Mithunam
-
నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? ..ఒక్కసారిగా గిర్రున కన్నీళ్లు..
నేను పదవతరగతిలో ఉన్నప్పుడో, ఇంటర్ మీడియట్ లో ఉన్నప్పుడో సరిగా గుర్తు లేదు కానీ ఆంధ్రజ్యోతి లో ఓక పుస్తక ప్రకటన వచ్చింది . నవోదయ పబ్లిషర్స్ వారిది. "శ్రీ రమణ రంగుల రాట్నం. చమత్కారాలు, మిరియాలు, అల్లం బెల్లం, మురబ్బాలూ" అని. అప్పటికి నాకు శ్రీరమణ ఎవరో తెలీదు. ముళ్ళపూడి వెంకట రమణే శ్రీరమణ అని అనుకునేవాడిని. నాకు బాపుగారు తెలుసు. బాపు గారు ఏ రమణకి బొమ్మవేసినా ఆ రమణ శ్రీముళ్ళపూడి రమణే అయి ఉంటారని ఒక లెక్క తెలుసు. నాకు ఆ పత్రికా ప్రకటనలోని అల్లం బెల్లం మురబ్బాలు కావాలి అనిపించింది. మా రఘుగాడి ధన సహకారంతో అనుకుంటా ఆ పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించుకున్నాను. అట్ట పైన, అట్ట లోపలా అంతటా ఎంత బావుంటుందో ఆ పుస్తకం. రమణ గారి రాతల చమత్కారం, బాపు గారి బొమ్మల మహధ్భాగ్యం. రీచర్చీ కాలర్లు, చేయి జారిన అదృష్టరేఖలు, కథలూ-కజ్జికాయలు, మెంతికూర చింతామణి, ఉత్తరగ్రహణం, మూడు ప్రింట్లు ఆరు ఆటలూ, విద్యాలయాల్లో పిడకల వేట, కిటికీ పక్క సీటు, పొట్టలో చుక్క, కార్తీకంలో కవిత్వ సమారాధన, గళ్ళ నుడికట్టు చీర ఇట్లా ఒకటా రెండా ఎన్నెన్నో శీర్షికల మకుటాలతో ఆ వ్యాసాలు చక్కిలిగింతల హాస్యాలు పలికాయి. మొన్నటికి మొన్న ఒకానొక రచయిత్రి గురించి అనుకుంటూ " ఈ రచయిత్రి పెట్టే చివరి సిరాచుక్క అంధ్ర సరస్వతి నొసట కస్తూరి చుక్క" అని ఎప్పుడు అవుతుందో కదా దేముడూ అని శ్రీరమణ భాషలో దండం పెట్టుకున్నా కూడా . పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో కొనుక్కున్న, చదువుకున్న శ్రీరమణ గారిని ఈ రోజుకూ చదువుకోవడం, వాటిని గుర్తుగా తలుచుకోవడం అనేది మన గొప్ప కాదు. శ్రీరమణ గారే అన్నట్టు "గింజకు జీవశక్తి ఉంటే అది ఎక్కడ పడేసినా పోదు" తెలుగు పాఠకుడికి బుర్ర ఉన్నంత కాలం అందులో జీవశక్తి ఉన్న గింజలు మాత్రమే బ్రతికి ఉంటాయి. శ్రీరమణ గారి నుడి ,ఆయన పలుకు అటువంటిది. అది పురాజన్మలో శ్రీ మహావిష్ణువు చేతి బంగారు మురుగు. కలం రూపం ధరించి, రమణ అనే కలం పేరు దాల్చి కొంతకాలం ఇక్కడికి వచ్చింది. ఈ రోజు అది వెనక్కి మరలి శ్రీహరి చేతినే చేరింది. నా ఇంటర్ మీడియట్ రోజులు, చదువు దినాలు గడిచి, అలా అలా నడిచి ఒకచోట వచ్చి నిలబడ్దాను. ఇదిగో ఇప్పుడు నేనున్న నా ఇంటి నుంచి రెండో మలుపు దగ్గర సరాసరి కాస్త డౌన్ దిగితే శ్రీరమణ గారి ఇల్లు. వారానికి రెండు మూడు సార్లు ఆయన్ని కలిసి బోలెడన్ని కబుర్లు గడిచేవి. ఫోన్ లో కాలక్షేపాలు నడిచేవి. వారి ఇంటికి వెళితే శ్రీమతి జానకి గారి కాఫీ ఆతిథ్యాలు. మా ఆవిడ ఎప్పుడయినా ఏదయినా పనిమీద ఊరికి వెడితే మొహమాటపడకుండా తమ ఇంటికి వచ్చి భోజనం చెయ్యమనేవారు. నేను ఓ యెస్, తప్పకుండా వస్తా అనేవాడ్ని, రాకుండా అలానే మొహమాటపడేవాడ్ని. కాస్త సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఇంటికి వస్తే వారిని పిలుచుకుని మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినంత చనువైన దర్జాతో ఆయన ఇంటికి తీసుకు వెళ్ళి కబుర్లు పెట్టించేవాడిని. ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. నా పుట్టినరోజు పండగ నాడు ఉదయాన్నే ఆయన కాళ్లకు దండం పెట్టుకుని వారి ఆశీస్సులు తీసుకునేవాడిని. నా తొలి పుస్తకం రాగానే దగ్గరి వారని, పెద్ద దిక్కని, ఆయన వద్దకు వెళ్ళి పుస్తకాన్ని అందించాను. ఆయన ఆ పుస్తకం సలక్షణీయతను ముచ్చటగా రెపరెపలాడించి, నా భుజం మీద చేయి వేసి బాపు గారు ఈ రోజు ఉండి, ఈ పుస్తకం చూసి ఉంటే ఎంత పొంగిపోయి ఉండేవారో తెలుసా? అని నా కళ్ళలో చిన్న తడిని తెప్పించారు. తెల్లవారుఝామున వాకింగ్ కని నాలుగు గంటలకు లేచి నడుస్తూ అక్కడ మలుపు తిరుగుతానా, నా కళ్ళు శ్రీరమణ గారి ఇంటి గేటుకు అంటుకు పోయి ఉంటాయి. ఎన్నిసార్లు బిగుతైన ఆ గేటు కిర్రుకిర్రులని పలకరించి ఉంటాను? ఆ ఇంట్లో ఒక కుక్క ఉండేది అది ఎవరు వచ్చినా తెగ అరుస్తూ గోల చేసేది. గత రెండు, రెండున్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కరోనా రోజుల్లో రమణ గారు వారి పెద్దబ్బాయి ఇంటికి వెళ్ళిపోయారు. నేను రోజూ ఉదయపు నడకలో ఆ ఇంటివైపు చూస్తాను. రమణ గారు వచ్చి ఉంటారేమోనని ఆశ. కలిసి బోల్డని కబుర్లు చెప్పుకోవచ్చని కోరిక. ఆయన ఆరోగ్యం చాలా కాలంగా బావుండటం లేదని కబురు తెలుసు నాకు.అయినా ఆయన దగ్గరికి వెళ్లలేక పోయా. ఎప్పుడు కలిసినా కూర్చుని మాట్లాడే ఆయనని మంచం మీద చూడ్డం నాకు ఇష్టం లేకుండా ఉండింది. రమణగారు నాతో ఒక పుస్తకం గురించి చెప్పేవారు దాని శీర్షిక " సింహాల మధ్య నేను" అని గొప్పగొప్ప వారి మధ్య గడిపిన ఒక వ్యక్తి జ్ఞాపకాల సమాహారం ఆ పుస్తకం. అట్లాంటి పుస్తకం నేను ఒకటి వ్రాస్తానండి. ఎంత గొప్పవారి మధ్య గడిపాననుకున్నారు నేను అని చెప్పుకుని పొంగిపోయేవారు ఆయన. శ్రీరమణ గారూ, నేనూ మీ వంటి ఒక సింహం సాన్నిహిత్యంలో గడిపాను సర్. మిమ్మల్ని గుహలో చూడటమే నాకు తెలుసు. మంచం మీద దుప్పటి కప్పుకున్న సింహన్ని ఈ కళ్ళతో చూడలేక పోయాను సర్. అందుకే ప్రతి రోజూ మీరు తిరిగి వచ్చే రోజుకోసం మీ ఇంటివైపు చూపులను అట్టిపెట్టేవాడ్ని. నేను చిన్నతనం రోజులనుంచి చదువుకున్న శ్రీరమణ గారిని 2002 ఆ ప్రాంతాల్లో ఆంధ్రజ్యోతిలో మొదటిసారిగా కలిసాను. మునుపు కాలంలో మూతపడ్డ ఆంధ్రజ్యోతిని అప్పుడు కొత్తగా మళ్ళీ మొదలెట్టారు. నాకు ఆ పత్రికలో శ్రీ రమణగారు ఉద్యోగం చేస్తూ ఉన్నారని తెలీదు. నేను కార్టూనిస్ట్ శంకర్ ని కలవడానికి అక్కడికి వెళ్ళాను. శంకర్ కూచునే దగ్గరలోనే రమణగారి సీటు. నేను ఆయన్ని చూస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళి "మీరెవరో నాకు బాగా తెలుసు అనిపిస్తుంది. కాని తెలీదు, మీరు ఎవరు సార్" అని అడిగా. ఆయన నవ్వుతూ ఆయన ఎవరో చెప్పారు. నేను థ్రిల్ అయిపోయా, ఈయనేనా నా బాల్య స్నేహితుడు. ఈయన రచనలనేగా నవ్వులు నవ్వులుగా చదువుకున్నది . ఈ రోజు కళ్ళ ఎదురుగా నా ముందు ... ఆ రోజు కలిసిన మహూర్త బలం గొప్పది. ఇక ప్రతి రోజూ ఆయన్ని కలిసేవాడిని. అప్పుడు నా ఉద్యోగం ఆంధ్రప్రభలో పతంజలి గారితో, ఉదయం పూట ఆయనతో ఎన్నెన్ని కబుర్లు నవ్వులు గోల. సాయంత్రం కాగానే శ్రీరమణ గారి తో ముచట్లు. ఎట్లాంటి రోజులవి. ఎంత బంగారు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అవి ! వెలిగిన రోజులవి. ఒక సాయంత్రం శ్రీరమణ గారి కలిస్తే నవ్వుతూ అన్నారు కదా" మీ గురువు గారిని కాస్త మమ్మల్ని క్షమించి దయ చూడమనవచ్చు కదా మీరు" "ఏమీ సర్? ఏవయ్యింది," "నేనిలా అన్నానని మీరు ఆయనతో చెప్పండి చాలు" నేను మరుసటి రోజు పతంజలి గారిని కలిసి శ్రీరమణ గారు ఇలా అన్నారు, ఏమిటి సర్ విషయం అని అడిగా. "నిన్న ఒక ఎడిటోరియల్ వ్రాసాను మిత్రమా" అన్నారు పతంజలి గారు. అది తెచ్చుకుని చదివా. నాకు గుర్తున్నంతరకు దానిపేరు "ఒక చిరునవ్వు, ఒక వెక్కిరింత, ఒక లేమి" అటువంటి ఒక సాహితీ చురక వ్రాయలన్నా, దానిని పుచ్చుకుని సిగ మల్లెగా దరించాలన్నా, సరస్వతీ దేవి అద్దంలో తనను చూసుకుంటూ వ్వే వ్వే వ్వే అనుకొడమే. లేరిక అటువంటి సాహితీవేత్తలు. రారిక ఆ మత్తేభాలు, శార్దూలాలూ. బాపు రమణల గురించి కానీ , ఆ కాలం సాహితీ జనం గురించి కాని, ఎన్ని కబుర్లు, ఎన్ని విశేషాలు ఆయన దగ్గర ఉండేవో! ఫలానా కథ గురించి చెప్పాలన్నా, ఫలానా సాహితీ విశేషం గురించి ముచ్చటించాలన్నా, ఆనాటి సినిమా తెర వెనుక ముచట్ల వంటి అల్లం మురబ్బా ఘాటు నుండి శార్వరి నుండి శార్వరి దాక ఎన్ని విశేషాల లోతుల్లోకి మునకలు వేయించేవారో! శార్వరి నుండి అంటే నాకు గుర్తుకు వచ్చింది , రమణగారు మీరు నాకు విశ్వనాథ వారి నవల సెట్టు బాకి ఉన్నారు. మాట దక్కించుకోకుండా ఎలా వెల్లిపోయారు మీరు? మా ఇద్దరికి ఉన్న మరో పిచ్చి స్టేషనరీ. రంగు రంగు కాగితాలు పెన్నులు పెన్సిల్లు, క్లిప్పులు. తాను మదరాసు లో ఉన్నప్పుడు కొన్న సరంజామా గురించి చక్కగా వినిపించేవారు. ఆయనకు గుర్తు వచ్చినప్పుడల్లా నా పైలట్ ఎలాబో పెన్నును అడిగి తీసుకుని దాన్ని అలా ఇలా తిప్పి చూసేవారు. జాగ్రత్తగా ఉంచుకొండి దీన్ని, చాలా ఖరీదైన పెన్ను కదా ఇలా చొక్కా జేబుకు తగిలించుకు తిరగవద్దు, అని హెచ్చరించేవారు. పదేళ్ల క్రితమే దాని ధర పన్నెండు వేల రూపాయలు. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ. అన్నం పెట్టే విద్యకు సంబంధించిన టూల్స్ ని ఇలా భక్తి గా కొనుక్కునే నా గుణం పై ఆయనకు చాలా మక్కువగా అనిపించేది. మేము చివరిసారిగా కలవడానికి ముందు ఇంటికి పిలిచి ఒక మంచి తోలు బ్యాగు కానుకగా ఇచ్చారు. ’"నాకు దీని క్వాలిటీ బాగా నచ్చిందండి, రెండు తీసుకున్నా. నాకొకటి, మీకొకటి. ఇప్పుడు అవన్నీ తలుచుకున్న కొద్ది బాధగా ఉంటుంది. మనమేం పుణ్యం పెట్టి పుట్టాం ఇంత అభిమానం, ప్రేమ పొందడానికి. నేను స్కూటర్ కొన్న కొత్తలో కార్టూనిస్ట్ జయదేవ్ గారూ, నేనూ ఒక పత్రికలో కలిసి పని చేసేవాళ్లం. నాకు ఆయన్ని స్కూటర్ మీద ఎక్కించుకుని తిరగాలని చాలా కోరిగ్గా ఉండేది. ఆయనకు నా డ్రయివింగ్ మీద అపనమ్మకం కాబోలు. ఎపుడు రమ్మన్నా, మీరు పదండి అన్వర్, నేను మీ వెనుకే నడుచుకుంటూ వస్తా గా అని నవ్వేవాడు. నేను కారు కొనబోతున్న కొత్తలో కార్ల గురించి శ్రీరమణ కబుర్లు పెట్టేవాణ్ణి. ఆయనా చాలా విషయాలు చెప్పేవారు కార్ల గురించి , బెజవాడలో నవత డ్రయివింగ్ స్కూలు వారి గురించి, వారితో స్నేహం, బాపు గారు వ్రాసి ఇచ్చిన లోగో గురించి. సర్, నేను కారు కొన్నాకా నా కారు ఎక్కుతారా మనం కలిసి తిరుగుదామా అనేవాడ్ని, తప్పకుండా అండి అని ఆయనా భరోసా ఇచ్చారు. కానీ మేము ఇద్దరమూ వేరే కార్లు ఎక్కి తిరిగాము కానీ, మా కారు మాత్రం ఎక్కి తిరగలా. అది ఎందుకో కుదరలా. ఒకసారి ఒక ప్రయాణం ప్రపోజల్ పెట్టారు. ఏవండీ ఓడ ఎక్కి శ్రీలంక వెళ్లి వద్దామా? ప్రయాణం భలే బావుంటుంది. మీరు వస్తాను అంటే మీకు కూడా టికెట్ బుక్ చేపిస్తా అన్నారు . అయితే ఓడ కన్నా ముందే కరోనా వచ్చింది. ప్రయాణం మునకేసింది.ఆయన హాస్యమూ, చురకా రెండూ పదునైనవి దానికి ఎటువంటి మినహాయింపులు ఉండేవి కావు. ఫలానా ఆయన ఈయనకు బాగా దగ్గరివారు అనుకుంటామా ,ఆ దగ్గరి వారిపైన అయినా ఒక చురక వేయవలసి వస్తే వేయడమే కానీ మన పర అని ఏమి ఉండేవి కావు. బాపు గారి దగ్గర ఉండి ఉండి రమణ గారికి కూడా బొమ్మల లోతుపాతులు కొంతమేరకు తెలుసు . పిచ్చి బొమ్మ, వంకర, బొమ్మ, బొమ్మ తక్కువ బొమ్మ, మేధావి బొమ్మ ల మీద ఆయనకు బాగా చిన్న చూపు. ఇదంతా దొంగ బొమ్మల సంగతి. అలా అని ఆయనతో పికాసో గురించో, లక్ష్మాగౌడ్ గురించో, తోట వైకుంఠం గురించో మాట్లాడి చూడండి. పులకించి పోతూ చెబుతారు. ఒకసారి ఒక పత్రికాఫీసులో మేమిద్దరం కబుర్లు చెబుతూ కూచున్నామా, స్కానింగ్ డిపార్ట్మెంట్ నుండో , ఆర్ట్ డిపార్ట్మెంట్ నుండో ఒకాయన వచ్చి "సర్ ఆర్టిస్ట్ బొమ్మ వేసి ఇంటికి వెల్లిపోయారు, అయితే బొమ్మ ఏది పై భాగమో, ఏది కింది భాగమో అర్థం అవడం లేదు. మీరు కాస్త చెప్పండి అన్నారు. ఆయన ఆ బొమ్మని ఎత్తి పట్టుకుని " ఈ బొమ్మని ఇలాగే ఎడిట్ పేజీలో ఆర్టికల్ కి ఉపయోగించుకోండి, ఇదే బొమ్మని కుడివైపుకు తిప్పి ఎడిట్ పేజిలోనే ఆ చివర ఒక కవిత వస్తుంది కదా, దానికి వాడుకోండి. బొమ్మని ఎడమ వైపుకు తిప్పి పెట్టుకుని ఆదివారం అనుబంధంలో కథకు ఇలస్ట్రేషన్ గా పెట్టుకోండి. ఇక ఈ రోజు మన కార్టూనిస్ట్ రాకపోతే ఆ కార్టూన్ ప్లేస్ లో ఈ బొమ్మని తలకిందులు చేసి పెట్టుకుంటే సరిపోతుంది" మొహంలో కోపం, విసుగు, చిరాకు ఏమీ లేకుండా ఆయన అలా కూల్ గా చెబుతుంటే , మనం పేపరాఫీసు పైకప్పు ఎగిరి పోయేలా నవ్వుతూ ఉంటే ఏం మర్యాద? రమణ గారు ఒక రచయితకు ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు" మనం ఒక పుస్తకం అచ్చుకి ఇస్తున్నాము అంటే దాని అర్థం , ఒక వెదురు పొదను సమూలంగా నాశనం చేస్తున్నామని . ఒక వెదురు పొద పచ్చగా బ్రతకాలా? లేదా మీ పుస్తకం బయటికి రావాలా అనేది మీ విజ్ఞత కే వదిలేస్తున్నా.చెప్పాగా, ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. లక్షల రూపాయల పనులని ఆయన నాకు ఇప్పించారు. ఆయన వ్రాసిన ఒక పుస్తకానికి నేను బొమ్మలు వేసి ఋణం కొద్దిగా మాత్రమే తీర్చుకున్నాను. ఆయన వెంకట సత్య స్టాలిన్ పుస్తకానికి బొమ్మలు వేద్దామని నాకు చాలా కోరిగ్గా ఉండేది. శ్రీరమణ గారికి ఉన్న అభిమానుల్లో ఒక పెద్ద అభిమాని చిత్రకారులు శ్రీ మోహన్ గారు. ముచ్చట పడి ఆయన వెంకట సత్య స్టాలిన్ కి బొమ్మలు వేస్తానని చెప్పి వేసి పెట్టారు. నిజానికి ఆ బొమ్మలు ఏమీ బాగో ఉండవు. ఆ దగ్గర శ్రీరమణ గారు హెల్ప్ లెస్. అయితే శ్రీ మోహన్ గారు, శ్రీరమణ గారు చిలకల పందిరి అని ఒక సూపర్ డూపర్ హిట్ శీర్షిక నడిపారు. ఆ రచన, ఆ బొమ్మలు బంగారం మరియూ తావే. మోహన్ గారన్నా, ఆయన వచనం అన్నా, ఆయన రేఖలు అన్నా శ్రీరమణగారికి కూడా చాలా ముచ్చట. ఆ మధ్య పాత పుస్తకాలు వెదుకుతుండగా ఆయన సోడా నాయుడు కథకి గోపి గారు వేసిన నలుపూ తెలుపు బొమ్మ నా కంటపడింది. ఎంత అందం . కథంత అందం ఆబొమ్మది. పత్రికాఫీసుల్లో పని చేసారు కదా ఆయనకు చాలా చాలామంది చిత్రకారులతో పరిచయం , చాలా దగ్గరితనం ఉండేది . అయితే ఆయన రచనలకు బాపు గారు తెచ్చిన అందం ఎవరూ తేలేదు, తేలేరు కూడా. వ్యక్తిగతంగా , వృత్తిగతంగా కూడా ఆయనకు ఇష్టమైన చిత్రకారులు బాపు కాకుండా మోహన్ గారు గిరిధర్ గౌడ్ గారు మాత్రమే నని నాకు తెలుసు. ఈ రోజు ఉదయం శ్రీరమణ గారిని చివరి చూపుగా పలకరించడానికి ప్లోటిల్లా అపార్ట్మెంట్ కి వెళ్ళాము నేను, కవి నాయుడు గారు. రమణ గారు అద్దాల పెట్టె లో పడుకుని ఉన్నారు. అలా మాటడకుండా, నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? నా కంటి అద్దాల లోపల నీరు గిర్రున తిరిగింది, అద్దాలు తీసు కళ్ళు తుడుచుకునే పని చేయలేదు. ఆ గాజు పెట్టె లో నిలువెల్లా ఆయన నాకు కనపడుతున్నారు. ఏదో లోపం, ఏదో తప్పు జరిగింది, నేనేదో మరిచిపోయా. కొంత కాలం క్రితం ఒకసారి మా ఇద్దరి మాటల్లో మనం ఎవరి ఇంటికయినా వెడుతూ వారికి ఏమీ పట్టుకు వెడితే బావుంటుంది? మనం ఖర్చు పెట్టే రూపాయ ఎట్లా వృధా పోకుండా ఉండాలి? ఆ ఇంట్లో వాళ్లకు షుగర్ ఉంటే ఎలా? ఈ పూలు, బొకేలు అవీ పట్టుకు పోతారు కదా, పూలు ఎట్లాగూ వాడిపోతాయి కదా ,దానికి డబ్బులు దండగ కదా అని శ్రీరమణ గారితో మాటలు పెట్టుకున్నాను . దానికింత గొడవెందుకండి? ఏదయినా పట్టుకు వెళ్ళొచ్చు. ఆ ఇంట్లో వయసు పెద్ద వాళ్ళే ఉండి , వారికి షుగర్ ఉంటే మాత్రమేం? తీసుకు వెళ్ళిన స్వీట్లు వాళ్ళ ఇంట్లో పిల్లలు తింటారు, పిల్లలు లేకపోతే పక్కింటి వారికో, లేదా వారి పనివారికో పంచుతారు.పూల బొకేలు ఇస్తే డబ్బులు దండగ ఏమీ కాదు. పూల గుత్తిని చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందండి . వాంగో సన్ ప్లవర్స్ పెయింటింగ్ లాగా, దాని రంగులు, రెక్కలు చూస్తూ గడపవచ్చు కదా. అప్పుడు ఇంటికి ఇంటికి వచ్చిన వారెవరైనా ఎక్కడిది పూలగుత్తి, ఏమిటి విశేషం అని అడిగితే " మమ్మల్ని చూడ్డానికి ఇంటికి అన్వర్ గారు వచ్చి వెళ్లారు , మా కోసం పూలు పట్టుకు వచ్చారు" అని సంతోషంగా చెప్పుకుంటారు కదా. శ్రీరమణ గారు ఈ రోజు మీకొక పూల మాల తేవాల్సింది నేను. తేనందుకు మీరు ఫీల్ అయ్యేది ఏమీ లేదు. సింహాల మధ్య తిరిగి ఉండి కూడా నేను మర్యాద తెలీని శిష్యుడిగా మిగిలిపోలా! ఇపుడు ఏం చేసేది? బుద్ది లేని జన్మ. థూ! ఒకసారి నేను ఒక కథ చదివాను . వేలూరి శివరామశాస్త్రి గారిది. కథ పేరు 'తల్లి లేని పిల్ల"ఆ కథలో ఇలా ఉంటుంది "చిట్టెమ్మ మేకల మంద నడుమ కూచుంది . చుట్టూ పది పన్నెండు దుత్తలు, ఐదారుచెంబులూ. చిట్టెమ్మ కొడుకు రాఘువులు మేకపాలతో ఒక చిన్న గుంట అలికి దానిలోనూ, ఒక చిన్న రాతి తొట్టిలోనూ కుక్కలకూ, కుక్క పిల్లలకూ మేకపాలు పోస్తున్నాడు. రాఘువులు తండ్రి నాగాయ మంద చివర నించుని మేకలని పరీక్ష చేసి పళ్ళు కదిలిన వానికి క్షౌరం చేసి చక్రాంకితాలు వేశాడు. కొన్ని మేకల డెక్కల నడుమ ముళ్ళు లాగాడు. ఒక మేకవి కాలిమీది వెంట్రుకలు లిక్కితో కోసి నెత్తురు కంటచూసి- 'ఓరే నాయనా! ఉప్పుపెట్టి రుద్దు" అని పురమాయించాడు" నాగాయ తన కొడుకును పురమాయిస్తే పురమాయించాడు కానీ, నాకు అనుమానాలు, ఎందుకుని ఈ చక్రాంకితాలు, అదీనూ పళ్ళుకదిలినవాటికే ఎందుకు? లిక్కి దూసి మేక నెత్తురు పరీక్ష చెయ్యడం అదేవిటి? సరే ఉప్పు రాయడం ఎందుకో కాస్త అంచనాకు అందిందనుకో. ఎవరిని అడిగితే వీటికి సమాధానం దొరకాలి? అపుడు నాకు ప్రతి ప్రశ్నకు సమాధానంగా శ్రీరమణ గారు ఉండేవారు. మహానుభావుడు కేవలం ఆధునిక సాహిత్యాన్ని, ప్రాచీన వాగ్మయాన్ని చదువుకున్న మనిషే కాదు. జీవితాన్ని పరిశీలనగా చూసిన వాడు కూడా . పల్లెలో పుట్టి పెరిగినవాడు, అన్నీ తెలుసు. తెలిసిన వాటిని విప్పి చెప్పే హృదయం ఉంది. ఇలా ఉన్న హృదయాలన్ని మూసుకుపోయి ఇప్పుడు మనసు లేని మనస్సుల , మనుష్యుల మధ్య బ్రతకడం ఎంత కష్టమో, చికాకో సింహాల మధ్య తిరిగిన మీకు ఏమి తెలుస్తుంది ? చెప్పినా ఏమి అర్థమవుతుంది. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి దిన పత్రిక -
మిథునం రచయిత శ్రీ రమణ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ వేకువఝామున(5 గంటల ప్రాంతంలో..) తుదిశ్వాస విడిచారు. దిగ్గజాలు బాపు-రమణతో కలిసి పని చేసిన అనుభవం రమణది. పేరడీ రచనలకు శ్రీ రమణ ఎంతగానో ప్రసిద్ధి. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన మిథునం సినిమాకు శ్రీరమణే కథ అందించారు. 2012 లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు సినిమా తీసిన నాటికే పాతిక సంవత్సరాల క్రితం ఆయన రచించిన 25 పేజీల మిథునం కథకు తనికెళ్ళ భరణి అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీ రమణ గుంటూరు జిల్లా, వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబరు 21న జన్మించారు. ఆయన అసలు పేరు కామరాజ రామారావు. ఆంధ్రజ్యోతి నవ్యతో పాటు సాక్షి.. పలు తెలుగు పత్రికలకు ఆయన పని చేశారు. వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళా రంగాలకు విశిష్ట సేవలందించారు. శ్రీ రమణ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. -
మిథున రాశి: అన్నింటా శుభయోగం.. ఆ ఒక్కటి చేస్తే మరింత రాజయోగం
మిథున రాశి (ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4) మిథునరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. చతుర్థ పంచమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, దశమ లాభస్థానాలలో గురు రాహువుల సంచారం, భాగ్యస్థానంలో శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. కీలకమైన స్థానాలలో ఉన్నవారి వల్ల లబ్ధి చేకూరుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. విదేశీయాన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. అగ్రిమెంట్స్, కాంట్రాక్టులు, మార్కెటింగ్, వాణిజ్య ప్రదర్శనలు, ప్రకటనలు, ఉత్తర ప్రత్యుత్తరాలు లాభిస్తాయి. కంటి దోషాలు పెరిగే అవకాశం ఉంది. కొనుగోలు, అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. స్పెక్యులేషన్‌కు దూరంగా వుండటం మంచిది. శత్రువర్గం ఇబ్బంది పెట్టలేని స్థాయిలో ఉంటారు. ఒకనాటి మిత్రులు అగర్భశత్రువులు అవుతారు. అందరూ బలహీనులు అని భావించవద్దు. తగిన సమయం కోసం వేచి ఉన్నారని గ్రహించండి. జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. సాంకేతిక పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఓం నమశ్శివాయ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఎక్కువ ఆలస్యం చేయకుండా శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. పార్టీ మారడం వల్ల మంచి రాజకీయ ఫలితాలు పొందగలుగుతారు. చిన్నాచితకా వ్యాపారాలు, చేతివృత్తులు, ఆధ్యాత్మిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణాభరణాల భద్రతలో జాగ్రత్తలు అవసరం. సంతానం వల్ల కుటుంబానికి కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఎగుమతి, దిగుమతి వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలు, పొదుపు డిపాజిట్ల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. బంధువులకు సహాయం చేయడం వల్ల చికాకులు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులు అంచనాల మేరకు ఫలిస్తాయి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. మీ వ్యాపార భాగస్వాములు, సహోద్యోగులు అసూయాపరులై ఉంటారు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పార్శ్వపు నొప్పి, ఈఎన్టీ సమస్యలు రావచ్చు. కష్టపడి పనిచేసి ఫలితాలను ఆశిస్తారు. సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యనష్టం, కాలహరణం జరుగుతుంది. మనుషుల మనోభావాల్ని స్పష్టంగా చదవగలరు. సంతానం విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యం అవుతాయి. ప్రేమ వివాహాలు విఫలం అవుతాయి. విద్యారంగంలో కృషి చేసేవారికి ఆరంభంలోనే ఉద్యోగం వస్తుంది. వాస్తవిక దృష్టితో ఆలోచించి, కుల మత వర్గాలకు అతీతంగా శక్తిసామర్థ్యాలకు పెద్దపీట వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం వల్ల చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు. ఇతరులు సలహాలు చెప్పడానికి వీలులేని వాతావరణం కలిగించవద్దు. పట్టువిడుపులు మంచికి దారితీస్తాయని గ్రహించండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం నవగ్రహ పాశుపత హోమం చేయాలి, శక్తికంకణం లేదా శక్తిరూపు ధరించాలి. ఉపయోగంలేని వ్యక్తుల సాంగత్యం ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళను వదిలించుకోవడం కష్టంగా మారుతుంది. మేలు చేస్తారని మీరు భావించిన వ్యక్తులు ముఖం చాటువేస్తారు. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం బాగుంది. సన్నిహితులతో, ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి ఏ కార్యక్రమాలలోనైనా నిర్ణయం తీసుకోండి. ఎవరికీ లొంగి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే వారికి భంగపాటు తప్పదు. అవివాహితులకు ఘనంగా వివాహం జరుగుతుంది. సౌందర్య చిట్కాలు, యోగాభ్యాసాలు, మెడిటేషన్ మొదలైన వాటి వల్ల ప్రయోజనం పొందుతారు. ఆరావళి కుంకుమ, శ్రీలక్ష్మీ చందనంతో అమ్మవారిని పూజిస్తే మంచిఫలితాలు ఉంటాయి. లీజులు, అగ్రిమెంట్లు, లైసెన్సులు లాభిస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో జీవితం మరో కొత్త పంథాలో నడుస్తుంది. విడిపోవాలన్న వారితో శాశ్వతంగా విడిపోతారు. సంతాన పురోగతి బాగుంటుంది. చెప్పుడు మాటలు విని నష్టపోతారు. శుభకార్యాలకు సంబంధించిన బరువు బాధ్యతలు దించుకుంటారు. పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు సంభవిస్తాయి. మీ వివాదాల ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్త వహించండి. కీళ్ళనొప్పులు, గైనిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ లాభించదు. చిట్టీలు కట్టి మోసపోతారు. హనుమాన్ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అలంకార సామగ్రి అమ్మేవారికి, చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు పిల్లల ముందు చర్చించకపోవడం మంచిది. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు మెరిట్ మార్కులు, స్కాలర్షిప్స్ వస్తాయి. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. జీవితభాగస్వామి లేదా తత్సమానమైన వ్యక్తితో విభేదాలు తీవ్రతరం అవుతాయి. వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు అత్యంత ప్రజాదరణకు నోచుకుంటాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. ధనాన్ని పొదుపు చేస్తారు. మాతృవర్గం వైపు బంధువులకు సహాయం చేయవలసి వస్తుంది. సొంత వ్యాపారాలు కలిసివస్తాయి. పొదుపు పథకాలు అమలు చేసి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువుల భద్రత గురించి ఎక్కువ శ్రద్ధ చూపండి. బ్యూటీ పార్లర్స్ నడిపేవారికి, అలంకార సామగ్రి విక్రయాలు మొదలైన వ్యాపారాలు లాభిస్తాయి. కళా, సాంస్కృతిక రంగాలలో, నాట్య, సంగీత రంగాలలో రాణిస్తారు. చలనచిత్ర, టీవీ రంగాలలో అవకాశాలు లభిస్తాయి. పిల్లలను అతి గారాబం చేయడం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. సంతాన సాఫల్యకేంద్రాల వల్ల, దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీ రంగాలలోని వారు రాణిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యకు ఎంపికవుతారు. స్వయంకృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. అనువంశికంగా మీకు రావలసిన ఆస్తిలో పెద్దలు రాసిన డాక్యుమెంట్స్‌లో కొన్ని లోపాలు బయటపడతాయి. ఈ లోపాల కారణంగా మీరు కానీ, మీ జీవిత భాగస్వామి కానీ నష్టపోయే అవకాశం ఉంది. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వల్ల నరదిష్టి, నరఘోష తొలగిపోతుయి, జనాకర్షణ ఏర్పడుతుంది. సాధారణ విద్యలోనూ, వైద్య విద్యలోనూ బాగా రాణిస్తారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. -
మిథునం నిర్మాత కన్నుమూత
‘మిథునం’ వంటి మంచి చిత్రాన్ని నిర్మించిన ముయిద ఆనందరావు (57) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. సంఘ సేవకుడిగానూ మంచి గుర్తింపు పొందారాయన. సాహిత్యమంటే ఆయనకు మక్కువ. పర్యావరణ హిత పద్యాలను రాసి కోటిగాడు పేరుతో ప్రచురణ చేసేవారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి కీలక పాత్రల్లో తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఆనందరావు నిర్మించిన చిత్రం ‘మిథునం’. 2012లో విడుదలైన ఈ సినిమా 2017లో నంది అవార్డును సొంతం చేసుకుంది. ఆనందరావు మృతితో వావిలవలస గ్రామంలో విషాదం అలముకుంది. ఆయనకు భార్య పద్మినితో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆనందరావు మృతిపై విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. -
అమ్మ ఇంకా బతికే ఉంది!
‘మిథునం’ సినిమాతో దర్శకుడిగా మారారు రచయిత, నటుడు తనికెళ్ల భరణి. వృద్ధదంపతుల అన్యోన్యతను, పిల్లలకు దూరంగా ఉంటున్న బాధను అద్భుతంగా తెరకెక్కించారు భరణి. ‘మిథునం’లో యస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ జంటగా నటించారు. ఇప్పుడు దర్శకుడిగా రెండో సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నారట తనికెళ్ల భరణి. ‘అమ్మ ఇంకా బతికే ఉంది’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందులో షావుకారు జానకి ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
2012-13 నాటి నంది అవార్డులు ప్రకటన
-
నంది అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
-
నంది అవార్డులను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కొంత కాలంగా నంది అవార్డులను తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఇస్తుందన్న సస్పెన్స్‌కు తెర పడింది . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో కొత్త అవార్డులను ఇస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించింది. 2012 సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో ఈగ, ఎటోవెళ్లిపోయింది మనసు, మిథునం సినిమాలు పోటి పడ్డాయి. ఈగ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులతో కలిపి తొమ్మిది అవార్డులను సొంతం చేసుకోగా, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకు నాలుగు అవార్డులు దక్కాయి. మిథునంకు రెండు, మిణుగురులుకు ఐదు అవార్డులు దక్కాయి. ఎస్వీ రంగారావు పురస్కారానికి గాను ఆశిష్ విద్యార్థిని ఎంపిక చేశారు. సీనియర్ నటి జయసుథ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఎంట్రీ లను పరిశీలించి విజేతలను నిర్ణయించింది. 2012 నంది అవార్డుల వివరాలు : ఉత్తమ చిత్రం : ఈగ ద్వితీయ ఉత్తమ చిత్రం : మిణుగురులు తృతీయ ఉత్తమ చిత్రం : మిథునం ఉత్తమ దర్శకుడు : రాజమౌళి ( ఈగ ) ఉత్తమ నటుడు : నాని (ఎటో వెళ్లిపోయింది మనసు) ఉత్తమ నటి : సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు) ఉత్తమ విలన్ : సుదీప్ (ఈగ) ఉత్తమ సహాయ నటుడు : అజయ్ (ఇష్క్) ఉత్తమ సహాయ నటి : శ్యామలా దేవి (వీరంగం) ఉత్తమ హాస్య నటుడు : రఘుబాబు (ఓనమాలు) ఉత్తమ బాలనటుడు : దీపక్ సరోజ్ (మిణుగురులు) ఉత్తమ బాలనటి : రుషిణి ( మిణుగురులు) ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : అయోద్య కుమార్ ( మిణుగురులు ) ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ : రాజమౌళి (ఈగ) ఉత్తమ కథా రచయిత : అయోద్య కుమార్ ( మిణుగురులు) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సెంథిల్ కుమార్ (ఈగ) ఉత్తమ గాయకుడు : శంకర్ మహదేవన్ ( ఒక్కడే దేవుడు, శిరిడి సాయి) ఉత్తమ గాయని : గీతామాధురి ( యదలో నదిలాగ, గుడ్ మార్నింగ్) ఉత్తమ కళాదర్శకుడు : ఎస్ రామకృష్ణ ( అందాల రాక్షసి) ఉత్తమ కొరియోగ్రాఫర్ : జానీ ( మీ ఇంటికి ముందో గేటు, జులాయి) ఉత్తమ ఆడియో గ్రాఫర్ : కడియాల దేవీ కృష్ణ (ఈగ) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : తిరుమల( కృష్ణంవందే జగద్గురుం) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : చిట్టూరి శ్రీనివాస్ ( కృష్ణంవందే జగద్గురుం) ఉత్తమ మాటల రచయిత : తనికెళ్ల భరణి (మిథునం) ఉత్తమ గేయ రచయిత : అనంత్ శ్రీరామ్ (కోటికోటి తరల్లోనా, ఎటో వెళ్లిపోయింది మనసు) ఉత్తమ సంగీత దర్శకుడు : కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు) ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు (ఈగ) ఉత్తమ ఫైట్స్ : గణేష్ ( ఒక్కడినే) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : ఆర్ సీ యం రాజు (మిణుగురులు) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ : శిల్ప (వీరంగం) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : మకుట విఎఫ్ఎక్స్ ( ఈగ) ఎస్వీ రంగారావు పురస్కారం : ఆశిష్ విద్యార్థి (మిణుగురులు) 2013 సంవత్సరానికి గాను మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం : మిర్చి రెండో ఉత్తమ చిత్రం : నా బంగారు తల్లి మూడో ఉత్తమ చిత్రం : ఉయ్యాల జంపాల ఉత్తమ కుటుంబ కథా చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం : అత్తారింటికి దారేది ఉత్తమ హీరో : ప్రభాస్ (మిర్చి) ఉత్తమ హీరోయిన్ : అంజలి పాటిల్ (నా బంగారు తల్లి) ఉత్తమ దర్శకుడు : దయా కొడవగంటి (అలియాస్ జానకి) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది) ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) ఉత్తమ సహాయ నటి : నదియా (అత్తారింటికి దారేది) ఎస్వీ రంగారావు పురస్కారం : నరేష్ (పరంపర) ఉత్తమ హాస్య నటుడు : తాగుబోతు రమేష్ ( వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్) ఉత్తమ విలన్ : సంపత్ రాజ్ (మిర్చి) ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : కొరటాల శివ (మిర్చి) ఉత్తమ మాటల రచయిత : త్రివిక్రమ్ శ్రీనివాస్ ( అత్తారింటికి దారేది) ఉత్తమ గేయ రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రీ ( మరీ అంతగా, సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు) ఉత్తమ గాయకుడు : కైలాష్ ఖేర్ ( పండగలా దిగివచ్చాడు, మిర్చి) ఉత్తమ గాయని : కల్పన (నవ మూర్తులైనట్టి, ఇంటింటా అన్నమయ్య) ఉత్తమ ఎడిటర్ : ప్రవీణ్ పూడి (కాళీచరణ్) ఉత్తమ బాల నటుడు : విజయ సింహారెడ్డి ( భక్త సిరియాల్) ఉత్తమ బాల నటి : ప్రణవి ( ఉయ్యాల జంపాల) ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత : మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్) ఉత్తమ కథా రచయిత : ఇంద్రగంటి మోహనకృష్ణ ( అంతుకు ముందు ఆ తరువాత) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : మురళీమోహన్ రెడ్డి (కమలతో నా ప్రయాణం) ఉత్తమ కళాదర్శకుడు : ఏ ఎస్ ప్రకాష్ (మిర్చి) ఉత్తమ కొరియోగ్రాఫర్ : శేఖర్ వీజే (గుండెజారి గల్లంతయ్యిందే) ఉత్తమ ఆడియోగ్రాఫర్ : ఇ రాధాకృష్ణ ( బసంతి) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : తిరుమల ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : శివ కుమార్ ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య) ఉత్తమ ఫైట్ మాస్టర్ : వెంకట్ నాగ్( కాళీచరణ్ ) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : పీజే రవి ( బొమన్ ఇరానీ, అత్తారింటికి దారేది) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీ మేల్ : మిత్రా వరుణ మహి (ఉయ్యాల జంపాల) ఉత్తమ విజువల ఎఫెక్ట్స్ : యతిరాజ్ ( సాహసం ) -
మూడే మూడు మాటలు!
అన్యోన్య దాంపత్యానికి చిరునామా అనదగ్గ స్థాయిలో ‘మిధునం’ చిత్రంలో భార్యాభర్తలుగా జీవించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ. ఈ ఇద్దరి అభినయానికి ప్రేక్షకులు, విశ్లేషకులు ముగ్ధులయ్యారు. మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారు. తమిళ దర్శకురాలు మధు మిత ‘మిథునం’ చూసి ఈ పెయిర్ని చాలా ఇష్టపడ్డారట. అందుకే తను దర్శకత్వం వహిస్తున్న ‘మూండ్రే మూండ్రు వార్తయ్’ (‘మూడే మూడు మాటలు’ అని అర్థం) అనే చిత్రంలో ఎస్పీబీ, లక్ష్మీని నటింపజేయనున్నారు. ఈ ఇద్దరూ హీరోకి తాత, నానమ్మలుగా కనిపిస్తారు. ఈ చిత్రాన్ని కాపిటల్ ఫిల్మ్‌వర్క్స్ పతాకంపై ఎస్పీబీ తనయుడు, గాయకుడు ఎస్.పి. చరణ్ నిర్మిస్తున్నారు. -
పాతికేళ్ల మిథునం
పెసరట్టులో ఉల్లిపాయ వేస్తే అద్భుతః అంటారు భరణి... ‘ఇవాళ శుక్రవారం... ఉల్లిపాయ వద్దు’ అంటారు భవాని. ‘బయటకెళ్లేటప్పుడు మంచి డ్రెస్ వేసుకెళ్లచ్చుగా! చూసినవారు ఏమనుకుంటారు?’ దుర్గాభవాని ధుమధుమలు! ‘ఫేస్ వాల్యూ ఉంది కదోయ్, పర్లేదులే!’ భరణి చమక్కులు! ఆ ఒక్కమాటతో ఆ ధుమధుమలు కాస్తా దూరం! ‘నేను ఆందోళన పడతానని కొన్ని విషయాలు అస్సలు చెప్పరు. భార్య అంటే భర్త సుఖంతో పాటూ కష్టం కూడా పంచుకోవాలిగా’ అని భవాని చిరుకోపం... ‘నిన్నెప్పుడూ ఆనందంగా ఉంచాలనే నా ఆరాటం’ భరణి లౌక్యం.. ‘ఇంతకన్నా భర్త నుంచి భార్యకు కావాల్సిందేముంది?’ అనుకుంటారు భవాని తృప్తిగా. భవాని, భరణిల పెళ్లి వయసు పాతికేళ్లు. వెండితెరపై అనురాగ దాంపత్యపు అనుబంధాన్ని ‘మిథునం’గా చూపిన భరణి... ఆయన శ్రీమతి భవానిల పాతికేళ్ల జీవనయానమే ఈ ‘మనసే జతగా’ తనికెళ్ల భరణి పుట్టి పెరిగింది సికింద్రాబాద్‌లో! దుర్గాభవాని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం. ఇద్దరూ మేనత్తమేనమామ పిల్లలు. తన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటుంది అని పాతికేళ్ల క్రితం మేన మరదలితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట భరణి. ఆ రోజు తాను తీసుకున్న నిర్ణయమే మా రెండు కుటుంబాల మధ్య బంధాలు ఇప్పటికీ పదిలంగా ఉండటానికి పునాది అయ్యిందని భరణి మురిపెం. ఈ దంపతులు హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఉంటున్నారు. ‘భర్త చిన్న తప్పు చేసినా ఇద్దరికి సమాధానమిచ్చుకోవాలి. ఒకటి తన ఆత్మకు, రెండవది తన భార్యకు’ అంటారు భరణి. తొలినాళ్ల కాపురం గురించి భవాని వివరిస్తూ - ‘మొదట చెన్నైలో ఉండేవాళ్లం. రచయితగా, నటుడిగా ఈయన తీరికలేకుండా ఉన్నప్పటికీ ఇంటికోసం కొంత సమయాన్ని తప్పక కేటాయించేవారు. నా ఇష్టాయిష్టాలను తెలుసుకుని మరీ అందుకు అనుగుణంగా మసిలేవారు. నా పుట్టినరోజు, పిల్లల పుట్టినరోజులు నేటికీ మర్చిపోరు. షూటింగ్‌తో ఎంతదూరంలో ఉన్నా గ్రీటింగ్ చెప్పడం, గిఫ్ట్‌లు పంపడం మర్చిపోరు. ఒకసారి నా పుట్టినరోజున దూరంగా ఉన్నా కూడా ముక్కుపుడకను పంపించారు. కానుకలు ఇస్తేనే ప్రేమ అని కాదు. ఇల్లాలి మనసును అర్థం చేసుకునే సున్నితత్వం ఈయనలో అమితంగా ఉంది. అదే నాకు చాలా నచ్చుతుంది’’ అన్నారు భవాని. భర్త నటన తనకు అత్యంత ఇష్టమని చెప్పే భవాని తన వైవాహిక జీవితపు మొదటి అడుగులో మాత్రం ఆయన సినిమా నటుడు అని కొంత భయపడ్డానని, కానీ రోజులు గడిచేకొద్దీ ఆయన సాహచర్యంలోని ప్రేమానురాగాలు ఆ భయాన్ని పోగట్టాయని తెలిపారు. అద్భుతః అనిపించేవి ఆదిదంపతులు అభిమానించేలా! అవనిదంపతులు ఆరాధించేలా! రీల్‌లైఫ్ లో రియల్‌లైఫ్‌ని ‘మిథునం’గా కళ్లకు కట్టారు తనికెళ్ల భరణి. ‘మిథునం’ సినిమా ఈయనతో కలిసి చూశాను. మా జీవితాన్నే తెరమీద చూసుకుంటున్నట్టు అనిపించింది. మా దాంపత్యవనంలాంటిదే ఆ సినిమా కూడా! ఈయనా అంతే ఏదైనా నచ్చితే ‘అద్భుతః’ అంటారు. వంట విషయంలో ఆ మెచ్చుకోలు ఎప్పుడూ ఉంటుంది’ అని భవాని చెబుతుంటే ‘నా మాటలనే సినిమాల్లో పెట్టారు కదా’ అంటుంది. ‘అవి నీలాంటి ఇల్లాళ్లందరి మాటలోయ్! అని చెబుతుంటాను’ అన్నారు భరణి నవ్వుతూ! అర్థవంతంగా అమరిక దాంపత్యాన్ని అందంగా మలుచుకోవాలంటే ఇద్దరి మధ్య అహం అడ్డుగోడ కాకూడదని, తమ జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటూ కొన్ని సూచనలు ఇచ్చారు ఈ దంపతులు. ముందుగా భరణి మాట్లాడుతూ - ఏ తప్పు చేసినా తప్పక చెప్పుకోవాల్సినది ఇద్దరికి - ఒకటి ఆత్మకి, రెండు భార్యకి. నేను ఏదున్నా ఫ్రాంక్‌గా భవానికి చెప్పేస్తాను. తనూ అంతే! మా అమ్మను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. తల్లిని ప్రేమించేవాడు భార్యను ప్రేమిస్తాడు. కూతుర్ని ప్రేమించేవాడు ఇతర స్త్రీలను గౌరవిస్తాడు. మా మధ్య చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఉదా:- బయటకెళ్లేటప్పుడు అందుబాటులో ఏదుంటే ఆ డ్రెస్ వేసుకెళతాను. బాగుందా లేదా! అనే పట్టింపులు ఉండవు. కాని భవాని అలా కాదు ‘బయటకు వెళతారు కదా! మంచి డ్రెస్ చూసుకొని వేసుకోవచ్చు కదా!’ అంటుంది. అయితే అలా వేడెక్కిన వాతావరణాన్ని ఒక చిన్న మాటతో చల్లబరుస్తుంటాను.‘ ఫేస్‌వాల్యూ ఉంది కదా! డ్రెస్దేముందిలేవోయ్!’ అని నవ్వేస్తాను. దీంతో ఈవిడా కూల్! ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపులు వచ్చి ఒకట్రెండు రోజులు మాట్లాడుకోని సందర్భాలూ ఉన్నాయి. అయితే నా బలహీనతలు, బలాలు నాకు తెలుసు. అలాగే ఈవిడవి కూడా! ఈవిడను నాకు తగ్గట్టుగా మార్చుకోవడం, నేను మారడం అంటూ ఉంటూనే ఉంటాయి. శుక్రవారంనాడు పెసరట్టులో ఉల్లిపాయలు వేయదు. ‘తింటే ఏమవుతుంది?’ అంటాను. ‘తినొద్దు అంతే!’ అంటుంది. కొన్నింటికి కారణాలు ఉండవు. చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పింది విని అలా ఫిక్స్ అయిపోయింది. ఇలాంటి చోట మా ఇద్దరికీ వాదన వస్తుంటుంది. అయితే ఏ వాదన అయినా అర్థవంతంగా ఆలోచనకు తావిచ్చేలా ఉంటుందే తప్ప గొడవలా ఉండదు. ఎప్పుడైనా ఎంత చిన్నపొరపాటైనా 99 శాతం మొదట నేనే ‘సారీ’ చెప్పేస్తాను’ అన్నారు భరణి. భవాని మాట్లాడుతూ - ‘ఈయన ఏ చిన్న పని మొదలుపెట్టినా ముందుగా నాకు చెబుతారు. అయితే ‘ఆందోళన పడతాను’ అనుకున్న విషయాలను మాత్రం చెప్పరు. సుఖాలే కాదు కష్టాలూ పంచుకోవాలి కదా! ఎందుకు చెప్పరు అని దెబ్బలాడుతుంటాను. ‘నిన్నెప్పుడూ ఆనందంగా ఉంచాలనేది నా ఆలోచన’ అంటారు. అంతకంటే భార్య భర్త నుంచి ఆశించేది ఏముంటుంది’ అని ప్రశ్నతోనే సమాధానమిచ్చారు ఆమె! ‘మా కాలనీలో ఇళ్ల మధ్య ఓ పాడుబడ్డ ప్రభుత్వ స్థలం ఉండేది. అంతకుముందు అందరూ అక్కడ చెత్త వేసేవారు. ఇప్పుడు అక్కడ అందరం కలిసి గుడి కట్టుకున్నాం. అందరూ భక్తిభావాన్ని పెంచుకుంటున్నారు. సంఘజీవనంలో దాంపత్యం కూడా అంతే! నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అలాగే సమాజం నుంచి దంపతులూ నేర్చుకుంటూ తమను తాము మలుచుకుంటూ ముందుకు సాగాలి. సమాజం నుంచి దాంపత్యాన్ని విడదీయలేం’ అని చెప్పిన, అంటున్న వీరి మాటలు వింటుంటే ‘అద్భుతః’ అనిపించకమానదు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మాటల్లో చెప్పలేని ఆనందం... నాలుగు రోజుల కిందట (నవంబర్ 30న) తనికెళ్ల భరణి, దుర్గాభవానీల 25వ పెళ్లిరోజు వేడుక జరిగింది. ఆ వేడుక గురించి భరణి ప్రస్తావిస్తూ - ‘ఉదయం నిద్రలేచి బయటకు వచ్చేసరికి ఇల్లంతా పువ్వులతో అలంకరించి ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. పిల్లల అభినందనలు, మా ఇద్దరికీ కొత్త బట్టలు ఇవ్వడం దగ్గర్నుంచి... ఆ రోజంతా జరిగిన సంఘటనలు మమ్మల్ని ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ఇన్నింటి మధ్యలో తొంభై ఏళ్ల మా అమ్మ ఆశీర్వచనం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిచ్చింది. మాకు తెలియకుండా మా పెళ్లిరోజును వేడుకగా జరపటానికి మా అమ్మాయి సౌందర్యలహరి, అబ్బాయి మహాతేజ మూడునెలలుగా ప్లాన్లు వేసుకున్నారని తెలిసి చాలా సంతోషించాం’ అని చెప్పారు. ‘పిల్లలు, పెద్దలు, బంధువులు, మిత్రులు... వీరందరి మధ్య అప్పుడే పాతికేళ్లు గడిచిపోయాయా? అని ఆశ్చర్యపోయాను’ అన్నారు దుర్గాభవాని. పాతికేళ్ల వివాహ వేడుక గురించి చెబుతున్నంతసేపూ ఇద్దరి ముఖాల్లోనూ పట్టలేని ఆనందం కనిపించింది. అది ఇన్నేళ్లు వారనుభవించిన జీవనమాధుర్యం మిగిల్చిన తృప్తి అని చెప్పకనే చెప్పింది. -
ఆస్కార్ పోటీ నుంచి తెలుగు చిత్రాలు ఔట్!
తెలుగు సినిమాలకు ఆస్కార్ అవార్డుకు పోటీపడే అవకాశం మరోసారి చేజారింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకు పోటీ పడేందుకు టాలీవుడ్ నుంచి 'మిథునం', 'జగద్గురు ఆదిశంకర' చిత్రాలు వెళ్లినా.. అవి మాత్రం చివరి వరకు నిలబడలేకపోయాయి. తప్పిపోయి.. మళ్లీ ఇంటికి చేరుకునే చిన్న పిల్లాడి కథతో తీసిన గుజరాతీ చిత్రం 'ద గుడ్ రోడ్' ఈ చాన్సు కొట్టేసింది. జ్ఞాన్ కొరియా అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తీశాడు. గతంలో ఉత్తమ గుజరాతీ చిత్రంగా జాతీయ అవార్డును సైతం ఈ సినిమా దక్కించుకుంది. వాస్తవానికి జ్యూరీలో ఇద్దరు తెలుగు దర్శకులు.. సీవీ రెడ్డి, ఎన్.శంకర్ ఉన్నా, తెలుగు చిత్రాలకు మాత్రం ఆస్కార్ పోటీ వరకు వెళ్లగలిగే అవకాశం దక్కలేదు. ఈసారి 'లంచ్ బాక్స్', 'భాగ్ మిల్కా భాగ్', 'ఇంగ్లిష్ వింగ్లిష్', మళయాళ చిత్రం 'సెల్యులాయిడ్', కమల్ హసన్ తీసిన 'విశ్వరూపం' లాంటి చిత్రాలు గుజరాతీ 'గుడ్ రోడ్'కు చాలా గట్టి పోటీనే ఇచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీకి దాదాపు 22 ఎంట్రీలు వచ్చాయి. చివరి దశ పోటీకి 'ద లంచ్ బాక్స్', 'భాగ్ మిల్కా భాగ్', 'విశ్వరూపం' చిత్రాలు వెళ్లినా.. జ్యూరీ మాత్రం ఐదు గంటల సుదీర్ఘ చర్చల తర్వాత 'ద గుడ్ రోడ్' చిత్రాన్నే ఎంపిక చేసింది. మిథునం, జగద్గురు ఆదిశంకర చిత్రాలలో ఏదీ ఎంపిక కాకపోవడంపై తెలుగు సినిమా వర్గాల నుంచి పెద్దగా స్పందన ఏమీ కనపడకపోయినా.. లంచ్ బాక్స్ ఎంపిక కాకపోవడం పట్ల మాత్రం సమర్పకుడు కరణ్ జోహార్, సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వారు ట్విట్టర్ ద్వారా తమ కోపాన్ని ప్రదర్శించారు. ఆస్కార్‌లోని విదేశీ చిత్రాల విభాగంలో తుది ఐదు చిత్రాల రేసులో నిలబడిన చిట్టచివరి సినిమా లగాన్ మాత్రమే. ఆ తర్వాత ఏదీ అంతవరకు కూడా వెళ్లలేదు. -
ఆస్కార్ స్క్రీనింగ్‌కి తెలుగు సినిమాలు
‘మిథునం’, ‘జగద్గురు ఆదిశంకర’ చిత్రాలు డబుల్ ధమాకా సాధించాయి. ఈ రెండు సినిమాలూ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ ఏడాది ఆస్కార్ స్క్రీనింగ్‌కి తెలుగు సినిమా తరఫున నామినేట్ అయ్యాయి. నిర్మాతలు మండలి అధికారికంగా ఈ రెండు చిత్రాలను ఎంపిక చేసింది. అలాగే గోవాలో నవంబరులో జరుగనున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమా విభాగానికి ఈ రెండు సినిమాలూ ఎంపిక కావడం విశేషం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి జంటగా తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఆనందరావు నిర్మించిన ‘మిథునం’ గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. జేకే భారవి దర్శకత్వంలో నారా జయశ్రీదేవి నిర్మించిన ‘జగద్గురు ఆదిశంకర’ ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.