న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సలో గృహ వైద్యం/సంప్రదాయ వైద్య విధానాలను వాడాలంటూ తాము సూచించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ చికిత్సలో ‘ఎర్రచీమల పచ్చడి’ని వినియోగించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ఒక పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం గురువారం తిరస్కరించింది. ‘సంప్రదాయ వైద్య విధానాలు, పద్ధతులు మనకు ఎన్నో తెలుసు. మన ఇళ్లలోనూ వీటిని వాడుతుంటాం. ఎవరి ఇళ్లలో వారు ఈ వైద్య విధానాలను సొంతం కోసం వినియోగించుకోవచ్చు. ఎవైనా దుష్ఫలితాలు ఉంటే వాటి బాధ్యత కూడా మీదే అవుతుంది. ఇలాంటి సంప్రదాయ పరిజ్ఞానాన్ని దేశ ప్రజలంతా వాడాలని మేం కోరలేము’అని పిటిషనర్, ఒడిశాకు చెందిన నయధిర్ పధియల్‌కు స్పష్టం చేసింది. ముందుగా కోవిడ్ టీకా వేయించుకోవాలని ఆయన్ని కోరిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
‘ఎర్ర చీమలు, పచ్చి మిర్చితో తయారు చేసే ఈ చట్నీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ వైద్య విధానంలో ఫ్లూ, దగ్గు, జలుబు, శ్వాస సమస్యలు, ఇతర రుగ్మతల నివారణకు వాడతారు. దీన్లో ఫారి్మక్ యాసిడ్, ప్రొటోన్, కాల్షియం, విటమిన్ బి12, జింక్ వంటివి ఉన్నాయి. ఇది కోవిడ్–19 చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది’అని నయధర్ పధియల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘ఎర్ర చీమల చట్నీ’ని కోవిడ్ వైద్యంలో వాడేలా ఆదేశాలివ్వాలంటూ గత ఏడాది డిసెంబర్‌లో ఒడిశా హైకోర్టులో పిటిషన్ వేశారు. పరీశీలించిన న్యాయస్థానం..ఈ విధానంలో శాస్త్రీయతను ధ్రువీకరించాలని సీఎస్‌ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)కు, ఆయుష్ శాఖకు ఆదేశాలిచ్చింది. ఈ రెండు విభాగాలు సమర్పించిన నివేదిక ఆధారంగా హైకోర్టు.. పధియల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment