యూఎస్ ప్రయాణికుల్లో హైదరాబాద్‌ది మూడోస్థానం
ఏటా 10 లక్షల మంది రాకపోకలు
గతంలో షికాగో వరకు వారానికి రెండు సర్వీసులు
కోవిడ్ నుంచి నిలిపివేసిన ఎయిర్ ఇండియా
ఏటా 10 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నా, శంషాబాద్ నుంచి అమెరికా వెళ్లడానికి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. దీంతో ప్రయాణికులు అమెరికాలో ఎక్కడికి వెళ్లాలన్నా రెండు, మూడు విమాన సర్వీసులు మారాల్సి వస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరే అంతర్జాతీయ ప్రయాణికుల్లో 60శాతం మంది అమెరికాకు వెళ్లేవారే ఉంటారు. గతంలో ఎయిర్‌ఇండియా చికాగో వరకు వారానికి రెండు సర్వీసుల చొప్పున నడిపింది. 350 సీట్లు ఉండే ఆ ఫ్లైట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. 90శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. కోవిడ్‌కాలం నుంచి ఆ సర్వీసులను నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరిస్తామని, ఎయిర్ పోర్టువర్గాలు చెప్పినా, ఇప్పటివరకు షికాగో ఫ్లైట్‌లు తిరిగి ప్రారంభం కాలేదు.
3వ స్థానంలో హైదరాబాద్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 55,000 మంది డొమెస్టిక్ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, మరో 10 వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికు లు వివిధ దేశాలకు ప్రయాణం చేస్తున్నారు. దుబాయ్, సింగపూర్, మలేసియా, బ్రిటన్, దోహా, జెడ్డా, మాలే, థాయ్‌లాండ్, జర్మనీ తదితర దేశాలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కానీ అమెరికాకు మాత్రం అలాంటి సదుపాయం లేదు.
అమెరికా ప్రయా ణికుల్లో ఢిల్లీ, ముంబై తర్వాత హైదరాబాద్ మూడోస్థానంలో ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. ఏటా సుమారు 10లక్షల మంది హైదరాబాద్ నుంచి అమెరికాకు రాకపోకలు సాగిస్తున్నారు. తెలుగురాష్ట్రాల నుంచి లక్షలాది మంది విద్యార్థులతోపాటు ఉద్యోగులు, వారి బంధువులు కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన పిల్లల దగ్గరకు వెళ్లేందుకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ప్రయాణాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై నుంచి మాత్రమే అమెరికాకు డైరెక్ట్‌గా విమాన సర్వీసులు ఉన్నాయి.
ఏటేటా పెరుగుతున్న ప్రయాణికులు..
హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళుతున్న ప్రయాణికుల్లో ఎక్కువశాతం న్యూయార్క్, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాలకు వెళుతున్నారు. ప్రయాణికుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. కోవిడ్ అనంతరం రాకపోకలు మరింత ఎక్కువయ్యాయి. ఐఏటీఏ లెక్కల ప్రకారం కోవిడ్‌కు ముందు 2019లో 8.5 లక్షల మంది ప్రయాణం చేయగా, కోవిడ్ కాలంలో రాకపోకలు నిలిచిపోయేనాటికి 2020లో 3 లక్షల మంది ప్రయాణం చేశారు.
ఆ మరుసటి సంవత్సరం పూర్తిగా నిలిచిపోయాయి.ఆంక్షలు తొలగించి అంతర్జాతీయ రాకపోకలు పునరుద్ధరించిన తర్వాత ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. యూఎస్ నుంచి కొత్తగా వీసాలు లభించకపోయినా, అప్పటికే వీసాలు కలిగిఉన్న ప్రయాణికులంతా కోవిడ్ అనంతరం ఇరువైపులా పెద్దసంఖ్యలో ప్రయాణం చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 10 లక్షలకు చేరినట్టు అంచనా. హైదరాబాద్ నుంచి చికాగో వరకు నడిచిన ఎయిర్‌ఇండియా సర్వీసులు పునరుద్ధరించినా ప్రయాణికులకు ఊరట లభిస్తుంది. శంషాబాద్‌లో ఫ్లైట్ ఎక్కేసి నేరుగా షికాగోలో దిగిపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment