాయి. కరకట్ట మీదున్న మాజీ ముఖ్యమంత్రి అధికార నివాసంలోకి వరద నీరు చేరింది. ఇంకేముంది? ఆ వరద బురదైంది. ఏ చిన్న అవకాశం దొరి కినా తెలుగుదేశం వదిలిపెట్టే సహనంతో లేదు. సూదిని దూలానికి గుచ్చి టీడీపీ నాయకులంతా భుజాన వేసుకుని మీడియా వీధుల్లో వూరేగించేందుకు సిద్ధంగా వున్నారు. చంద్రబాబు నివాసంలోకి వరద నీటిని మళ్లించింది జగనేనని తెలుగుదేశం గొంతు సవరించుకుంది. అంతేకాదు చంద్రబాబు నివాసం మీదకి డ్రోన్లు పంపారని, అదొక దుష్టాలోచననీ ముక్తకంఠంతో ఎండగట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించారు. రైతులకు అండగా వుంటానని బురదలో నిలబడి మరీ చెప్పారు. ఈ దెబ్బతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడం ఖాయమనే పిచ్చి వుత్సాహంతో టీడీపీ వరద బురదలో ఆటలాడింది. మునిగి పోయిన రైతులు పాతనేతల మాటలకి రెచ్చపడక పోగా, తమరి హయాంలో మీరేం చేశా రని ఎదురు ప్రశ్నించారు. ఇన్పుట్ సబ్సిడీ నుంచి రైతులకు చంద్రబాబు చేసిన దగాలను ఓ జాబితాగా వల్లె వేశారు వరద రైతులు. రాష్ట్రంలో యింత కల్లోలం జరిగితే, చంద్రబాబు మీదకి వరదని అమానుషంగా తోలితే కనీసం రాహుల్ గాంధీ పరామర్శ కైనా రాలేదు. మమతా బెనర్జీ పలకరించనైనా లేదు. ఇది యిట్లావుంచి, వరద బురద యింకా ఉండగానే అమరావతి క్యాపిటల్ మీదికి ద్రోణి ఆవరించింది. వరద పర్యవసానాల్ని అడ్డం పెట్టుకుని అసలిక్కడ క్యాపిటల్ తగదనీ, అసలు పెద్దాయన యీ నల్లరేగడిలో పునాదులకే చాలా ఖర్చు అవుతుందని చెప్పనే చెప్పాడనీ ఓ సీనియర్ మంత్రి కెలికాడు. ఇంకే వుంది, అసలే సందేహాలతో కొట్టుమిట్టాడుతున్న కృష్ణ గుంటూరు ప్రజల గుండెలు గుబగుబలాడసాగాయి. వరద బురద దీంతో బాగా పాకాన పడింది. చంద్రబాబు కలల క్యాపిటల్ సాకారం కావాలంటే హీనపక్షం ఒకటిన్నర లక్షల కోట్లు కావాలి. ఆయనీ కల కని ఐదేళ్లు దాటింది. మూడు పంటలు పండే సుక్షేత్రాలైన నలభై వేల ఎకరాలను చంద్రబాబు బీడు పెట్టిన మాట వాస్తవం. ఇప్పుడు జగన్ ఇక్కడే క్యాపిటలని చెప్పినా జరిగేదేమీ లేదు. మొన్న బడ్జెట్లో అయిదొందల కోట్లు మాత్రమే క్యాపిటల్‌కి కేటాయించారు. ఈ లెక్కన ఈ విశ్వవిఖ్యాత నగరం పూర్తి కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. పైగా అంతటి ప్రపంచ ప్రసిద్ధ నగరాన్ని చంద్ర బాబు ఎలా నిర్మిద్దామనుకున్నారో, ఆర్థిక వనరులేమిటో ఎక్కడా ఎవ్వరికీ చెప్పలేదు. లండన్, సింగపూర్‌లాంటి దేశాల నుంచి బోలెడు తమాషాలు క్యాపిటల్‌కి వస్తాయని, వాళ్లంతా ల్యాండ్ పూలింగ్‌లో వచ్చిన భూముల్ని భయంకరమైన రేట్లకు కొనేస్తారని చంద్రబాబు అనుకున్నారు. డబ్బులు ఎవరికీ అంత తేలిగ్గా రావు! కాకపోతే, చంద్రబాబు వెంకటేశ్వరస్వామికి కొన్ని ఎకరాలు సమర్పించారు క్యాపిటల్ దగ్గర్లో. టీటీడీ కొన్ని వందల కోట్లు గుడి కోసం కేటాయించింది. ఇప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆలయం నిర్మాణం జరగవచ్చు. ఎందుకంటే శ్రీవారికి నిధుల కొరత లేదు కదా! అన్నీ సవ్యంగా ఉంటే అంతవరకు జరగచ్చు. మిగతా క్యాపిటల్ నిర్మాణం బహుకష్టం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
దడిగాడువానసిరా
సీఎం సమీక్షా సమావేశంలో అధికారులు నోట్ చేసుకున్న కీలక అంశాలు... ‘ఇక్కడ పట్టపగలు నరమేధం జరుగుతోంది. మమ్మల్ని కాపాడువారే లేరా’... అమరావతి మహాక్యాపిటల్ క్షేత్రంలో సభ కొలువు తీరింది. దైవాంశ సంభూతులమనే పూర్తి విశ్వాసం ఉన్న పుంజీలకొద్దీ అధికారులు సభని కిటకిటలాడిస్తున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో సమస్యలన్నిటినీ కాచి వడపోశారు. ఉలవలు నీళ్లలో పోస్తే తుక తుకా, తుక తుక తుగా, తుక్కతుకా ఉడకటం ఖాయం. సెక్యూరిటీ కారణాల వల్ల ఉలవల ప్రయోగం ఎవరూ చేయలేదు. చేస్తున్న మంచి పనులన్నిటికీ ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని అరవైనాలుగోసారి ముఖ్యనేత లూప్ వేశారు. ఏ ఒక్కరికీ రవ్వంత అవకాశం ఇవ్వకుండా, ముఖ్యనేత మాత్రమే అంకితభావంతో వాయించి వదులుతున్నారు. రాబోయే కొత్త ఊరగాయల దగ్గర్నుంచి సమస్త విషయాల మీద దిశానిర్దేశం చేసిపడేస్తున్నారు. సభ జరుగుతున్నంతసేవూ తోక పుస్తకాల మీద ఎంతో శ్రద్ధాసక్తులతో అధికారగణం పాయింట్లు నోట్ చేసుకుంటున్నారు. రమారమీ ఎనిమిదిన్నర గంటల తర్వాత సమీక్షా సమావేశం ముగిసింది. ఒక్కసారిగా సభ లఘుశంకలు తీర్చుకోవడానికి బతుకుజీవుడా అని లేచింది. జీడిపప్పు మర్యాదలతోనే ప్రెస్ మీట్ కూడా ముగిసింది. సినిమా వదిలినట్లుంది. బల్లల మీద వదిలేసిన తోక పుస్తకాలను, దొరికిన మేర బాల్ పెన్నులు పోగేసుకున్నా. అత్యంత శ్రద్ధాసక్తులతో జరిగిన సీఎం సమీక్షా సమావేశంలో అధికారులు నోట్ చేసుకున్న కీలక అంశాలు మా పాఠకుల కోసం.. ఒక పుస్తకంలో ‘ఇక్కడ పట్టపగలు నరమేధం జరుగుతోంది. మమ్మల్ని కాపాడువారే లేరా’ అని ఇంగ్లిష్ స్పెల్లింగ్‌తో రాశారు.పాల ఇంగువ, పిల్లాడికి వంటావదం–డోన్ట్ ఫర్గెట్. ఒక పుస్తకంలో చంద్రబాబుని తలపాగా తంబురాతో శంకర శాస్త్రి గెటప్‌తో గీశారు. సొంత కాబినెట్ కొలీగ్స్ ఇద్దరు వయొలిన్ మృదంగాలపై సహకరిస్తున్నారు. పోలికలు అంత బాగా రాలేదు.ఏడెనిమిది తోక పుస్తకాల మీద కనీసపు పిచ్చిగీతలు కూడా లేవు. వీరంతా అదమరిచి నిద్దరోయినట్లు భావించవచ్చు. ‘మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు చెప్పినట్లుగా సూర్యుడు తూర్పున ఉదయించడం ముదావహం. అలాగే చంద్రుడు.. చంద్రుడు (దిక్కుమీద డౌటు) ఆయన చెప్పిన వైపునే వస్తున్నాడు’. ‘నా సెల్ చార్జర్ రిపేరు.. లేదా కొత్తది’.పన్నెండో బుక్కుమీద, బ్రాడీపేటలో ఎక్కడో లోపలగా ఉన్న అట్లకొట్టు అడ్రసుంది. పొద్దున ఏడులోపు వెళ్లకపోతే సొంతింటి వంటకాన్నే తినవలసి వచ్చును. ‘ఆంధ్రాలో పిడుగుల్లెక్క సరిపోయింది. ఎటొచ్చీ మూడు మాత్రం లెక్కలకి అందలేదు. ఉరిమిఉరిమి మంగలాలమీద పడ్డట్టు భావిస్తున్నారు’. ప్రశ్న : తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? జవాబు : నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు. ‘బాగా ముదురుపాకం వచ్చాక, చంద్రబాబు తీర్మానాలల్లే తీగలు తీగలుగా సాగేప్పుడు– ముందుగా వేయించి పెట్టుకున్న సమస్త పప్పుల్నీ బాణలిలో వేసి శక్తికొద్దీ తిప్పాలి’. ‘సుబ్బి పెళ్లి ఎంకి చావుకని వెంకయ్య పదోన్నతితో చంద్రన్నకి రెక్క విరిగింది’. ‘నాకిప్పుడు శక్తి కావాలి. కనీసం సెలైన్ పెట్టండి’. ‘రాష్ట్రంలో పన్నెండేళ్లు రాగానే తెలుగు కుర్రాళ్లకి పంచెల ఫంక్షన్ ఈ ప్రభుత్వమే చేస్తుంది’. ‘రాష్ట్రాన్ని విద్యుత్ గనిగా చేస్తా!’ డాడీ! మన హెరిటేజ్ తోటలో ధనియాలు జల్లితే కొత్తిమీర మొలిచింది! ‘ఇంటలిజంట్ హబ్బా? మజాకానా’. సమావేశం ముగిసింది. స్వస్తి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
గోకులంలో కృష్ణుడే తెలుపు
అక్షర తూణీరం ప్రపంచంలో మహానగరాలు అద్దాల్లా ఉంటాయంటే దాని ముఖ్యకారణం ‘సివిక్సెన్స్’. మనకి ఇక్కడి ప్రభుత్వాలు క్రెడిట్స్ తీసుకుంటూ ఉంటాయి. బంగాళాఖాతం విశాఖ బీచ్ పక్కగా ప్రవహించడం నా ఘనతే అనడానికి వెనుకాడరు. వారం రోజుల నించి ర్యాంకుల నంబర్ల పొలికేకలు వినీవినీ చెవులు హోరెత్తిపోతున్నాయ్. ఇదే తరుణంలో మన ప్రియతమనేత వెంకయ్యనాయుడి నోటి వెంట మరోసారి ర్యాంకులు వినిపించేసరికి అంతా ఉలిక్కిపడ్డారు. స్వచ్ఛభారత్ పేరిట సాగుతున్న మహాయజ్ఞంలో నగరాలకు, పట్టణాలకు స్వచ్ఛతని బట్టి శ్రీ సర్కారు వారిచ్చిన ర్యాంకులివి. అంతా దిగ్భ్రమ చెందారు. ఔరా! అని నోళ్లు తెరిచారు. మన నగరానికి, మన టౌనుకి ఇంత మంచి స్థానం వచ్చిందా అని మూర్ఛపోయారు. వెనకటికో సంఘటన– భమిడిపాటి రాధాకృష్ణ మంచి రచయిత. ప్రముఖ రచయిత, హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావుగారి అబ్బాయి. రాధాకృష్ణ రచిం చిన నాటకానికి నాటక అకాడమి వారు ఆ సంవత్సరపు ఉత్తమ నాటక బహుమతిని ప్రకటించారు. చాలా సంతోషంగా తండ్రి దగ్గరకు వెళ్లి సంగతి చెప్పాడు. వయోభారంతో మంచంలో ఉన్న హాస్యబ్రహ్మ వినగానే చిరునవ్వు నవ్వి ‘‘మన నాటకరంగం అలా అఘోరించిందన్నమాట’’అని నిట్టూర్చారట. గోకులంలో కృష్ణుడే తెల్ల టివాడు. అంటే మిగిలిన వారి రంగుల్ని ఊహించుకోవచ్చు. గడచిన సంవత్సరం సర్వేక్షణ ప్రకారం దేశంలో అన్ని పట్టణాలకి, బస్తీలకి మార్కులు, ర్యాంకులు ప్రదానం చేశారు. అందులో విశాఖకి, తిరుపతికి మంచి స్థానాలు లభించాయి. తిరుపతికి పదిలోపు ర్యాంకు రావడం విశేషమే. అక్కడ జనాభా ఎంతనేది ప్రశ్న కాదు. నిత్యం హీనపక్షం దేశం నలుమూలల నించి లక్షకు పైగా యాత్రికులు ఆ టెంపుల్‌టౌన్‌లోకి దిగుతారు. మళ్లీ అంతమంది నిలవ భక్తులుంటారు. అదనంగా రెండు లక్షలమందిని ఆ ఊరు నిత్యం భరిస్తుంది. వారంతా పరదేశీయులు కాబట్టి, స్వచ్ఛత పాటించడంలో సమస్యలుంటాయ్. తిరుపతిని స్వామివారి నిధులు ఆదుకుంటాయి కాబట్టి, ఇంకా శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచవచ్చు. విజయవాడకి, తెనాలికి కూడా ర్యాంకులొచ్చే సరికి మార్కులా, లాటరీ తీశారా అని సందేహం వస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సర్వే చేస్తే విజయవాడ, తెనాలిలో ఉన్నన్ని ఊరపందులు మరెక్కడా కానరావు. పైగా ‘‘పందులు గుంపులుగా వస్తాయ్’’. తెనాలి మూడు కాలువలు, బెజవాడ కాలువలు–సద్వినియోగం చేసుకుంటే ఒక వరం. ఇప్పటికీ తెనాలి కాలువల్ని డంపింగ్‌కి వాడుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. భాగ్యనగరం ర్యాంకుల విషయంలో కొంచెం కిందకి జారింది. అది కూడా ఎక్కువే అన్నారు స్థానికులు. చాలా కాలనీల్లో ఎక్కడ ఖాళీస్థలం కన్పిస్తే అక్కడ చెత్త వేసేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రపంచంలో మహానగరాలు అద్దాల్లా ఉంటాయంటే దాని ముఖ్యకారణం ‘సివిక్సెన్స్’. మనకి ఇక్కడి ప్రభుత్వాలు క్రెడిట్స్ తీసుకుంటూ ఉంటాయి. బంగాళాఖాతం విశాఖ బీచ్ పక్కగా ప్రవహించడం నా ఘనతే అనడానికి వెనుకాడరు. పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులను చూస్తే చాలు మన పరిశుభ్రత స్థాయి తెలుస్తుంది. ఏదో చిరుదీపం వెలిగించడం ఆనందదాయకమే. స్వచ్ఛంద సంస్థలు, రికామీగా ఉన్న సీనియర్ సిటిజన్లు గట్టి సంకల్పం చేయాలి. వారికి తగినంత స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే సాధ్యం. శ్రీరమణ ప్రముఖ కథకుడు