The Good Road
-
ఆస్కార్ రూట్ నుంచి డైవర్ట్ అయిన ది గుడ్ రోడ్
ఆస్కార్ అవార్డు అందుకోవాలనే కల దాదాపు ప్రతి కళాకారుడికి ఉంటుంది. కానీ, ఆ కల కొంతమందికే నెరవేరుతుంది. ఒకవేళ ఆస్కార్ ప్రతిమను సొంతం చేసుకోలేకపోయినా, కనీసం ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ వరకూ వెళ్లినా ఫర్వాలేదనుకుంటారు. ఆస్కార్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక అసలు విషయానికొస్తే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ ఏడాది మన భారతదేశం నుంచి నామినేషన్ ఎంట్రీ పోటీలో గుజరాతీ సినిమా ‘ది గుడ్ రోడ్’ నిలిచింది. ఇక, అప్పట్నుంచీ ఈ చిత్రం నామినేషన్ వరకూ వెళితే బాగుంటుందని చాలామంది కోరుకున్నారు. కానీ, ఆ కోరిక నెరవేరలేదు. ఎందుకంటే, నామినేషన్ వరకూ వెళ్లకుండానే ‘ది గుడ్ రోడ్’ ఆస్కార్ రూట్ నుంచి డైవర్షన్ తీసుకుంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ ఎంట్రీకి ఎంపికైన తొమ్మిది చిత్రాల వివరాలను ఆస్కార్ అవార్డ్ కమిటీ ప్రకటించింది. వీటిలో ‘ది గుడ్ రోడ్’ లేకపోవడం ఆ యూనిట్ సభ్యులను నిరుత్సాహపరుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక, నామినేషన్ దక్కించుకున్న ఇతర దేశాల చిత్రాల విషయానికి వస్తే... ‘ది బ్రోకెన్ సర్కిల్ బ్రేక్‌డౌన్ (బెల్జియమ్), ‘యాన్ ఎపిసోడ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ యాన్ ఐరన్ పికర్’ (బోస్నియా మరియు హెర్జెగోవినా), ‘ది మిస్సింగ్ పిక్చర్’ (కంబోడియా), ‘ది హంట్’ (డెన్మార్క్), ‘టూ లైవ్స్’ (జర్మనీ), ‘ది గ్రాండ్‌మాస్టర్’ (హంగ్‌కాంగ్), ‘ది నోట్‌బుక్’ (హంగేరి), ‘ది గ్రేట్ బ్యూటీ’ (ఇటలీ), ‘ఒమర్’ (పలెస్టైన్) ఉన్నాయి. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు.. నామినేషన్ దక్కించుకున్నంత మాత్రాన ఫైనల్స్‌కి వెళతాయనడానికి లేదు. వీటిలో ఓ ఐదు చిత్రాలను ఎంపిక చేసి, ఫైనల్స్‌కి పంపిస్తారు. వచ్చే నెల 16న నామినేషన్ దక్కించుకున్న ఆ ఐదు చిత్రాల వివరాలను ఆస్కార్ కమిటీ ప్రకటిస్తుంది. ఆ ఐదులో ఒక చిత్రాన్ని ఆస్కార్ వరిస్తుంది. -
ఆస్కార్ పోటీ నుంచి తెలుగు చిత్రాలు ఔట్!
తెలుగు సినిమాలకు ఆస్కార్ అవార్డుకు పోటీపడే అవకాశం మరోసారి చేజారింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకు పోటీ పడేందుకు టాలీవుడ్ నుంచి 'మిథునం', 'జగద్గురు ఆదిశంకర' చిత్రాలు వెళ్లినా.. అవి మాత్రం చివరి వరకు నిలబడలేకపోయాయి. తప్పిపోయి.. మళ్లీ ఇంటికి చేరుకునే చిన్న పిల్లాడి కథతో తీసిన గుజరాతీ చిత్రం 'ద గుడ్ రోడ్' ఈ చాన్సు కొట్టేసింది. జ్ఞాన్ కొరియా అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తీశాడు. గతంలో ఉత్తమ గుజరాతీ చిత్రంగా జాతీయ అవార్డును సైతం ఈ సినిమా దక్కించుకుంది. వాస్తవానికి జ్యూరీలో ఇద్దరు తెలుగు దర్శకులు.. సీవీ రెడ్డి, ఎన్.శంకర్ ఉన్నా, తెలుగు చిత్రాలకు మాత్రం ఆస్కార్ పోటీ వరకు వెళ్లగలిగే అవకాశం దక్కలేదు. ఈసారి 'లంచ్ బాక్స్', 'భాగ్ మిల్కా భాగ్', 'ఇంగ్లిష్ వింగ్లిష్', మళయాళ చిత్రం 'సెల్యులాయిడ్', కమల్ హసన్ తీసిన 'విశ్వరూపం' లాంటి చిత్రాలు గుజరాతీ 'గుడ్ రోడ్'కు చాలా గట్టి పోటీనే ఇచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీకి దాదాపు 22 ఎంట్రీలు వచ్చాయి. చివరి దశ పోటీకి 'ద లంచ్ బాక్స్', 'భాగ్ మిల్కా భాగ్', 'విశ్వరూపం' చిత్రాలు వెళ్లినా.. జ్యూరీ మాత్రం ఐదు గంటల సుదీర్ఘ చర్చల తర్వాత 'ద గుడ్ రోడ్' చిత్రాన్నే ఎంపిక చేసింది. మిథునం, జగద్గురు ఆదిశంకర చిత్రాలలో ఏదీ ఎంపిక కాకపోవడంపై తెలుగు సినిమా వర్గాల నుంచి పెద్దగా స్పందన ఏమీ కనపడకపోయినా.. లంచ్ బాక్స్ ఎంపిక కాకపోవడం పట్ల మాత్రం సమర్పకుడు కరణ్ జోహార్, సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వారు ట్విట్టర్ ద్వారా తమ కోపాన్ని ప్రదర్శించారు. ఆస్కార్‌లోని విదేశీ చిత్రాల విభాగంలో తుది ఐదు చిత్రాల రేసులో నిలబడిన చిట్టచివరి సినిమా లగాన్ మాత్రమే. ఆ తర్వాత ఏదీ అంతవరకు కూడా వెళ్లలేదు.