
అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన
‘మిథునం’ వంటి మంచి చిత్రాన్ని నిర్మించిన ముయిద ఆనందరావు (57) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. సంఘ సేవకుడిగానూ మంచి గుర్తింపు పొందారాయన. సాహిత్యమంటే ఆయనకు మక్కువ. పర్యావరణ హిత పద్యాలను రాసి కోటిగాడు పేరుతో ప్రచురణ చేసేవారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి కీలక పాత్రల్లో తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఆనందరావు నిర్మించిన చిత్రం ‘మిథునం’. 2012లో విడుదలైన ఈ సినిమా 2017లో నంది అవార్డును సొంతం చేసుకుంది. ఆనందరావు మృతితో వావిలవలస గ్రామంలో విషాదం అలముకుంది. ఆయనకు భార్య పద్మినితో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆనందరావు మృతిపై విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.