Ugadi Panchangam: Ugadi 2023-24 Telugu Kanya Rasi Phalalu, Know Yearly Astrological Prediction - Sakshi
Sakshi News home page

Kanya Rasi-Ugadi Rasi Phalalu 2023: మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్లే ఉండరు, వారి వల్ల నష్టపోతారు

Published Mon, Mar 20 2023 12:13 PM | Last Updated on Mon, Mar 20 2023 6:32 PM

Yearly Rasi Phalalu Virgo Horoscope 2023 - Sakshi

ఆదాయం  2, వ్యయం  11,  రాజపూజ్యం 4, అవమానం  7

కన్యారాశి వారికి ఈ సంవత్సరం సప్తమ అష్టమస్థానాలలో గురురాహువుల సంచారం, షష్ఠమ స్థానంలో శని, లగ్న ద్వితీయాలలో కేతుగ్రహ సంచారం, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమిలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఉన్నతస్థానాన్ని అధిరోహించే అవకాశాలు లభిస్తాయి. అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు, సేవాసంస్థలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార, వ్యవహారాలపరంగా బాగుంది. రాజకీయంగా అగ్నిపరీక్షాకాలం. విద్యాసంబంధమైన అంశాలు బాగున్నాయి. మెడిసిన్‌ సీటు లభిస్తుంది. సినిమా వ్యాపారం కలిసి వస్తుంది.

ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్‌ ఫ్యాక్టరీలు బాగా సాగుతాయి. ఆక్వారంగంలో, పౌల్టీర్రంగంలో కలిసిరాదు. ఈ సంవత్సరం ప్రధానమైన విషయాలు బాగున్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూరప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. డాక్యుమెంట్స్‌ మీద సంతకాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు పరిశీలించుకోవడం మంచిది. ఫైనాన్స్‌ స్కీములలో చేరవద్దు. రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో మళ్ళీ నిలదొక్కుకుంటారు. ఇతరులు రెచ్చగొట్టే యత్నాలు చేసినా ఓర్పు వహించి వ్యాపార, ఉద్యోగాలను పదిలపరుచుకోండి.

కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కొత్తగా పరిచయమైన మిత్రుల వల్ల లాభపడతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వాహనాలు నడిపే విషయంలో, ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా సహాయపడతారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రత్యర్థి వర్గాన్ని కారణం చూపి ఇబ్బందులపాలు చేయగలుగుతారు. మీపై వచ్చిన ఆరోపణలు మరుగున పడతాయి. విదేశాలలో స్థిరపడిన ఆత్మీయవర్గంతో కలిసి తాత్కాలిక వ్యాపారాలు చేస్తారు. జల, వాయు, ఆహార కాలుష్యం వల్ల అనారోగ్యం కలుగుతుంది. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది.

వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోవడం అనివార్యం అవుతుంది. ప్రేమవివాహాలు కలిసిరావు. కాంట్రాక్టులు, సబ్‌ కాంట్రాక్టులు, లీజులు పొడగించబడతాయి. స్థిరాస్తుల పంపకం వ్యవహారంలో పెద్దలు, బంధువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. గృహశాంతి పాడు చేసుకోవడం ఇష్టం లేక జీవితంలో నటించాల్సి వస్తుంది. ఇతరుల హక్కుల కోసం పోరాటం చేస్తారు. ప్రయోజనాలను వదులుకుంటారు కానీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయరు. మీ వైరివర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ పదవి సంప్రాప్తిస్తుంది.

వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పాత శత్రువులు మళ్ళీ తెరమీదకు వస్తారు. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. మిమ్మల్ని పొగిడే వాళ్ళపట్ల జాగ్రత్తగా ఉండండి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. చాలా సందర్భాలలో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సి వస్తుంది. సంతానం కొన్ని విషయాలలో వక్రమార్గంలోకి వెళ్తారు. విందులు, వినోదాలు ఎక్కువవుతాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ కప్పుసాంబ్రాణితో ధూపం వేయండి. ఫైనాన్స్‌ వ్యాపారానికి, షేర్స్‌కి దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించాలి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. మొత్తంమీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి.

స్త్రీలకు ప్రత్యేకం..
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. క్రీడారంగంలో కొన్ని విజయాలు నమోదు చేసుకుంటారు. దూరప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులు, పిల్లలు పంపిన ధనాన్ని అనుకూలమైన రంగాలలో పెట్టుబడిగా పెడతారు. జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన, వైరాగ్యం, గతస్మృతులు మనోవేదనకు కారణం అవుతాయి. అన్నీ ఉన్నా అనుభవించలేకపోతున్నామనే భావన మీ మనసును కలవరపరుస్తుంది. పుష్కలంగా డబ్బు లేకపోయినా గతంలోనే బాగుందనే భావన పదేపదే అనిపిస్తుంది. కీర్తిశేషులైన రక్తసంబంధీకుల జ్ఞాపకాలు బాధిస్తాయి. విద్యా, కళా, సాహిత్యరంగాలలో రాణిస్తారు. మీ ప్రతిభకు తగిన అవకాశాలు కలిసివస్తాయి.

సమాజంలో మీరొక సెలబ్రిటీ అవుతారు. ప్రతిరోజు నుదుటన యజ్ఞభస్మం ధరించండి. సమాజంలో నెలకొన్న కుల, మత, వర్గ ప్రాంతీయ వైషమ్యాలు మీకు నష్టం కలిగిస్తాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా వుంది. మీ పేరుమీద ఉన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. మీ వ్యక్తిగతమైన సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్, సెల్‌పోన్, కంప్యూటర్, బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ మొదలగు వాటి విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. నూతనమైన వస్త్రాలు ఎక్కువగా ధరిస్తారు. సనాతన సాంప్రదాయల పట్ల మొగ్గు చూపిస్తారు.

నానారకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. పొదుపు చేసిన ధనంతో ఏదైన స్థలం కానీ, ఫ్లాట్‌ కానీ తీసుకోవాలని అనుకుంటారు. మీ మీద ఆధారపడిన వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందజేస్తారు. మనసులోకి ఎవరినీ రానీయకూడదు, ఎవరికీ చోటు ఇవ్వకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంటారు. మీరు మనసులో స్థానమిచ్చి, జీవితాన్ని పంచుకుందామని భావించిన వ్యక్తి మోసం చేయడం వల్ల తీవ్ర మానసిక వేదనకు లోనవుతారు. ఇది కొంతమంది విషయంలోనే అందరికీ కాదు. మీ వల్ల కాదని అందరూ హేళన చేసిన ఒక గొప్ప కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా పూర్తిచేసి, ప్రశంసలు అందుకుంటారు.

తెలివిగా ఆలోచించండి. చిరునవ్వుల వెనుక ఉన్న వైషమ్యాన్ని జాగ్రత్తగా గమనించండి. పొగిడిన వాళ్ళంతా మీ అభిమానులు కారు. వెన్నుదట్టిన వాళ్ళందరూ మీ హితులు కారు. కాలం మీకు అనుకూలంగా ఉన్నంత వరకే. మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రానంత వరకే వాళ్ళ ప్రేమాభిమానాలు పరిమితమవుతాయి. స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. వివాహం కానివారికి వివాహప్రాప్తి, సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. సాంకేతిక, కళారంగాలలో రాణిస్తారు. కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులు మీ శ్రమను, సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఇందువలన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏర్పడతాయి.

ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. సాంస్కృతిక కార్యక్రమాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. దీనివల్ల ఆర్థికంగా ఉపయోగం లేకపోయినా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతనలో కొన్ని సందర్భాలలో మిమ్మల్ని మీరే మరిచిపోతారు. భగవంతుడిని నమ్మండి, ఆరాధించండి. చార్టెడ్‌ అకౌంటెంట్స్‌కు, సివిల్‌ ఇంజనీర్లకు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు, విద్యాసంస్థలు నడిపే వారికి కాలం చాలా అనుకూలంగా వుంది. గతంలో చేసిన పొరపాట్లను తిరిగి జరగకుండా జాగ్రత్తపడతారు. ఒకానొక సందర్భంలో మిమ్మల్ని అర్థం చేసుకునే మనుషులే కరువవుతారు. చివరికి పెద్దలు, తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశివారికి అనుకూలంగా వుంది.

yearly horoscope 2023

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement