తెలుగు సినిమాలకు ఆస్కార్ అవార్డుకు పోటీపడే అవకాశం మరోసారి చేజారింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకు పోటీ పడేందుకు టాలీవుడ్ నుంచి 'మిథునం', 'జగద్గురు ఆదిశంకర' చిత్రాలు వెళ్లినా.. అవి మాత్రం చివరి వరకు నిలబడలేకపోయాయి. తప్పిపోయి.. మళ్లీ ఇంటికి చేరుకునే చిన్న పిల్లాడి కథతో తీసిన గుజరాతీ చిత్రం 'ద గుడ్ రోడ్' ఈ చాన్సు కొట్టేసింది. జ్ఞాన్ కొరియా అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తీశాడు. గతంలో ఉత్తమ గుజరాతీ చిత్రంగా జాతీయ అవార్డును సైతం ఈ సినిమా దక్కించుకుంది.
వాస్తవానికి జ్యూరీలో ఇద్దరు తెలుగు దర్శకులు.. సీవీ రెడ్డి, ఎన్.శంకర్ ఉన్నా, తెలుగు చిత్రాలకు మాత్రం ఆస్కార్ పోటీ వరకు వెళ్లగలిగే అవకాశం దక్కలేదు. ఈసారి 'లంచ్ బాక్స్', 'భాగ్ మిల్కా భాగ్', 'ఇంగ్లిష్ వింగ్లిష్', మళయాళ చిత్రం 'సెల్యులాయిడ్', కమల్ హసన్ తీసిన 'విశ్వరూపం' లాంటి చిత్రాలు గుజరాతీ 'గుడ్ రోడ్'కు చాలా గట్టి పోటీనే ఇచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీకి దాదాపు 22 ఎంట్రీలు వచ్చాయి. చివరి దశ పోటీకి 'ద లంచ్ బాక్స్', 'భాగ్ మిల్కా భాగ్', 'విశ్వరూపం' చిత్రాలు వెళ్లినా.. జ్యూరీ మాత్రం ఐదు గంటల సుదీర్ఘ చర్చల తర్వాత 'ద గుడ్ రోడ్' చిత్రాన్నే ఎంపిక చేసింది.
మిథునం, జగద్గురు ఆదిశంకర చిత్రాలలో ఏదీ ఎంపిక కాకపోవడంపై తెలుగు సినిమా వర్గాల నుంచి పెద్దగా స్పందన ఏమీ కనపడకపోయినా.. లంచ్ బాక్స్ ఎంపిక కాకపోవడం పట్ల మాత్రం సమర్పకుడు కరణ్ జోహార్, సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వారు ట్విట్టర్ ద్వారా తమ కోపాన్ని ప్రదర్శించారు. ఆస్కార్లోని విదేశీ చిత్రాల విభాగంలో తుది ఐదు చిత్రాల రేసులో నిలబడిన చిట్టచివరి సినిమా లగాన్ మాత్రమే. ఆ తర్వాత ఏదీ అంతవరకు కూడా వెళ్లలేదు.
ఆస్కార్ పోటీ నుంచి తెలుగు చిత్రాలు ఔట్!
Published Sat, Sep 21 2013 7:26 PM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement