bharani
-
రూ.కోటి అందుకున్న తొలి హీరో! మీరు అస్సలు ఊహించి ఉండరు!
కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్ టాప్ నటులుగా ఉన్న సమయంలో కూడా వారి కంటే ముందుగా ఒక సినిమాకు కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న టాప్ నటుడి గురించి తెలుసా..? తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రనటులుగా ఉన్న విజయ్, అజిత్, రజనీ, కమల్.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడంటే సరే... సుమారు 20 ఏళ్ల క్రితం కోటి రెమ్యునరేషన్ తీసుకునే నటీనటులకే ఎక్కువ ఇమేజ్ అని ఉండేది. ఆ విధంగా తమిళ సినిమా చరిత్రలో తొలిసారిగా రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటుడు 'మొహిదీన్ అబ్దుల్ ఖాదర్' ఆయన స్క్రీన్ నేమ్ రాజ్‌కిరణ్. కోలీవుడ్‌లో ఒక సినిమాకు కోటి రూపాయలు అందుకున్న తొలి నటుడిగా ఆయన రికార్డుకెక్కారు. రాజ్‌కిరణ్ 16 ఏళ్ల వయసులో చెన్నైకి వచ్చి దినసరి కూలీగా జీవనం సాగించాడు. అప్పుడు అతని జీతం కేవలం రూ. 5 మాత్రమే. అప్పుడు రాజ్‌కిరణ్ శ్రమ, అతని నిజాయితీకి ముగ్ధుడైన యజమాని గుమాస్తాగా పదోన్నతి కల్పించాడు. అప్పటి వరకు నెలకు రూ. 150 జీతం తీసుకుంటున్న రాజ్‌కిరణ్ ప్రమోషన్ తర్వాత రూ. 170 జీతం తీసుకున్నాడు. ఇదంతా 1988వ సంవత్సరంలో జరిగిన కథ. రాజ్‌కరణ్ సినిమాలపై ఆసక్తితో సొంతంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ప్రారంభించి, క్రమంగా సినిమా రంగంలో ఎదగడం ప్రారంభించాడు, ఆ తర్వాత అతను దర్శకత్వంతో పాటుగా పలు సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. అతని సినిమాలు భారీ హిట్‌గా మారడంతో, హీరోగా నటించమని వివిధ నిర్మాణ సంస్థల నుంచి పిలుపు రావడం జరిగింది. అలాంటి సమయంలో ఒక నిర్మాణ సంస్థ నుంచి రూ. కోటి పది లక్షలు ఇస్తామని ఆయనకు ఆఫర్ వచ్చింది. రాజ్‌కిరణ్ తన కష్టానికి గుర్తింపుగా దీన్ని అంగీకరించాడు. రూ.లక్ష జీతం తీసుకున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రూ.1 కోటి పారితోషికంతో తమిళ్లో 'మాణిక్కం' అనే సినిమా తీశారు. 1996లో విడుదలైన ఈ చిత్రానికి కెవి పాండియన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్ సరసన నటుడు విజయకుమార్ కూతురు, బిగ్ బాస్ స్టార్ వనిత జతకట్టింది. అమ్మ క్రియేషన్స్ పతాకంపై డి.శివ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారా రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి తమిళ హీరోగా రాజ్‌కిరణ్ నిలిచాడు. ఆయన తర్వాతే రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, విజయ్, అజిత్ ఆ స్థాయికి చేరుకోవడం గమనార్హం. టాలీవుడ్లో చిరంజీవి టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఆయనకంటే ముందుగానే ఒక సినిమాకు రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్ అందుకొని రికార్డ్ క్రియేట్ చేశారు. అత్యధిక పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లోనే మెగాస్టార్ వార్తల్లో నిలిచారు. ఆపద్బాంధవుడు సినిమాకు గాను ఆయన ఈ భారీ మొత్తాన్ని తీసుకున్నారు. 1992లో వచ్చిన ది వీక్ మ్యాగజైన్ ఫస్ట్ పేజీలో చిరు గురించి ప్రత్యేకంగా పెద్ద ఆర్టికల్ రాశారు. ఆ మ్యాగజైన్ ముందు పేజీలో “బిగ్గర్ దెన్ బచ్చన్” అనే శీర్షికతో చిరు ఫోటోను ప్రచురించారు. -
పండగకి అంకుల్స్ సందడి
‘ఈ సంక్రాంతికి సినిమా సందడి మొదలవుతోంది. వినోదం పుష్కలంగా ఉన్న ఈ ‘క్రేజీ అంకుల్స్’ బాగా సందడి చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ బ్యానర్స్‌పై గుడ్ ఫ్రెండ్స్–బొడ్డు అశోక్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని నిర్మాతలు అచ్చిరెడ్డి, యంఎల్ కుమార్ చౌదరి, బెల్లంకొండ సురేశ్ విడుదల చేశారు. ‘‘క్రేజీ అంకుల్స్ ట్రైలర్ ఎంటర్టైనింగ్గా ఉంది. ఈ చిత్రంతో డబ్బులు బాగా వచ్చి మరిన్ని మంచి సినిమాలు తీయాలని మా శ్రీనుని ఆశీర్వదిస్తున్నా’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేశ్. ఇ. సత్తిబాబు మాట్లాడతూ– ‘‘ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చేస్తున్నప్పుడు మా టీమ్ ఎంత ఎంజాయ్ చేశామో చూస్తున్నపుడు ఆడియన్స్ అంతే ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘శ్రేయాస్ శ్రీను, నేను ఒక సినిమా చేయాలనుకుంటున్న సమయంలో డార్లింగ్ స్వామి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు శ్రీవాస్. సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు రాజా రవీంద్ర మాట్లాడారు. -
యూత్ కోసం రియాలిటీ షో
‘ఫస్ట్ టైమ్ మన యూత్ కోసం తెలుగులో ఒక రియాలిటీ షో వచ్చిందిరా’ అంటూ ప్రారంభమయ్యే ‘తరువాత ఎవరు’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కమల్ కామరాజు, భరణి, మనోజ్, ప్రియాంక శర్మ, యషికా మౌల్కర్, సాయి కిరణ్ ముఖ్య తారలుగా జి.కృష్ణప్రసాద్, కె.రాజేష్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. హ్యాపీ ఎండింగ్ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మిరెడ్డి కె., రాజేష్ కోడూరి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ– ‘‘తరువాత ఎవరు’ టైటిల్లోనే సినిమా కథ మొత్తం ఉంది. ట్రైలర్ చూసిన వారందరూ చాలా గ్రిప్పింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉందని అంటున్నారు. అదే థ్రిల్ సినిమా మొత్తం ఉంటుంది. తప్పకుండా యువతను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘థ్రిల్లర్ సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ, మా థ్రిల్లర్ సినిమా వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది’’ అన్నారు ప్రధాన పాత్రధారులు. సంగీత దర్శకుడు విజయ్ కురాకుల, ఎడిటర్ ఆవుల వెంకటేష్ పాల్గొన్నారు. -
నాడోడిగళ్ సీక్వెల్ మొదలైంది!
తమిళసినిమా: నాడోడిగళ్ సీక్వెల్ చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం మొదలైంది. తొమ్మిదేళ్ల క్రితం తెరపైకి వచ్చిన చిత్రం నాడోడిగళ్. ఆ చిత్రం దర్శకుడు సముద్రకని, నటి అనన్య, అభినయ వంటి వారికి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతే కాదు కమర్శియల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది. తాజాగా అదే సముద్రకని, శశికుమార్‌ల కాంబినేషన్లో నాడోడిగళ్ సీక్వెల్ చిత్రం తెరకెక్కుతోంది. అయితే తొలి భాగంలో నటించిన శశికుమార్, భరణి, నమోనారాయణ మాత్రమే సీక్వెల్లో నటిస్తున్నారు. హీరోయిన్లుగా అంజలి, అతుల్య నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఎంఎస్.భాస్కర్, జ్ఞానసంబంధం, తులసి, శ్రీరంజని, సూపర్‌సుబ్బరాయన్ నటిస్తున్నారు. మరి కొంతమంది నటీనటుల ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు తెలిపారు. మెడ్రాస్ ఎంటర్‌ప్రైజస్ పతాకంపై ఎస్.నందగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకాంబరం ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తిరువళ్లూర్ సమీపంలోని ఒక గ్రామంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రేమను కాపాడే స్నేహితుల ఇతివృత్తంగా నాడోడిగళ్ చిత్రం రూపొందగా ఈ సీక్వెల్లో ఆ అంశంతో పాటు పలు విషయాలు చోటుచేసుకుంటాయని చిత్ర వర్గాలు ఈ సందర్భంగా తెలిపారు. తొమ్మిదేళ్లనాటికి, ఇప్పుటికీ సమాజంలో చాలా మార్పులు జరిగాయని, అలాంటి వన్నీ ఈ చిత్రంలో పొందుపరచనున్నట్లు తెలిపారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో శశికుమార్, అంజలి, అతుల్య చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
ఈతకెళ్లి నలుగురి మునక..
- ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం కంచికచర్ల(కృష్ణా జిల్లా) కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి వద్ద ఉన్న వైరా ఏటిలో ఈతకెళ్లిన నలుగురు బాలలు మునిగిపోయారు. వారిలో భరణి(16)అనే బాలుడు మృతిచెందగా తమ్మి(16) అనే బాలుని పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గండేపల్లికి చెందిన నలుగురు బాలలు ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లారు. ప్రమాద వశాత్తూ ఏటిలో మునిగిపోయారు. గట్టున ఉన్న స్థానికులు వెంటనే ముగ్గురిని కాపాడగలిగారు. భరణి మృతిచెందగా సురక్షితంగా బయటపడిన తమ్మి పరిస్థితి విషమంగా ఉండడంతో కంచికచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ బుల్లితెర నటుడు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన డ్రండ్ అండ్ డ్రైవ్‌లో ఓ బుల్లితెర నటుడు పట్టుబడ్డాడు. శుక్రవారం రాత్రి బుల్లితెర నటుడు భరణి తాగి కారు నడుపుతూ బ్రీత్ ఎనలైజర్లకు దొరికిపోయాడు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనపై కేసునమోదు చేసి కారును సీజ్ చేశారు. పలు ప్రముఖ సీరియల్స్‌లో నటించిన భరణి కొన్ని సినిమాల్లో సైతం నటించాడు. -
కెమెరామన్ కస్టడీలో ఉన్నానా?
సాధారణంగా వదంతుల నుంచి ఏ నటి తప్పించుకోలేరేమో. ప్రేమ, పెళ్లి, రొమాన్స్ లాంటి ప్రచారాల్లో హీరోయిన్ల పేర్లు దొర్లుతునే ఉంటాయి. నిజాలు నిలకడ మీద తెలియక మానవు. వదంతులను సదరు నటీమణులు ఖండిస్తుండడం అనేది కూడా మామూలైపోయింది. నటి పూర్ణ విషయానికొస్తే ఇప్పటికే ఈ భామపై పలు రకాల వదంతులు హల్చల్ చేశాయి. తాజాగా ఈ మలయాళీ బ్యూటీ టాలీవుడ్ ఛాయాగ్రాహకుడు భరణితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్టు వీరిద్దరూ త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. పూర్ణ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటిస్తూ హీరోయిన్గా మంచి గుర్తింపు పొందారు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెమెరామన్ కస్టడీలో ఉన్నట్లు సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పూర్ణ కాల్షీట్స్ పారితోషికం వ్యవహారాలను ఈ కెమెరా మన్ చూసుకుంటున్నారని టాక్. అయితే అందరూ హీరోయిన్ల మాదిరిగానే పూర్ణ కూడా ఈ ప్రచారాన్ని ఖండించారు. ఈ వ్యవహారంపై ఈ బ్యూటీ స్పందిస్తూ తాను కెమెరా మన్ భరణి కలిసి ఇప్పటి వరకు ఒక చిత్రం కూడా చేయలేదన్నారు. ఆయన్ను ఒకటి రెండు సార్లు మాత్రమే కలుసుకున్నానని అంది. అదీ ఒక చిత్రం గురించిన చర్చల్లో భాగంగానేనని తెలిపారు. తాను తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటించడం వలన హైదరాబాదులోనే ఎక్కువ కాలం గడుపుతున్నానని చెప్పారు. ఇటీవల చెన్నైకి వచ్చిన మరుసటి రోజే హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయానన్నారు. స్టార్ హోటళ్లకు కూడా వెళ్లడం లేదని అలాంటిది భరణితో షికార్లు అని ప్రచారం చేయడం అన్యాయం అని వాపోయారు. తాను భరణిని ప్రేమిస్తున్నాననడం ఎంత అసత్యమో తన కాల్షీట్స్ వ్యవహారాలు తను చూస్తున్నారనడం కూడా అంతే అవాస్తవం అన్నారు. -
మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం
-
మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం
అఫ్జల్‌గంజ్: బెంగళూర్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఓ స్టాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యమైంది. అఫ్జల్‌గంజ్ ఎస్ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం...అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన పి. మోహన్‌రావు కుమార్తె భరణి(26) బెంగళూర్‌లోని ఓ కంపెనీలో కొంత కాలంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఈనెల 26వ తేదీ రాత్రి 9 గంటలకు భరణిని తండ్రి ఎంజీబీఎస్‌లో బెంగళూర్ వెళ్లే బస్సు ఎక్కించి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకున్న వెంటనే భరణికి ఫోన్ చేయగా.. స్విచ్ఛాప్ వచ్చింది. ఆందోళనకు గురైన ఆయన అర్ధరాత్రి వరకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మరుసటి రోజు బెంగళూర్‌లో ఆమె పని చేసే కంపెనీకి ఫోన్ చేసి వాకబు చేయగా భరణి రాలేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు నగరంతో పాటు బంధు,మిత్రుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ దొరకకపోవడంతో గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాతికేళ్ల మిథునం
పెసరట్టులో ఉల్లిపాయ వేస్తే అద్భుతః అంటారు భరణి... ‘ఇవాళ శుక్రవారం... ఉల్లిపాయ వద్దు’ అంటారు భవాని. ‘బయటకెళ్లేటప్పుడు మంచి డ్రెస్ వేసుకెళ్లచ్చుగా! చూసినవారు ఏమనుకుంటారు?’ దుర్గాభవాని ధుమధుమలు! ‘ఫేస్ వాల్యూ ఉంది కదోయ్, పర్లేదులే!’ భరణి చమక్కులు! ఆ ఒక్కమాటతో ఆ ధుమధుమలు కాస్తా దూరం! ‘నేను ఆందోళన పడతానని కొన్ని విషయాలు అస్సలు చెప్పరు. భార్య అంటే భర్త సుఖంతో పాటూ కష్టం కూడా పంచుకోవాలిగా’ అని భవాని చిరుకోపం... ‘నిన్నెప్పుడూ ఆనందంగా ఉంచాలనే నా ఆరాటం’ భరణి లౌక్యం.. ‘ఇంతకన్నా భర్త నుంచి భార్యకు కావాల్సిందేముంది?’ అనుకుంటారు భవాని తృప్తిగా. భవాని, భరణిల పెళ్లి వయసు పాతికేళ్లు. వెండితెరపై అనురాగ దాంపత్యపు అనుబంధాన్ని ‘మిథునం’గా చూపిన భరణి... ఆయన శ్రీమతి భవానిల పాతికేళ్ల జీవనయానమే ఈ ‘మనసే జతగా’ తనికెళ్ల భరణి పుట్టి పెరిగింది సికింద్రాబాద్‌లో! దుర్గాభవాని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం. ఇద్దరూ మేనత్తమేనమామ పిల్లలు. తన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటుంది అని పాతికేళ్ల క్రితం మేన మరదలితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట భరణి. ఆ రోజు తాను తీసుకున్న నిర్ణయమే మా రెండు కుటుంబాల మధ్య బంధాలు ఇప్పటికీ పదిలంగా ఉండటానికి పునాది అయ్యిందని భరణి మురిపెం. ఈ దంపతులు హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఉంటున్నారు. ‘భర్త చిన్న తప్పు చేసినా ఇద్దరికి సమాధానమిచ్చుకోవాలి. ఒకటి తన ఆత్మకు, రెండవది తన భార్యకు’ అంటారు భరణి. తొలినాళ్ల కాపురం గురించి భవాని వివరిస్తూ - ‘మొదట చెన్నైలో ఉండేవాళ్లం. రచయితగా, నటుడిగా ఈయన తీరికలేకుండా ఉన్నప్పటికీ ఇంటికోసం కొంత సమయాన్ని తప్పక కేటాయించేవారు. నా ఇష్టాయిష్టాలను తెలుసుకుని మరీ అందుకు అనుగుణంగా మసిలేవారు. నా పుట్టినరోజు, పిల్లల పుట్టినరోజులు నేటికీ మర్చిపోరు. షూటింగ్‌తో ఎంతదూరంలో ఉన్నా గ్రీటింగ్ చెప్పడం, గిఫ్ట్‌లు పంపడం మర్చిపోరు. ఒకసారి నా పుట్టినరోజున దూరంగా ఉన్నా కూడా ముక్కుపుడకను పంపించారు. కానుకలు ఇస్తేనే ప్రేమ అని కాదు. ఇల్లాలి మనసును అర్థం చేసుకునే సున్నితత్వం ఈయనలో అమితంగా ఉంది. అదే నాకు చాలా నచ్చుతుంది’’ అన్నారు భవాని. భర్త నటన తనకు అత్యంత ఇష్టమని చెప్పే భవాని తన వైవాహిక జీవితపు మొదటి అడుగులో మాత్రం ఆయన సినిమా నటుడు అని కొంత భయపడ్డానని, కానీ రోజులు గడిచేకొద్దీ ఆయన సాహచర్యంలోని ప్రేమానురాగాలు ఆ భయాన్ని పోగట్టాయని తెలిపారు. అద్భుతః అనిపించేవి ఆదిదంపతులు అభిమానించేలా! అవనిదంపతులు ఆరాధించేలా! రీల్‌లైఫ్ లో రియల్‌లైఫ్‌ని ‘మిథునం’గా కళ్లకు కట్టారు తనికెళ్ల భరణి. ‘మిథునం’ సినిమా ఈయనతో కలిసి చూశాను. మా జీవితాన్నే తెరమీద చూసుకుంటున్నట్టు అనిపించింది. మా దాంపత్యవనంలాంటిదే ఆ సినిమా కూడా! ఈయనా అంతే ఏదైనా నచ్చితే ‘అద్భుతః’ అంటారు. వంట విషయంలో ఆ మెచ్చుకోలు ఎప్పుడూ ఉంటుంది’ అని భవాని చెబుతుంటే ‘నా మాటలనే సినిమాల్లో పెట్టారు కదా’ అంటుంది. ‘అవి నీలాంటి ఇల్లాళ్లందరి మాటలోయ్! అని చెబుతుంటాను’ అన్నారు భరణి నవ్వుతూ! అర్థవంతంగా అమరిక దాంపత్యాన్ని అందంగా మలుచుకోవాలంటే ఇద్దరి మధ్య అహం అడ్డుగోడ కాకూడదని, తమ జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటూ కొన్ని సూచనలు ఇచ్చారు ఈ దంపతులు. ముందుగా భరణి మాట్లాడుతూ - ఏ తప్పు చేసినా తప్పక చెప్పుకోవాల్సినది ఇద్దరికి - ఒకటి ఆత్మకి, రెండు భార్యకి. నేను ఏదున్నా ఫ్రాంక్‌గా భవానికి చెప్పేస్తాను. తనూ అంతే! మా అమ్మను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. తల్లిని ప్రేమించేవాడు భార్యను ప్రేమిస్తాడు. కూతుర్ని ప్రేమించేవాడు ఇతర స్త్రీలను గౌరవిస్తాడు. మా మధ్య చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఉదా:- బయటకెళ్లేటప్పుడు అందుబాటులో ఏదుంటే ఆ డ్రెస్ వేసుకెళతాను. బాగుందా లేదా! అనే పట్టింపులు ఉండవు. కాని భవాని అలా కాదు ‘బయటకు వెళతారు కదా! మంచి డ్రెస్ చూసుకొని వేసుకోవచ్చు కదా!’ అంటుంది. అయితే అలా వేడెక్కిన వాతావరణాన్ని ఒక చిన్న మాటతో చల్లబరుస్తుంటాను.‘ ఫేస్‌వాల్యూ ఉంది కదా! డ్రెస్దేముందిలేవోయ్!’ అని నవ్వేస్తాను. దీంతో ఈవిడా కూల్! ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపులు వచ్చి ఒకట్రెండు రోజులు మాట్లాడుకోని సందర్భాలూ ఉన్నాయి. అయితే నా బలహీనతలు, బలాలు నాకు తెలుసు. అలాగే ఈవిడవి కూడా! ఈవిడను నాకు తగ్గట్టుగా మార్చుకోవడం, నేను మారడం అంటూ ఉంటూనే ఉంటాయి. శుక్రవారంనాడు పెసరట్టులో ఉల్లిపాయలు వేయదు. ‘తింటే ఏమవుతుంది?’ అంటాను. ‘తినొద్దు అంతే!’ అంటుంది. కొన్నింటికి కారణాలు ఉండవు. చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పింది విని అలా ఫిక్స్ అయిపోయింది. ఇలాంటి చోట మా ఇద్దరికీ వాదన వస్తుంటుంది. అయితే ఏ వాదన అయినా అర్థవంతంగా ఆలోచనకు తావిచ్చేలా ఉంటుందే తప్ప గొడవలా ఉండదు. ఎప్పుడైనా ఎంత చిన్నపొరపాటైనా 99 శాతం మొదట నేనే ‘సారీ’ చెప్పేస్తాను’ అన్నారు భరణి. భవాని మాట్లాడుతూ - ‘ఈయన ఏ చిన్న పని మొదలుపెట్టినా ముందుగా నాకు చెబుతారు. అయితే ‘ఆందోళన పడతాను’ అనుకున్న విషయాలను మాత్రం చెప్పరు. సుఖాలే కాదు కష్టాలూ పంచుకోవాలి కదా! ఎందుకు చెప్పరు అని దెబ్బలాడుతుంటాను. ‘నిన్నెప్పుడూ ఆనందంగా ఉంచాలనేది నా ఆలోచన’ అంటారు. అంతకంటే భార్య భర్త నుంచి ఆశించేది ఏముంటుంది’ అని ప్రశ్నతోనే సమాధానమిచ్చారు ఆమె! ‘మా కాలనీలో ఇళ్ల మధ్య ఓ పాడుబడ్డ ప్రభుత్వ స్థలం ఉండేది. అంతకుముందు అందరూ అక్కడ చెత్త వేసేవారు. ఇప్పుడు అక్కడ అందరం కలిసి గుడి కట్టుకున్నాం. అందరూ భక్తిభావాన్ని పెంచుకుంటున్నారు. సంఘజీవనంలో దాంపత్యం కూడా అంతే! నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అలాగే సమాజం నుంచి దంపతులూ నేర్చుకుంటూ తమను తాము మలుచుకుంటూ ముందుకు సాగాలి. సమాజం నుంచి దాంపత్యాన్ని విడదీయలేం’ అని చెప్పిన, అంటున్న వీరి మాటలు వింటుంటే ‘అద్భుతః’ అనిపించకమానదు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మాటల్లో చెప్పలేని ఆనందం... నాలుగు రోజుల కిందట (నవంబర్ 30న) తనికెళ్ల భరణి, దుర్గాభవానీల 25వ పెళ్లిరోజు వేడుక జరిగింది. ఆ వేడుక గురించి భరణి ప్రస్తావిస్తూ - ‘ఉదయం నిద్రలేచి బయటకు వచ్చేసరికి ఇల్లంతా పువ్వులతో అలంకరించి ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. పిల్లల అభినందనలు, మా ఇద్దరికీ కొత్త బట్టలు ఇవ్వడం దగ్గర్నుంచి... ఆ రోజంతా జరిగిన సంఘటనలు మమ్మల్ని ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాయి. ఇన్నింటి మధ్యలో తొంభై ఏళ్ల మా అమ్మ ఆశీర్వచనం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిచ్చింది. మాకు తెలియకుండా మా పెళ్లిరోజును వేడుకగా జరపటానికి మా అమ్మాయి సౌందర్యలహరి, అబ్బాయి మహాతేజ మూడునెలలుగా ప్లాన్లు వేసుకున్నారని తెలిసి చాలా సంతోషించాం’ అని చెప్పారు. ‘పిల్లలు, పెద్దలు, బంధువులు, మిత్రులు... వీరందరి మధ్య అప్పుడే పాతికేళ్లు గడిచిపోయాయా? అని ఆశ్చర్యపోయాను’ అన్నారు దుర్గాభవాని. పాతికేళ్ల వివాహ వేడుక గురించి చెబుతున్నంతసేపూ ఇద్దరి ముఖాల్లోనూ పట్టలేని ఆనందం కనిపించింది. అది ఇన్నేళ్లు వారనుభవించిన జీవనమాధుర్యం మిగిల్చిన తృప్తి అని చెప్పకనే చెప్పింది.