సీఎం సమీక్షా సమావేశంలో అధికారులు నోట్ చేసుకున్న కీలక అంశాలు... ‘ఇక్కడ పట్టపగలు నరమేధం జరుగుతోంది. మమ్మల్ని కాపాడువారే లేరా’...
అమరావతి మహాక్యాపిటల్ క్షేత్రంలో సభ కొలువు తీరింది. దైవాంశ సంభూతులమనే పూర్తి విశ్వాసం ఉన్న పుంజీలకొద్దీ అధికారులు సభని కిటకిటలాడిస్తున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో సమస్యలన్నిటినీ కాచి వడపోశారు. ఉలవలు నీళ్లలో పోస్తే తుక తుకా, తుక తుక తుగా, తుక్కతుకా ఉడకటం ఖాయం. సెక్యూరిటీ కారణాల వల్ల ఉలవల ప్రయోగం ఎవరూ చేయలేదు. చేస్తున్న మంచి పనులన్నిటికీ ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని అరవైనాలుగోసారి ముఖ్యనేత లూప్ వేశారు.
ఏ ఒక్కరికీ రవ్వంత అవకాశం ఇవ్వకుండా, ముఖ్యనేత మాత్రమే అంకితభావంతో వాయించి వదులుతున్నారు. రాబోయే కొత్త ఊరగాయల దగ్గర్నుంచి సమస్త విషయాల మీద దిశానిర్దేశం చేసిపడేస్తున్నారు. సభ జరుగుతున్నంతసేవూ తోక పుస్తకాల మీద ఎంతో శ్రద్ధాసక్తులతో అధికారగణం పాయింట్లు నోట్ చేసుకుంటున్నారు. రమారమీ ఎనిమిదిన్నర గంటల తర్వాత సమీక్షా సమావేశం ముగిసింది. ఒక్కసారిగా సభ లఘుశంకలు తీర్చుకోవడానికి బతుకుజీవుడా అని లేచింది. జీడిపప్పు మర్యాదలతోనే ప్రెస్ మీట్ కూడా ముగిసింది. సినిమా వదిలినట్లుంది. బల్లల మీద వదిలేసిన తోక పుస్తకాలను, దొరికిన మేర బాల్ పెన్నులు పోగేసుకున్నా.
అత్యంత శ్రద్ధాసక్తులతో జరిగిన సీఎం సమీక్షా సమావేశంలో అధికారులు నోట్ చేసుకున్న కీలక అంశాలు మా పాఠకుల కోసం.. ఒక పుస్తకంలో ‘ఇక్కడ పట్టపగలు నరమేధం జరుగుతోంది. మమ్మల్ని కాపాడువారే లేరా’ అని ఇంగ్లిష్ స్పెల్లింగ్‌తో రాశారు.పాల ఇంగువ, పిల్లాడికి వంటావదం–డోన్ట్ ఫర్గెట్. ఒక పుస్తకంలో చంద్రబాబుని తలపాగా తంబురాతో శంకర శాస్త్రి గెటప్‌తో గీశారు. సొంత కాబినెట్ కొలీగ్స్ ఇద్దరు వయొలిన్ మృదంగాలపై సహకరిస్తున్నారు. పోలికలు అంత బాగా రాలేదు.ఏడెనిమిది తోక పుస్తకాల మీద కనీసపు పిచ్చిగీతలు కూడా లేవు. వీరంతా అదమరిచి నిద్దరోయినట్లు భావించవచ్చు.
‘మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు చెప్పినట్లుగా సూర్యుడు తూర్పున ఉదయించడం ముదావహం. అలాగే చంద్రుడు.. చంద్రుడు (దిక్కుమీద డౌటు) ఆయన చెప్పిన వైపునే వస్తున్నాడు’. ‘నా సెల్ చార్జర్ రిపేరు.. లేదా కొత్తది’.పన్నెండో బుక్కుమీద, బ్రాడీపేటలో ఎక్కడో లోపలగా ఉన్న అట్లకొట్టు అడ్రసుంది. పొద్దున ఏడులోపు వెళ్లకపోతే సొంతింటి వంటకాన్నే తినవలసి వచ్చును. ‘ఆంధ్రాలో పిడుగుల్లెక్క సరిపోయింది. ఎటొచ్చీ మూడు మాత్రం లెక్కలకి అందలేదు. ఉరిమిఉరిమి మంగలాలమీద పడ్డట్టు భావిస్తున్నారు’.
ప్రశ్న : తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?
జవాబు : నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు.
‘బాగా ముదురుపాకం వచ్చాక, చంద్రబాబు తీర్మానాలల్లే తీగలు తీగలుగా సాగేప్పుడు– ముందుగా వేయించి పెట్టుకున్న సమస్త పప్పుల్నీ బాణలిలో వేసి శక్తికొద్దీ తిప్పాలి’. ‘సుబ్బి పెళ్లి ఎంకి చావుకని వెంకయ్య పదోన్నతితో చంద్రన్నకి రెక్క విరిగింది’. ‘నాకిప్పుడు శక్తి కావాలి. కనీసం సెలైన్ పెట్టండి’. ‘రాష్ట్రంలో పన్నెండేళ్లు రాగానే తెలుగు కుర్రాళ్లకి పంచెల ఫంక్షన్ ఈ ప్రభుత్వమే చేస్తుంది’. ‘రాష్ట్రాన్ని విద్యుత్ గనిగా చేస్తా!’
డాడీ! మన హెరిటేజ్ తోటలో ధనియాలు జల్లితే కొత్తిమీర మొలిచింది!
‘ఇంటలిజంట్ హబ్బా? మజాకానా’. సమావేశం ముగిసింది. స్వస్తి.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment