Ugadi Panchangam: Ugadi 2023-24 Telugu Makara Rasi Phalalu, Know Yearly Astrological Prediction - Sakshi
Sakshi News home page

Makara Rasi-Ugadi Rasi Phalalu 2023:మకరరాశి.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో సమస్యలు, ఆత్మీయుల మధ్య విభేదాలు

Published Mon, Mar 20 2023 1:39 PM | Last Updated on Mon, Mar 20 2023 6:23 PM

Yearly Rasi Phalalu Capricorn Horoscope 2023  - Sakshi

మకర రాశి (ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6)

మకరరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్వితీయంలో శని, తృతీయ చతుర్థాలలో గురు సంచారం, తృతీయ చతుర్థాలలో రాహుగ్రహ సంచారం, భాగ్య దశమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, రవి చంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వివాహాది వ్యవహారాలు, నూతన స్వగృహం ఏర్పాట్లు ఈ సంవత్సరం సానుకూలపడతాయి. ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంటుంది.

అవివాహితులకు వివాహకాలంగా చెప్పవచ్చు. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. దీనికి మీ బంధువుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. అయిన వాళ్ళతో సంబంధాలు చేసుకోవాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇతరుల పేరుమీద మీరు చేసే వ్యాపారాలు, బినామీ వ్యాపారాలు లాభిస్తాయి. వ్యాపార సంస్థలను విస్తరింపజేయటమే ధ్యేయంగా కష్టపడతారు. భాగస్వామ్య వ్యాపారాలలో మీ వాటాలను తగ్గించుకుంటారు. కోళ్ళఫారాలు, పశువుల పెంపకం, ఫారిన్‌ కొలాబరేషన్‌ కంపెనీలలో లావాదేవీలు లాభిస్తాయి.

భూముల కొనుగోళ్ళ విషయాలలో అగ్రిమెంట్స్‌కు ప్రాముఖ్యతనిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ, కాంట్రాక్టులు, సబ్‌ కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. అలంకార వస్తు సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వాములు, సన్నిహిత సహచరులు మీ విజయంలో, అభివృద్ధిలో భాగస్వాములవుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. వైరివర్గం వల్ల వృత్తి, ఉద్యోగాలలో చికాకులు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. మీ వాదనలను, అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు. రాజకీయ పదవులకు ఎంపికవడం, రాజకీయ అధికారగణానికి దగ్గరవ్వడం సంభవం.

మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వాస్తవాలను మరుగుపరచే ప్రయత్నాలు చేసి, సమస్యలను ఎదుర్కొంటారు. మీ ప్రతిష్ఠ, స్థానం కుదుపులకు లోనైనా నిలబడుతుంది. వెన్నునొప్పి, కీళ్ళనొప్పులు ఇబ్బంది కలిగించవచ్చు. చిన్న చిన్న కలహాలు, ఆత్మీయుల మధ్య విభేదాలు చికాకు కలిగిస్తాయి. గతంలో ఫైనాన్స్‌ కంపెనీల్లో మీరు పొదుపు చేసిన ధనం ఒక్క రూపాయి కూడా మీ చేతికి రాదు. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. అభిమానించి నెత్తిన పెట్టుకున్న పెద్దలు నిష్కారణంగా దూరంగా ఉంచుతారు. ఎందుకు దూరంగా ఉంచారో? కారణాలు తెలియక మనోవేదనకు గురవుతారు. మీలో ప్రతీకార వాంఛ పెరుగుతుంది.

మీ సన్నిహితులు చేసిన పొరపాట్లకు న్యాయస్థానాల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఖర్చులు తగ్గించే అవకాశాలు ఉండవు. పొదుపు చేసుకునే అవకాశాలు కూడా కనబడవు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా, వ్యక్తిగత కారణాల వల్ల అవకాశాన్ని చేజార్చుకుంటారు. సమాజంలోని ముఖ్యులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. పర్యటనలు, విందులు, వినోదాలు సంతోషం కలిగిస్తాయి. కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తిస్తారు. వ్యాపారపరంగా భాగస్వాములతో కలిసి ఐకమత్యంగా వ్యాపారాలు చేస్తారు. మంచి లాభాలు పొందుతారు. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి.

ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసే వారు తరుచూ ఉద్యోగం మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తిపరంగా స్థిరత్వం ఉండదు. తల్లిదండ్రులు, పెద్దలపట్ల ఎంత విధేయంగా ఉన్నా, వాళ్ళ అభిమానాన్ని సంపూర్ణంగా పొందలేకపోతారు. సంతాన పురోగతి బాగుంటుంది. కుటుంబంలో బంధువుల అతి జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంచటానికి అధికంగా శ్రమిస్తారు. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరఘోష తొలగిపోతుంది. పూర్తి అయ్యాయి అనుకున్న పనుల విషయంలో మళ్ళీ చర్చలు, వివాదాలు చోటు చేసుకుంటాయి. ఘర్షణలు అనివార్యం అవుతాయి. సహోదర వర్గంలో ఒకరు మీకు అండగా నిలుస్తారు. పరిచయాల కన్నా స్నేహం కన్నా ధనమే ముఖ్యమని గ్రహించి బాధపడతారు. చెప్పుకోదగిన సమస్యలు ఆందోళనకు గురిచేస్తాయి.

బయటి స్నేహితులకు చెప్పుకుని ఊరట చెందుతారు. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంతానం వల్ల సమస్యలు అధికం అవుతాయి. చదువు, ఆరోగ్యం సమస్యలుగా మారుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోరపాశుపత హోమం చేయాలి, వీరఖడ్గం మెడలో ధరించాలి. మొత్తం మీద మీకు ఈ సంవత్సరం బాగుంటుంది.

స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ మనోధైర్యం, నిబ్బరం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరికీ మంచి చేసి, చిన్న కారణం వల్ల విరోధం అవుతారు. కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల నైరాశ్యం, కోపం కలుగుతాయి. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్‌కార్డు లభిస్తుంది. కుటుంబానికి సహాయపడతారు. మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని కించపరచిన వాళ్ళు మీ సహాయం అర్థించే పరిస్థితి వస్తుంది.

మీ పేరుపైన ఇతరులు చేసే వ్యాపారాలు మధ్యస్థ ఫలితాన్ని ఇస్తాయి. చిన్నచిన్న కారణాల వల్ల పెద్ద సమస్యలు పక్కతోవ పడతాయి. అష్టమూలికా తైలంతో నవగ్రహ వత్తులతో నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. సామాజిక విషయాలలో మీ పరిజ్ఞానానికి ప్రశంసలు లభిస్తాయి. కోర్టువ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సాంస్కృతిక, కళారంగాలలో గుర్తింపు లభిస్తుంది. విలువైన నగలు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నైతిక బాధ్యతలను నెరవేరుస్తారు. ప్రశాంతంగా సాగుతున్న మీ జీవిత చక్రంలో ఓ వ్యక్తి ప్రవేశం కొన్ని మార్పులకు దారితీస్తుంది.

కుటుంబ వ్యవహారాల పట్ల దృష్టి పెడతారు. సంతానం క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జీవితంలోకి ఆహ్వానించి, జీవితాంతం కలిసి ఉండాలని మీరు వలచిన వ్యక్తి నిజస్వరూపం తెలుసుకుని వేదనకు గురవుతారు. అందరినీ నమ్మాల్సిన పరిస్థితి, ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఇబ్బంది పెడతాయి. విదేశాలలో ఉన్న మీ వాళ్ళు చిక్కుల్లో పడతారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి మీరు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దాచుకున్న ధనం, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వల్ల చిక్కులు ఏర్పడుతాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఇతర భాషల వల్ల ప్రయోజనం, పోటీ పరీక్షలకు సంబంధించి విజయం సాధిస్తారు. డాక్టర్‌లకు, చార్టర్డ్‌ అకౌంటెంట్‌లకు, మ్యారేజ్‌ బ్యూరోలు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంది.

గైనిక్‌ సమస్యలు కొద్దికాలం ఇబ్బంది పెడతాయి. చీటీల వల్ల, ఫైనాన్స్‌ వ్యాపారం వల్ల నష్టపోతారు. స్త్రీల వల్ల కొన్ని సందర్భాలలో నిందలు, ఆరోపణలు రావచ్చు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో చాలా విషయాలు పరిష్కరించు కోగలుగుతారు. దైవానుగ్రహం వల్ల కొన్ని కార్యక్రమాలు వాటికి అవే పూర్తి అవుతాయి. ఐఐటీ, మెడిసిన్‌ సీటు లభిస్తుంది. పోటీ పరీక్షలలో కష్టపడి చదవకపోయినా, అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సెల్ఫ్‌డ్రైవింగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ మీద ప్రేమ లేకపోయినా మీ పేరు కలిసివస్తుందని అన్ని విషయాల్లో మీ పేరుకు ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది.

yearly horoscope 2023

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement