
సాక్షి, హైదరాబాద్: కరోనా పుణ్య మాని అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగు వారికి అమ్మచేతి వంట తినే భాగ్యం కలిగింది. ఆవకాయ సహా అన్ని రకాల పచ్చళ్లు, కారంపొడులు, అల్లం–వెల్లుల్లి, పసుపు, చింతపండు, మిరియాలు, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులు సైతం అమెరికాకు రివ్వున ఎగిరెళ్లిపోతున్నాయి. ఇక గారెలు, జంతికలు, అరిసెలు, సున్నుండలు, లడ్డూలు వంటి పిండివంటలతో పాటు మందుల సంగతి చెప్పనక్కర్లేదు. కరోనా విజృంభణతో అమెరికా సహా పలు దేశాల్లో లాక్‌డౌన్ విధిం చిన సంగతి తెలిసిందే. దీంతో చాలాచోట్ల ఇండియన్ స్టోర్స్ అందుబాటులో లేవు. మరోవైపు వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని బయటి వస్తువులను తెచ్చుకోవ డం కంటే ఇంట్లో చేసిన వంట కాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న తల్లిదండ్రులు అమెరికా లో ఉన్న తమ పిల్లలు, బంధువుల కోసం వివిధ రకాల ఆహార పదార్థాలను ఎగుమతి చేస్తున్నారు.
ఎక్కువ అమెరికాకే..
అంతర్జాతీయ కొరియర్ సంస్థల ద్వారా విదేశాలకు ఎగుమతవుతున్న నిత్యావసరాల్లో 90 శాతానికిపైగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు వెళ్తుండగా మరో 10 శాతం కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, బ్రిటన్ తదితర దేశాలకు వెళ్తున్నాయి. యూరోప్ దేశాల్లో పన్నుల భారం ఎక్కువగా ఉండడంతో ఆ దేశాల్లో ఉన్న తమ వాళ్లకు హైదరాబాద్ నుంచి ఆయా వస్తువులను పంపించే వారి సంఖ్య తక్కువని కొరియర్ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. సగటున రోజుకు 50 నుంచి 100 క్వింటాళ్ల వరకు ఇక్కడి నుంచి వివిధ రకాల ఆహార పదార్థాలు విదేశాలకు తరలివెళ్తున్నాయి. ఒక్కోసారి 500 క్వింటాళ్ల వరకు కూడా పచ్చళ్లు, పిండివంటల పార్శిళ్లు వెళ్తున్నట్టు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారి ఒకరు చెప్పారు. కాగా, ఒక్కో ప్యాకింగ్‌లో 10 – 25 కిలోల వరకు వస్తువులుంటున్నాయి. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు హైదరాబాద్‌లోని తమ ఇంటి నుంచి కావలసిన వస్తువులను తెప్పించుకుంటున్నారు. కాలిఫోర్నియా, ఒక్లహామా, న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా తదితర ప్రాంతాలకు ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి.
ఇంటి నుంచే పంపించేయొచ్చు
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోయాయి. అదే సమయంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో సర్వీసుల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో రోజుకు 17 కార్గో విమానాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లేవి. ప్రస్తుతం 37 విమానాలు వివిధ దేశాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కరోనా మందులు, ఇతర ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, పీపీఈ కిట్లు తదితర వస్తువులు బల్క్‌గా రవాణా అవుతున్నాయి. అలాగే, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తమ పిల్లలకు, బంధువులకు పంపించే పార్శిళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. డీహెచ్‌ఎల్, ఫెడాక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు వీటిని ఎగుమతి చేస్తున్నాయి. ఈ సంస్థలకు అనుబంధంగా నగరం నలమూలలా 250 నుంచి 300కుపైగా అనుబంధ కొరియర్ సంస్థలు పని చేస్తున్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకొని నేరుగా వారిళ్ల వద్దకే వెళ్లి ప్యాకింగ్ చేసి పార్శిల్ సంస్థలకు తరలిస్తారు. గతంలో కిలోకు రూ.500 తీసుకొనేవారు. ఇప్పుడీ మొత్తం రూ.600కు పెంచేశారు. సరుకు పరిమాణాన్ని బట్టి చార్జీల్లో కొంత మేరకు తగ్గింపూ ఉంటుంది. దీంతో అమెరికాలో ఒకేచోట ఉండి చదువుకుంటున్న తమ పిల్లల కోసం ఇక్కడి తల్లిదండ్రులు నలుగురైదుగురు కలిసి బల్క్‌గా పెద్దమొత్తంలో పంపిస్తున్నారు.
లాక్‌డౌన్ నుంచి డిమాండ్ పెరిగింది
ప్రధాన కొరియర్ సంస్థకు ఏజెంట్‌గా పని చేస్తున్నాను. గతంలో రోజుకు 50 ఆర్డర్ల కంటే తక్కువగా ఉండేవి. ఇప్పుడు వంద వరకు వస్తున్నాయి. ఒక పార్శిల్ 10 కిలోల నుంచి ఎంత బరువైనా ఉండవచ్చు. 10 కిలోల కంటే తక్కువగా పంపించేవాళ్లు ఉండరు.
– రమేష్, కొరియర్, తార్నాక
పక్కా శానిటైజ్ చేస్తాం
కోవిడ్ కారణంగా ప్రతి పార్శిల్‌ను శానిటైజ్ చేస్తున్నాం. ప్రధాన కొరియర్ సంస్థల్లోనూ, తిరిగి అక్కడ వినియోగదారులకు అందజేసేటపుడు కచ్చితంగా శానిటైజ్ చేస్తాస్తారు. పైగా అమెరికాకు చేరాక ఒకరోజు గోడౌన్‌లోనే ఉంచి ఆ మర్నాడు వినియోగదారులకు చేరవేస్తారు.
– సురేష్‌రెడ్డి, చైతన్యపురి
ఫుడ్ ఐటెమ్సే ఎక్కువ
గతంలో అన్ని రకాల వస్తువులను పంపించేవారు. ఇప్పుడు ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. పచ్చళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆ తరువాత పిండివంటలు, స్వీట్లు ఎక్కువగా వెళ్తున్నాయి.
– ఉదయ్, యూఎస్ కొరియర్ సర్వీస్, బేగంపేట
Comments
Please login to add a commentAdd a comment