గోకులంలో కృష్ణుడే తెలుపు
అక్షర తూణీరం
ప్రపంచంలో మహానగరాలు అద్దాల్లా ఉంటాయంటే దాని ముఖ్యకారణం ‘సివిక్‌సెన్స్’. మనకి ఇక్కడి ప్రభుత్వాలు క్రెడిట్స్ తీసుకుంటూ ఉంటాయి. బంగాళాఖాతం విశాఖ బీచ్ పక్కగా ప్రవహించడం నా ఘనతే అనడానికి వెనుకాడరు.
వారం రోజుల నించి ర్యాంకుల నంబర్ల పొలికేకలు వినీవినీ చెవులు హోరెత్తిపోతున్నాయ్. ఇదే తరుణంలో మన ప్రియతమనేత వెంకయ్యనాయుడి నోటి వెంట మరోసారి ర్యాంకులు వినిపించేసరికి అంతా ఉలిక్కిపడ్డారు. స్వచ్ఛభారత్ పేరిట సాగుతున్న మహాయజ్ఞంలో నగరాలకు, పట్టణాలకు స్వచ్ఛతని బట్టి శ్రీ సర్కారు వారిచ్చిన ర్యాంకులివి. అంతా దిగ్భ్రమ చెందారు. ఔరా! అని నోళ్లు తెరిచారు. మన నగరానికి, మన టౌనుకి ఇంత మంచి స్థానం వచ్చిందా అని మూర్ఛపోయారు. వెనకటికో సంఘటన– భమిడిపాటి రాధాకృష్ణ మంచి రచయిత. ప్రముఖ రచయిత, హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావుగారి అబ్బాయి. రాధాకృష్ణ రచిం చిన నాటకానికి నాటక అకాడమి వారు ఆ సంవత్సరపు ఉత్తమ నాటక బహుమతిని ప్రకటించారు. చాలా సంతోషంగా తండ్రి దగ్గరకు వెళ్లి సంగతి చెప్పాడు. వయోభారంతో మంచంలో ఉన్న హాస్యబ్రహ్మ వినగానే చిరునవ్వు నవ్వి ‘‘మన నాటకరంగం అలా అఘోరించిందన్నమాట’’అని నిట్టూర్చారట. గోకులంలో కృష్ణుడే తెల్ల టివాడు. అంటే మిగిలిన వారి రంగుల్ని ఊహించుకోవచ్చు.
గడచిన సంవత్సరం సర్వేక్షణ ప్రకారం దేశంలో అన్ని పట్టణాలకి, బస్తీలకి మార్కులు, ర్యాంకులు ప్రదానం చేశారు. అందులో విశాఖకి, తిరుపతికి మంచి స్థానాలు లభించాయి. తిరుపతికి పదిలోపు ర్యాంకు రావడం విశేషమే. అక్కడ జనాభా ఎంతనేది ప్రశ్న కాదు. నిత్యం హీనపక్షం దేశం నలుమూలల నించి లక్షకు పైగా యాత్రికులు ఆ టెంపుల్‌టౌన్‌లోకి దిగుతారు. మళ్లీ అంతమంది నిలవ భక్తులుంటారు. అదనంగా రెండు లక్షలమందిని ఆ ఊరు నిత్యం భరిస్తుంది. వారంతా పరదేశీయులు కాబట్టి, స్వచ్ఛత పాటించడంలో సమస్యలుంటాయ్. తిరుపతిని స్వామివారి నిధులు ఆదుకుంటాయి కాబట్టి, ఇంకా శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచవచ్చు. విజయవాడకి, తెనాలికి కూడా ర్యాంకులొచ్చే సరికి మార్కులా, లాటరీ తీశారా అని సందేహం వస్తోంది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సర్వే చేస్తే విజయవాడ, తెనాలిలో ఉన్నన్ని ఊరపందులు మరెక్కడా కానరావు. పైగా ‘‘పందులు గుంపులుగా వస్తాయ్’’. తెనాలి మూడు కాలువలు, బెజవాడ కాలువలు–సద్వినియోగం చేసుకుంటే ఒక వరం. ఇప్పటికీ తెనాలి కాలువల్ని డంపింగ్‌కి వాడుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు.
భాగ్యనగరం ర్యాంకుల విషయంలో కొంచెం కిందకి జారింది. అది కూడా ఎక్కువే అన్నారు స్థానికులు. చాలా కాలనీల్లో ఎక్కడ ఖాళీస్థలం కన్పిస్తే అక్కడ చెత్త వేసేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రపంచంలో మహానగరాలు అద్దాల్లా ఉంటాయంటే దాని ముఖ్యకారణం ‘సివిక్‌సెన్స్’. మనకి ఇక్కడి ప్రభుత్వాలు క్రెడిట్స్ తీసుకుంటూ ఉంటాయి. బంగాళాఖాతం విశాఖ బీచ్ పక్కగా ప్రవహించడం నా ఘనతే అనడానికి వెనుకాడరు. పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులను చూస్తే చాలు మన పరిశుభ్రత స్థాయి తెలుస్తుంది. ఏదో చిరుదీపం వెలిగించడం ఆనందదాయకమే. స్వచ్ఛంద సంస్థలు, రికామీగా ఉన్న సీనియర్ సిటిజన్లు గట్టి సంకల్పం చేయాలి. వారికి తగినంత స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే సాధ్యం.
శ్రీరమణ
ప్రముఖ కథకుడు