Ugadi Panchangam: Ugadi 2023-24 Telugu Mithuna Rasi Phalalu, Know Yearly Astrological Prediction - Sakshi
Sakshi News home page

Mithuna Rasi-Ugadi Rasi Phalalu 2023: అన్నింటా శుభయోగం.. ఆ ఒక్కటి చేస్తే మరింత రాజయోగం

Published Mon, Mar 20 2023 12:31 PM | Last Updated on Mon, Mar 20 2023 6:31 PM

Yearly Rasi Phalalu Gemini Horoscope 2023 - Sakshi

మిథున రాశి (ఆదాయం  2, వ్యయం  11,  రాజపూజ్యం 2, అవమానం  4)

మిథునరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. చతుర్థ పంచమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, దశమ లాభస్థానాలలో గురు రాహువుల సంచారం, భాగ్యస్థానంలో శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. కీలకమైన స్థానాలలో ఉన్నవారి వల్ల లబ్ధి చేకూరుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. విదేశీయాన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. 

డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. అగ్రిమెంట్స్, కాంట్రాక్టులు, మార్కెటింగ్, వాణిజ్య ప్రదర్శనలు, ప్రకటనలు, ఉత్తర ప్రత్యుత్తరాలు లాభిస్తాయి. కంటి దోషాలు పెరిగే అవకాశం ఉంది. కొనుగోలు, అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. స్పెక్యులేషన్‌కు దూరంగా వుండటం మంచిది. శత్రువర్గం ఇబ్బంది పెట్టలేని స్థాయిలో ఉంటారు. ఒకనాటి మిత్రులు అగర్భశత్రువులు అవుతారు. అందరూ బలహీనులు అని భావించవద్దు. తగిన సమయం కోసం వేచి ఉన్నారని గ్రహించండి. జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. సాంకేతిక పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. 

ఓం నమశ్శివాయ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఎక్కువ ఆలస్యం చేయకుండా శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. పార్టీ మారడం వల్ల మంచి రాజకీయ ఫలితాలు పొందగలుగుతారు. చిన్నాచితకా వ్యాపారాలు, చేతివృత్తులు, ఆధ్యాత్మిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణాభరణాల భద్రతలో జాగ్రత్తలు అవసరం. సంతానం వల్ల కుటుంబానికి కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఎగుమతి, దిగుమతి వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. క్రెడిట్‌ కార్డులు, బ్యాంకు వ్యవహారాలు, పొదుపు డిపాజిట్‌ల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. 

బంధువులకు సహాయం చేయడం వల్ల చికాకులు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులు అంచనాల మేరకు ఫలిస్తాయి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. మీ వ్యాపార భాగస్వాములు, సహోద్యోగులు అసూయాపరులై ఉంటారు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పార్శ్వపు నొప్పి, ఈఎన్‌టీ సమస్యలు రావచ్చు. కష్టపడి పనిచేసి ఫలితాలను ఆశిస్తారు. సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యనష్టం, కాలహరణం జరుగుతుంది. మనుషుల మనోభావాల్ని స్పష్టంగా చదవగలరు. సంతానం విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యం అవుతాయి. ప్రేమ వివాహాలు విఫలం అవుతాయి. 

విద్యారంగంలో కృషి చేసేవారికి ఆరంభంలోనే ఉద్యోగం వస్తుంది. వాస్తవిక దృష్టితో ఆలోచించి, కుల మత వర్గాలకు అతీతంగా శక్తిసామర్థ్యాలకు పెద్దపీట వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం వల్ల చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు. ఇతరులు సలహాలు చెప్పడానికి వీలులేని వాతావరణం కలిగించవద్దు. పట్టువిడుపులు మంచికి దారితీస్తాయని గ్రహించండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం నవగ్రహ పాశుపత హోమం చేయాలి, శక్తికంకణం లేదా శక్తిరూపు ధరించాలి. ఉపయోగంలేని వ్యక్తుల సాంగత్యం ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళను వదిలించుకోవడం కష్టంగా మారుతుంది. మేలు చేస్తారని మీరు భావించిన వ్యక్తులు ముఖం చాటువేస్తారు. 

స్త్రీలకు ప్రత్యేకం: 

ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం బాగుంది. సన్నిహితులతో, ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి ఏ కార్యక్రమాలలోనైనా నిర్ణయం తీసుకోండి. ఎవరికీ లొంగి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే వారికి భంగపాటు తప్పదు. అవివాహితులకు ఘనంగా వివాహం జరుగుతుంది. సౌందర్య చిట్కాలు, యోగాభ్యాసాలు, మెడిటేషన్‌ మొదలైన వాటి వల్ల ప్రయోజనం పొందుతారు. ఆరావళి కుంకుమ, శ్రీలక్ష్మీ చందనంతో అమ్మవారిని పూజిస్తే మంచిఫలితాలు ఉంటాయి. లీజులు, అగ్రిమెంట్లు, లైసెన్సులు లాభిస్తాయి. 

సంవత్సర ద్వితీయార్ధంలో జీవితం మరో కొత్త పంథాలో నడుస్తుంది. విడిపోవాలన్న వారితో శాశ్వతంగా విడిపోతారు. సంతాన పురోగతి బాగుంటుంది. చెప్పుడు మాటలు విని నష్టపోతారు. శుభకార్యాలకు సంబంధించిన బరువు బాధ్యతలు దించుకుంటారు. పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు సంభవిస్తాయి. మీ వివాదాల ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్త వహించండి. కీళ్ళనొప్పులు, గైనిక్‌ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. షేర్‌ మార్కెట్‌ లాభించదు. చిట్టీలు కట్టి మోసపోతారు. హనుమాన్‌ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అలంకార సామగ్రి అమ్మేవారికి, చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. 

కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు పిల్లల ముందు చర్చించకపోవడం మంచిది. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు మెరిట్‌ మార్కులు, స్కాలర్‌షిప్స్‌ వస్తాయి. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌ లాభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్‌ లభిస్తుంది.  అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. జీవితభాగస్వామి లేదా తత్సమానమైన వ్యక్తితో విభేదాలు తీవ్రతరం అవుతాయి. వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు అత్యంత ప్రజాదరణకు నోచుకుంటాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. ధనాన్ని పొదుపు చేస్తారు. 

మాతృవర్గం వైపు బంధువులకు సహాయం చేయవలసి వస్తుంది. సొంత వ్యాపారాలు కలిసివస్తాయి. పొదుపు పథకాలు అమలు చేసి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువుల భద్రత గురించి ఎక్కువ శ్రద్ధ చూపండి. బ్యూటీ పార్లర్స్‌ నడిపేవారికి, అలంకార సామగ్రి విక్రయాలు మొదలైన వ్యాపారాలు లాభిస్తాయి. కళా, సాంస్కృతిక రంగాలలో, నాట్య, సంగీత రంగాలలో రాణిస్తారు. చలనచిత్ర, టీవీ రంగాలలో అవకాశాలు లభిస్తాయి. పిల్లలను అతి గారాబం చేయడం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. సంతాన సాఫల్యకేంద్రాల వల్ల, దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. 

బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఐటీ రంగాలలోని వారు రాణిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యకు ఎంపికవుతారు. స్వయంకృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. అనువంశికంగా మీకు రావలసిన ఆస్తిలో పెద్దలు రాసిన డాక్యుమెంట్స్‌లో కొన్ని లోపాలు బయటపడతాయి. ఈ లోపాల కారణంగా మీరు కానీ, మీ జీవిత భాగస్వామి కానీ నష్టపోయే అవకాశం ఉంది. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వల్ల నరదిష్టి, నరఘోష తొలగిపోతుయి, జనాకర్షణ ఏర్పడుతుంది. సాధారణ విద్యలోనూ, వైద్య విద్యలోనూ బాగా రాణిస్తారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది.

yearly horoscope 2023

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement