పల్లీ ఫుల్‌ బెల్లీ ఫుల్‌ | Peanut Food Special Story | Sakshi
Sakshi News home page

పల్లీ ఫుల్‌ బెల్లీ ఫుల్‌

Published Sat, Sep 7 2019 8:42 AM | Last Updated on Sat, Sep 7 2019 8:42 AM

Peanut Food Special Story - Sakshi

చెనక్కాయలన్నా, పల్లీలన్నా ప్రాణం లేచివస్తుంది అందరికీ. ఉడకబెట్టి తినడం, వేయించి పంటి కింద పటపటలాడించడమూ మామూలే! ఇక్కడ చూడండి. గోంగూరని పల్లీలతో మిక్స్‌ చేయండి. పల్లీలతో మురుకులు ఎలా చేయొచ్చో చూడండి. పల్లీతో పచ్చిపులుసు చేయండి. నాలుగు టొమాటోలు వేసి పచ్చడి నూరండి.ఇది వానల సమయం.వేడివేడి అన్నంలోకి లేదా వేడివేడి చిరుతిండి గానూ ఇవి వెంటనే ట్రై చేయండి.

పీనట్‌ బటర్‌
కావలసినవి: పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్‌ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – కొద్దిగా
తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్‌ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్‌ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి ∙ఈ బటర్‌ చపాతీతో కాని, బ్రెడ్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది.

పల్లీ గోంగూర పచ్చడి
కావలసినవి: గోంగూర ఆకులు – మూడు కట్టలు; పల్లీలు – ఒక కప్పు; ఎండు మిర్చి – 10; ధనియాలు – ఒక టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 4; ఉల్లి తరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; చింతపండు – నిమ్మకాయంత; పచ్చి మిర్చి – 4; నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఎండు మిర్చి, ధనియాలు వేసి వేయించాలి ∙వెల్లుల్లి రేకలు, పల్లీలు వేసి పల్లీల పచ్చి వాసన పోయేవరకు బాగా వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి మిర్చి వేసి దోరగా వేయించి తీసేయాలి ∙ఆ బాణలిలోనే మరి కాస్త నూనె వేసి కాగాక గోంగూర ఆకులు వేసి వేయించాలి కొద్దిగా వేగాక చింతపండు జత చేసి మరోమారు వేయించాలి ∙ఆకు బాగా మెత్తబడ్డాక దింపి చల్లార్చాలి ∙మిక్సీలో పల్లీలు వేసి మెత్తగా చేయాలి ∙పచ్చి మిర్చి, గోంగూర, ఉప్పు జత చేసి మెత్తగా మిక్సీ పట్టాలి
∙కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడికి జతచేయాలి.

పల్లీ మురుకులు
కావలసినవి: బియ్యప్పిండి – 4 కప్పులు; పల్లీల పొడి – ఒక కప్పు; నువ్వులు – 3 టీ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత
తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, పల్లీల పొడి, నువ్వుల పొడి, మిరప కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి ∙2 టేబుల్‌ స్పూన్ల వేడి వేడి నూనె జత చేయాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ మురుకుల పిండిలా కలుపుకోవాలి ∙మురుకుల మౌల్డ్‌కి నూనె పూయాలి ∙కొద్దికొద్దిగా పిండి తీసుకుని మౌల్డ్‌లో ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పిండిని మురుకులాగ నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదే.

బీరకాయ పల్లీల కూర
కావలసినవి:  వేయించిన పల్లీలు – పావు కప్పు; పచ్చికొబ్బరి ముక్కలు – పావు కప్పు; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 3; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; బీరకాయలు – అర కిలో.
తయారీ: ∙బీరకాయల చెక్కు తీసి, చిన్నచిన్న ముక్కలు చేయాలి ∙మిక్సీలో పల్లీలు, కొబ్బరి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙కరివేపాకు, పసుపు జత చేసి వేయించాలి ∙ఇంగువ, ఉల్లి తరుగు జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙ధనియాల పొడి, మిరప కారం, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు వేసి మసాలా వేగేవరకు ఉంచాలి ∙బీరకాయ ముక్కలు వేసి బాగా కలిపి, కప్పుడు నీళ్లు పోసి మరోమారు బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి ∙మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి ఉడికించాలి ∙నూనె పైకి తేలాక, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయాలి.

పీనట్‌ బటర్‌
కావలసినవి: పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్‌ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – కొద్దిగా
తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్‌ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్‌ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి ∙ఈ బటర్‌ చపాతీతో కాని, బ్రెడ్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది.

పల్లీ రైస్‌
కావలసినవి: అన్నం – రెండు కప్పులు; పల్లీలు – 6 టీ స్పూన్లు; నువ్వులు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; జీడిపప్పులు – 10; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 7; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా.
తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి ∙నాలుగు స్పూన్ల పల్లీలు వేసి వేయించాలి ∙పల్లీలు సగం వేగాక మినప్పప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ∙నువ్వులు వేసి సన్న మంట మీద చిటపటలాడేవరకు వేయించి దింపేయాలి ∙కొబ్బరి తురుము వేసి వేయించి చల్లారాక, మిక్సీ జార్లో వేసి, కొంచెం పలుకులుపలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, రెండు టీస్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి ∙జీడిపప్పు వేసి రంగు మారేవరకు వేయించాక, కరివేపాకు వేసి వేయించాలి ∙చల్లారబెట్టుకున్న అన్నం వేసి, ఆ పైన మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి వేయాలి ∙ఉప్పు కూడా వేసి బాగా కలియబెట్టాలి ∙నిమ్మ రసం, కొత్తిమీర వేసి మరోమారు కలిపి తింటే రుచిగా ఉంటుంది ∙తక్కువ టైమ్‌లో ఎంతో రుచిగా తయారయ్యే ఈ వంటకాన్ని పిల్లలకు లంచ్‌ బాక్స్‌లో పెడితే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు.

పల్లీల పచ్చి పులుసు
కావలసినవి: చింతపండు పులుసు – ఒక కప్పు; వేయించిన పల్లీలు – 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; వేయించిన నువ్వులు –  – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ: ∙ముందుగా మిక్సీలో పల్లీలు, నువ్వులు, ఎండు మిర్చి, సగం ఉల్లి తరుగు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి                    ∙కొద్దిగా చింతపండు రసం జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని చింతపండు రసంలో వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి ∙మిగిలిన ఉల్లి తరుగు వేసి మెత్తబడేవరకు వేయించాలి ∙పసుపు జత చేయాలి ∙కరివేపాకు జత చేసి బాగా కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న పల్లీ మిశ్రమాన్ని వేసి కలిపి, కప్పుడు నీళ్లు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి సుమారు ఐదు నిమషాల పాటు సన్నటి మంట మీద ఉడికించి దింపేయాలి.

పల్లీ టొమాటో ఉల్లి చట్నీ
కావలసినవి: నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఎండు మిర్చి – 3;  పల్లీలు – అర కప్పు; వెల్లుల్లి రేకలు – 6;  పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు; ఉల్లి తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు;  ఉప్పు – తగినంత; చింతపండు రసం – పావు కప్పు; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను;  మినప్పప్పు – పావు టీ స్పూను
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఎండు మిర్చి, పల్లీలు, వెల్లుల్లి రేకలు వేసి రంగు మారే వరకు వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు జత చేసి దోర గా వేయించాలి ∙టొమాటో తరుగు, ఉప్పు, చింత పండు రసం జత చేసి బాగా కలిపి మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించి దింపేసి, బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పపున్ప, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించి దింపేసి, సిద్ధంగా ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ∙ఈ చట్నీ దోసెలలోకి, ఇడ్లీలలోకి రుచిగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement