ఆ రుచే వేరబ్బా!!! | Dishes Gopalaraja is also made of pickles | Sakshi
Sakshi News home page

ఆ రుచే వేరబ్బా!!!

Published Sat, Apr 20 2019 6:13 AM | Last Updated on Sat, Apr 20 2019 6:13 AM

Dishes Gopalaraja is also made of pickles - Sakshi

గోదావరి జిల్లా వాసులను తియ్యటి అభిమానం, ఆప్యాయతలకు మారు పేరుగా చెప్పుకుంటారు. తియ్యటి ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా, తాపేశ్వరం మడత కాజా, ధవళేశ్వరం జీళ్లు, గంగరాజు పాల కోవా... ఒక్కో ప్రాంతం... ఒక్కో తీపి వంటకం.తీపి మాత్రమేనా... కారంలోనూ మాకు మేమే సాటి అంటున్నారు... భీమవరం గోపీ పచ్చళ్ల అధినేత గోపాలరాజు. అతిథులకు ఈ పచ్చళ్లతో కమ్మటి భోజనం వడ్డించి ఆదరిస్తున్నారు... గోపీ పచ్చళ్ల గోపాలరావుతో ఈ వారం ఫుడ్‌ ప్రింట్స్‌...

గోదావరి జిల్లా వాసులకు గౌరవమర్యాదలతో పాటు రుచికరమైన భోజనం వడ్డించడం సంప్రదాయంగా వస్తోంది. బంధువులు, స్నేహితులకు వెజ్, నాన్‌వెజ్‌ అన్నిరకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేసినప్పటికీ, గోపీ పచ్చళ్లు వడ్డించకపోతే, తృప్తి చెందరు. ఇంటికి వచ్చినవారికి మంచి భోజనం ఏర్పాటు చేయడమనేది సరదాతో కూడిన మర్యాద. 

పాతికేళ్లుగా...
భీమవరం పట్టణానికి చెందిన యరకరాజు గోపాలరాజు (గోపీ) వంటలు చేసేవారు. అప్పట్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ వేడుకలు జరిగినా గోపాలరాజు స్వయంగా వంట చేయాల్సిందే. వంటకాలు రుచిగా ఉండటంతో, భోజనం చేసిన వారంతా ‘వంట చాలా బాగుంది’ అని ప్రశంసించేవారు. వంటలతో పాటు పచ్చళ్లు కూడా తయారు చేసేవారు గోపాలరాజు. అందువల్ల చాలామంది ఆయనతో ఊరగాయలు పెట్టించుకునేవారు. క్రమేపీ గోపాలరాజుకు పచ్చళ్ల వ్యాపారం చేయాలనే ఆలోచన కలిగింది. పెద్దగా చదువుకోకపోయినా, వంటలు చేసిన అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకున్నారు. పాతిక సంవత్సరాల క్రితం 1000 రూపాయల విలువ చేసే సరకులు అరువు తెచ్చి, ఆ డబ్బుకి సరిపడా వస్తువులు తెచ్చి, నాణ్యత పాటిస్తూ రుచికరమైన వెజ్, నాన్‌ వెజ్‌ పచ్చళ్లు తయారు చేసి, అమ్మడం ప్రారంభించారు.

కొద్ది కాలానికే గోపీ పచ్చళ్ల ఘాటు ఉభయ గోదావరి జిల్లాలకు వ్యాపించింది. దానితో గోపీ పచ్చళ్లకు డిమాండు పెరిగింది. కొన్ని సంవత్సరాల పాటు ఒంటి చేతి మీదే పచ్చళ్లు తయారుచేశారు గోపాలరాజు. ఈ రోజు మరో పదిమందికి ఉపాధి కల్పించారు. చదువుకోకపోయినా, పెట్టుబడి పెట్టే స్థాయి లేకపోయినా, పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని నిరూపించారు గోపాలరాజు. విదేశాలలోని తెలుగువారికి తెలుగువారి ఆవ ఘాటు రుచి చూపించారు, చూపిస్తూనే ఉన్నారు.నాణ్యమైన, తాజా వస్తువులను ఉపయోగిస్తూ, పరిశుభ్రత పాటించడం వల్ల ఎంత కాలం నిల్వ ఉన్నా, రుచి చెడకుండా, ఎర్రటి రంగులో ఏడాది పొడవునా కంటికి ఇంపు కలిగిస్తాయి ఈ పచ్చళ్లు అంటారు గోపీ పచ్చళ్ల అధినేత గోపాలరాజు.

బొక్కా రామాంజనేయులు,

తెలుగు వారికి ఊరగా యలంటే మహా ప్రీతి. ముఖ్యంగా గోదావరి జిల్లా వాసుల ఇళ్లల్లో పచ్చళ్లు లేకుండా ముద్ద దిగదు. వంటలు చేసిన అనుభవం నాకు ఉపాధి గా మారింది. పచ్చళ్లు కూడా చేయడం ప్రారంభించాను. పాతికేళ్లుగా అదే రుచి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాను. దివంగత నేత వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ఒకసారి ఓ ప్రముఖ రాజకీయనాయకుడి ఇంట్లో మా పచ్చళ్లు తిని, ‘ఇవి ఎక్కడి పచ్చళ్లు’ అని అడిగి తెలుసుకుని, మెచ్చుకున్నారట. ఆ సంఘటన నా జీవితంలో మరచిపోలేను. 
యరకరాజు గోపాలరాజు
గోపీ పచ్చళ్ల అధినేత

నాకు గత 15 ఏళ్లుగా గోపీ పచ్చళ్లతో అనుబంధం ఉంది. వారు నాటి నుంచి నేటి వరకు గోపీ పచ్చళ్లల్లో రుచి, నాణ్యత ఏ మాత్రం తగ్గ లేదు. కమ్మటి నువ్వుల నూనె, మంచి ఘాటు గల మిరప కారంతో ఈ పచ్చళ్లు చాలా రుచిగా ఉంటున్నాయి. భీమవరం వంటి పట్టణంలో  ఇటువంటి రుచి గల పచ్చళ్లు తయారుచేసి, అందించడం అభినందనీయం.

ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి, 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement