
పరువు, ప్రతిష్ట, పదవి సర్వం పోయాయ్. మరిప్పుడు ఏమి చేస్తున్నారంటే, అదృష్టపు తావీ దులు అమ్ముతున్నానన్నాడట వెనకటికో మాంత్రికుడు. చంద్ర బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతి దీనంగా ఓడిపోయారు. కేవలం పరిపాలనలో అవకతవకలు, అతి నమ్మకం దెబ్బతీశాయి. సొంతవర్గం చుట్టూ చేరి నిరంతరం పెద్ద శృతిలో భజనలు చేస్తూ ఉండటంవల్ల సామాన్య ప్రజల ఆర్తనాదాలు మూలవిరాట్ చెవిన పడలేదు. భజనపరులు ఎప్పటికప్పుడు కొత్తపాటలు సమకూర్చారు. వినసొంపుగా కొత్త బాణీలు కట్టారు. ఆ వరస, ఆ చిందు భక్త బృందా నికే కాక అసలాయనకే తన్మయత్వం, పూనకం కలిగేలా సాగాయి. చివరకవే కొంప ముంచాయి. ఎన్నికల ఫలితాలు చూశాక శ్రీవారు దిమ్మెరపోయారు. కలయో, నిజమో, ఈవీఎంల మాయో తెలియక తికమకపడ్డారు. ‘అవేమీ కాదు బాబూ, అంతా స్వయంకృతం. తమరు భజన మైకంలో పడ్డారు. చివరకు కిందపడ్డారు’ అని విశ్లేషకులు తేల్చి చెప్పారు. ‘నేను భజనలకు లొంగేవాణ్ణి కాదు. జనం పొరబడ్డారు. నెల తిరక్కుండా వారికి సత్యం బోధపడుతోంది. అప్పుడే గాలి తిరిగింది’ అని బోలెడు ధైర్యం పుంజుకున్నారు బాబు. ఆ ఉత్సాహంతో చంద్రబాబు రోజూ ప్రెస్‌మీట్లు పెడుతూ కొత్త ప్రభుత్వాన్ని అడుగడుగునా దుయ్యబట్టి వదులుతున్నారు. టీడీపీ హయాంలో పెద్ద పదవి వెలిగించిన ఒకాయన ఎక్కడా కనిపించడం మానేశారు. ఎంతకీ ఒక్క బాబుగారే దర్శనమిస్తున్నారు. ‘ఏవండీ బొత్తిగా నల్లపూస అయ్యారు. మీరు ప్రతిదానికీ తీవ్రంగా స్పందించేవారు కదా. అస్సలు కనిపించకపోతే జనం బెంగ పెట్టుకోరా’ అని అడిగాను. ఆయన నవ్వి జనం నాడి మాకు తెలిసినంత స్పష్టంగా ఎవరికి తెలుస్తుందండీ. వాళ్లు వూరికే ఫార్స్ చూస్తుంటారు. వాళ్లకి బ్రిటిష్ వాళ్లయినా, కాడి జోడెద్దులైనా, ఆవూ దూడ పార్టీ అయినా, కమలం అయినా, సైకిల్ గుర్తయినా ఒకటే! రాజకీయాల్ని మేమెంత లైట్‌గా తీసుకుంటామో, ఓటర్లు అంతకంటే లైట్‌గా తీసుకుంటారు’ అంటూ చాలాసేపు మాట్లాడాడు. చివరకి ‘పవర్‌లో ఉండగా అంతా హడావుడి గందరగోళంగా ఉంటాం. డొంకమీది గడ్డిలా అందింది అందినట్టు తింటాం. పైగా భయమొకటి. ఇదిగో ఇన్నాళ్లకి కొంచెం తీరికొచ్చింది. మీరు నమ్మదగినవారు, సరసులు కనుక ఉన్న సంగతి చెబుతున్నానంటూ గొంతు తగ్గించి, తిన్నది నెమరేసి ఒంటికి పట్టించుకోవడానికి ఇదే కదా సమయం. అందుకని ఆ పనిలో ఉన్నా’నని ముగించాడు.
అంతకుముందు ఆయన ముఖాన నవ్వు చూసెరగం. ఓడిపోయాక చంద్రబాబు చాలా నవ్వులు కురిపిస్తున్నారని ఒకాయన చాలా సీరియస్‌గా అన్నాడు. జగన్‌మీద, జగన్ ప్రభుత్వంమీద వ్యంగ్యా్రస్తాలు విసురుతూ, ఆయన చమత్కారాలు శ్రోతలకు అర్థం కావేమోనని ఆయనే ముందస్తుగా నవ్వు అందిస్తున్నారని కొందరనుకుంటున్నారు.
నిజానికి నెలదాటిన ఆర్టీసీ సమ్మె విషయంలో ఒక్క సారి కూడా చంద్రబాబు తలపెట్టలేదు. రేపెప్పుడో పన్నెండు గంటలపాటు ఇసుకలో తలపెట్టబోతున్నారు. దీన్నే ఉష్ట్రపక్షి తీరు అంటారు. ప్రస్తుతం చంద్రబాబుకి మనుషుల కొరత తీవ్రంగా ఉంది. నిన్న మొన్నటిదాకా కుడిచెయ్యి ఎడమచెయ్యిగా ఉన్నవారు కూడా కని్పంచడం లేదు. మళ్లీ ఎప్పటికి గెలిచేను, గెలిచినా..., అయినా... ఇలా సవాలక్ష ప్రశ్నలు. అందుకని రాజ పోషకులు, మహారాజ పోషకులు కూడా చేతులు ముడుచుకు కూర్చున్నారు. పైగా ఇప్పుడున్నవన్నీ కిరాయికి వచి్చన తెల్ల ఏనుగులు. భరించడం చాలా బరువు. అవి బాదం, పిస్తా, జీడిపప్పులు తప్ప ఇతరములు తినవు. యాపిల్ జ్యూస్‌లు, మాగిన ద్రాక్ష రసాలు తప్ప తాగవు. ఇంతా చేసి వాటివల్ల పెద్ద ప్రయోజనమూ ఉండదు. తెల్ల ఏనుగు కాబట్టి చూడాలని చాపల్యం. దాంతో జనం విరగబడతారు. అర్థం చేసుకున్నా ఆ ఖర్చు ఆపలేరు, పాపం. పార్టీని ఈవిధంగా ‘సాకడం’ కష్టతరం. ఇంతా చేసినా అట్నించి అమిత్ షా, మోదీ రాహు కేతువుల్లా చంద్రుణ్ణి మింగేసేట్టున్నారు. వ్యూహ రచనలో అమిత్ షా రాఘవేంద్రం లాంటి వాడు. అంటే– భయంకరమైన సముద్ర జీవి. మొసలిని మింగెయ్యగలదు తిమింగలం. తిమింగలాన్ని అవలీలగా కబళించగల జీవి ‘తిమింగల గిలం’, ఈ గిలాన్ని బుగ్గన పెట్టుకోగల సముద్ర జీవి రాఘవేంద్రం. చూస్తుండగా దేశాన్ని బాహువుల్లోకి తీసుకున్న సందర్భం చూశాం. రేపు ఆం.ప్ర.లోకి తొంగిచూస్తే మొదట తెలుగుదేశం కనుమరుగు అవుతుందని అనుభవజు్ఞలు అంటున్నారు.
వ్యాసకర్త: శ్రీరమణ ,ప్రముఖ కథకుడు