పాతికేళ్ల మిథునం | thanikella bharani interview | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల మిథునం

Published Wed, Dec 4 2013 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

పాతికేళ్ల మిథునం

పాతికేళ్ల మిథునం

 పెసరట్టులో ఉల్లిపాయ వేస్తే అద్భుతః అంటారు భరణి...

 ‘ఇవాళ శుక్రవారం... ఉల్లిపాయ వద్దు’ అంటారు భవాని.

 ‘బయటకెళ్లేటప్పుడు మంచి డ్రెస్ వేసుకెళ్లచ్చుగా! చూసినవారు ఏమనుకుంటారు?’ దుర్గాభవాని ధుమధుమలు!

 ‘ఫేస్ వాల్యూ ఉంది కదోయ్, పర్లేదులే!’ భరణి చమక్కులు!

 ఆ ఒక్కమాటతో ఆ ధుమధుమలు కాస్తా దూరం!

 ‘నేను ఆందోళన పడతానని కొన్ని విషయాలు అస్సలు చెప్పరు.

 భార్య అంటే భర్త సుఖంతో పాటూ కష్టం కూడా పంచుకోవాలిగా’ అని భవాని చిరుకోపం...

 ‘నిన్నెప్పుడూ ఆనందంగా ఉంచాలనే నా ఆరాటం’

 భరణి లౌక్యం..

 ‘ఇంతకన్నా భర్త నుంచి భార్యకు కావాల్సిందేముంది?’ అనుకుంటారు భవాని తృప్తిగా.

 భవాని, భరణిల పెళ్లి వయసు పాతికేళ్లు. 

 వెండితెరపై అనురాగ దాంపత్యపు అనుబంధాన్ని

 ‘మిథునం’గా చూపిన భరణి... ఆయన శ్రీమతి భవానిల

 పాతికేళ్ల జీవనయానమే ఈ ‘మనసే జతగా’

 

 తనికెళ్ల భరణి పుట్టి పెరిగింది సికింద్రాబాద్‌లో! దుర్గాభవాని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం. ఇద్దరూ మేనత్తమేనమామ పిల్లలు. తన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటుంది అని పాతికేళ్ల క్రితం మేన మరదలితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట భరణి. ఆ రోజు తాను తీసుకున్న నిర్ణయమే మా రెండు కుటుంబాల మధ్య బంధాలు ఇప్పటికీ పదిలంగా ఉండటానికి పునాది అయ్యిందని భరణి మురిపెం. ఈ దంపతులు హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఉంటున్నారు. ‘భర్త చిన్న తప్పు చేసినా ఇద్దరికి సమాధానమిచ్చుకోవాలి. ఒకటి తన ఆత్మకు, రెండవది తన భార్యకు’ అంటారు భరణి. తొలినాళ్ల కాపురం గురించి భవాని వివరిస్తూ - ‘మొదట చెన్నైలో ఉండేవాళ్లం. రచయితగా, నటుడిగా ఈయన తీరికలేకుండా ఉన్నప్పటికీ ఇంటికోసం కొంత సమయాన్ని తప్పక కేటాయించేవారు. నా ఇష్టాయిష్టాలను తెలుసుకుని మరీ అందుకు అనుగుణంగా మసిలేవారు.

 

  నా పుట్టినరోజు, పిల్లల పుట్టినరోజులు నేటికీ మర్చిపోరు. షూటింగ్‌తో ఎంతదూరంలో ఉన్నా గ్రీటింగ్ చెప్పడం, గిఫ్ట్‌లు పంపడం మర్చిపోరు. ఒకసారి నా పుట్టినరోజున దూరంగా ఉన్నా కూడా ముక్కుపుడకను పంపించారు. కానుకలు ఇస్తేనే ప్రేమ అని కాదు. ఇల్లాలి మనసును అర్థం చేసుకునే సున్నితత్వం ఈయనలో అమితంగా ఉంది. అదే నాకు చాలా నచ్చుతుంది’’ అన్నారు భవాని. భర్త నటన తనకు అత్యంత ఇష్టమని చెప్పే భవాని తన వైవాహిక జీవితపు మొదటి అడుగులో మాత్రం ఆయన సినిమా నటుడు అని కొంత భయపడ్డానని, కానీ రోజులు గడిచేకొద్దీ ఆయన సాహచర్యంలోని ప్రేమానురాగాలు ఆ భయాన్ని పోగట్టాయని తెలిపారు.

 

 అద్భుతః అనిపించేవి

 ఆదిదంపతులు అభిమానించేలా! అవనిదంపతులు ఆరాధించేలా! రీల్‌లైఫ్ లో రియల్‌లైఫ్‌ని ‘మిథునం’గా కళ్లకు కట్టారు తనికెళ్ల భరణి. ‘మిథునం’ సినిమా ఈయనతో కలిసి చూశాను. మా జీవితాన్నే తెరమీద చూసుకుంటున్నట్టు అనిపించింది. మా దాంపత్యవనంలాంటిదే ఆ సినిమా కూడా! ఈయనా అంతే ఏదైనా నచ్చితే ‘అద్భుతః’ అంటారు. వంట విషయంలో ఆ మెచ్చుకోలు ఎప్పుడూ ఉంటుంది’ అని భవాని చెబుతుంటే ‘నా మాటలనే సినిమాల్లో పెట్టారు కదా’ అంటుంది. ‘అవి నీలాంటి ఇల్లాళ్లందరి మాటలోయ్! అని చెబుతుంటాను’ అన్నారు భరణి నవ్వుతూ!

 

 అర్థవంతంగా అమరిక

 దాంపత్యాన్ని అందంగా మలుచుకోవాలంటే ఇద్దరి మధ్య అహం అడ్డుగోడ కాకూడదని, తమ జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటూ కొన్ని సూచనలు ఇచ్చారు ఈ దంపతులు. ముందుగా భరణి మాట్లాడుతూ -

     ఏ తప్పు చేసినా తప్పక చెప్పుకోవాల్సినది  ఇద్దరికి - ఒకటి ఆత్మకి, రెండు భార్యకి. నేను ఏదున్నా ఫ్రాంక్‌గా భవానికి చెప్పేస్తాను. తనూ అంతే!

     మా అమ్మను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. తల్లిని ప్రేమించేవాడు భార్యను ప్రేమిస్తాడు. కూతుర్ని ప్రేమించేవాడు ఇతర స్త్రీలను గౌరవిస్తాడు.

 

     మా మధ్య చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఉదా:- బయటకెళ్లేటప్పుడు అందుబాటులో ఏదుంటే ఆ డ్రెస్ వేసుకెళతాను. బాగుందా లేదా! అనే పట్టింపులు ఉండవు. కాని భవాని అలా కాదు ‘బయటకు వెళతారు కదా! మంచి డ్రెస్ చూసుకొని వేసుకోవచ్చు కదా!’ అంటుంది. అయితే అలా వేడెక్కిన వాతావరణాన్ని ఒక చిన్న మాటతో చల్లబరుస్తుంటాను.‘ ఫేస్‌వాల్యూ ఉంది కదా! డ్రెస్‌దేముందిలేవోయ్!’ అని నవ్వేస్తాను. దీంతో ఈవిడా కూల్! ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపులు వచ్చి ఒకట్రెండు రోజులు మాట్లాడుకోని సందర్భాలూ ఉన్నాయి. అయితే నా బలహీనతలు, బలాలు నాకు తెలుసు. అలాగే ఈవిడవి కూడా! ఈవిడను నాకు తగ్గట్టుగా మార్చుకోవడం, నేను మారడం అంటూ ఉంటూనే ఉంటాయి.

 

     శుక్రవారంనాడు పెసరట్టులో ఉల్లిపాయలు వేయదు. ‘తింటే ఏమవుతుంది?’ అంటాను. ‘తినొద్దు అంతే!’ అంటుంది. కొన్నింటికి కారణాలు ఉండవు. చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పింది విని అలా ఫిక్స్ అయిపోయింది. ఇలాంటి చోట మా ఇద్దరికీ వాదన వస్తుంటుంది. అయితే ఏ వాదన అయినా అర్థవంతంగా ఆలోచనకు తావిచ్చేలా ఉంటుందే తప్ప గొడవలా ఉండదు. ఎప్పుడైనా ఎంత చిన్నపొరపాటైనా 99 శాతం మొదట నేనే ‘సారీ’ చెప్పేస్తాను’ అన్నారు భరణి. భవాని మాట్లాడుతూ - ‘ఈయన ఏ చిన్న పని మొదలుపెట్టినా ముందుగా నాకు చెబుతారు. అయితే ‘ఆందోళన పడతాను’ అనుకున్న విషయాలను మాత్రం చెప్పరు. సుఖాలే కాదు కష్టాలూ పంచుకోవాలి కదా! ఎందుకు చెప్పరు అని దెబ్బలాడుతుంటాను. ‘నిన్నెప్పుడూ ఆనందంగా ఉంచాలనేది నా ఆలోచన’ అంటారు. అంతకంటే భార్య భర్త నుంచి ఆశించేది ఏముంటుంది’ అని ప్రశ్నతోనే సమాధానమిచ్చారు ఆమె!

 ‘మా కాలనీలో ఇళ్ల మధ్య ఓ పాడుబడ్డ ప్రభుత్వ స్థలం ఉండేది.

 

 అంతకుముందు అందరూ అక్కడ చెత్త వేసేవారు. ఇప్పుడు అక్కడ అందరం కలిసి గుడి కట్టుకున్నాం. అందరూ భక్తిభావాన్ని పెంచుకుంటున్నారు. సంఘజీవనంలో దాంపత్యం కూడా అంతే! నలుగురికి ఆదర్శంగా ఉండాలి.  అలాగే సమాజం నుంచి దంపతులూ నేర్చుకుంటూ తమను తాము మలుచుకుంటూ ముందుకు సాగాలి. సమాజం నుంచి దాంపత్యాన్ని విడదీయలేం’ అని చెప్పిన, అంటున్న వీరి మాటలు వింటుంటే ‘అద్భుతః’ అనిపించకమానదు.

 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 

 మాటల్లో చెప్పలేని ఆనందం...

 నాలుగు రోజుల కిందట (నవంబర్ 30న) తనికెళ్ల భరణి, దుర్గాభవానీల 25వ పెళ్లిరోజు వేడుక జరిగింది. ఆ వేడుక గురించి భరణి ప్రస్తావిస్తూ - ‘ఉదయం నిద్రలేచి బయటకు వచ్చేసరికి ఇల్లంతా పువ్వులతో అలంకరించి ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. పిల్లల అభినందనలు, మా ఇద్దరికీ కొత్త బట్టలు ఇవ్వడం దగ్గర్నుంచి... ఆ రోజంతా జరిగిన సంఘటనలు మమ్మల్ని ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ఇన్నింటి మధ్యలో తొంభై ఏళ్ల మా అమ్మ ఆశీర్వచనం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిచ్చింది. మాకు తెలియకుండా మా పెళ్లిరోజును వేడుకగా జరపటానికి మా అమ్మాయి సౌందర్యలహరి, అబ్బాయి మహాతేజ మూడునెలలుగా ప్లాన్లు వేసుకున్నారని తెలిసి చాలా సంతోషించాం’ అని చెప్పారు. ‘పిల్లలు, పెద్దలు, బంధువులు, మిత్రులు... వీరందరి మధ్య అప్పుడే పాతికేళ్లు గడిచిపోయాయా? అని ఆశ్చర్యపోయాను’ అన్నారు దుర్గాభవాని. పాతికేళ్ల వివాహ వేడుక గురించి చెబుతున్నంతసేపూ ఇద్దరి ముఖాల్లోనూ పట్టలేని ఆనందం కనిపించింది. అది ఇన్నేళ్లు వారనుభవించిన జీవనమాధుర్యం మిగిల్చిన తృప్తి అని చెప్పకనే చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement