సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ వేకువఝామున(5 గంటల ప్రాంతంలో..) తుదిశ్వాస విడిచారు. దిగ్గజాలు బాపు-రమణతో కలిసి పని చేసిన అనుభవం రమణది. పేరడీ రచనలకు శ్రీ రమణ ఎంతగానో ప్రసిద్ధి.
ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన మిథునం సినిమాకు శ్రీరమణే కథ అందించారు. 2012 లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు సినిమా తీసిన నాటికే పాతిక సంవత్సరాల క్రితం ఆయన రచించిన 25 పేజీల మిథునం కథకు తనికెళ్ళ భరణి అద్భుతంగా చిత్రీకరించారు.
శ్రీ రమణ గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబరు 21న జన్మించారు. ఆయన అసలు పేరు కామరాజ రామారావు. ఆంధ్రజ్యోతి నవ్యతో పాటు సాక్షి.. పలు తెలుగు పత్రికలకు ఆయన పని చేశారు. వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాలకు విశిష్ట సేవలందించారు. శ్రీ రమణ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment