సాక్షి, సిటీబ్యూరో: ఎండకాలం వచ్చిందంటే ఎవరింటా చూసినా మామిడికాయ పచ్చడి హడావిడి కనిపిస్తోంది. ఏడాదికి సరిపడా నిల్వ ఉండేలా పచ్చడిని తయారు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈసారి మాత్రం ఏడాదికి తగ్గట్టుగా కొత్త ఆవకాయ పెట్టుకోవాలంటే జేబు చిలుము వదలాల్సిందే! పచ్చడికి ఇదే సీజన్ కావడంతో మామిడి కాయల అమ్మకాలతో మార్కెట్లు సందడిగా మారాయి.
కాయలను ముక్కలు మొదలు మసాలా దినుసుల కొనుగోలు వరకు గృహిణులతో రాకతో మార్కెట్ కళకళలాడుతోంది. అయితే పచ్చడికి అవసరమైన సరుకులు ధరలు మాత్రం నింగినంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా రెండింతలయ్యాయి. పచ్చడికి మూలమైన మామిడి కాయ ఒకటి రూ.10 పలికితే.. పెద్ద కాయ అయితే రూ.15–20 పలుకుతోంది. కాపు తక్కువగా ఉండడం వల్ల పచ్చడి కాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి.
ఇక మసాలా దినుసుల ధరలు సరేసరి. మిర్చి ధరలు గణనీయంగా పెరగడంతో కారంపొడి నిరుడితో పోలిస్తే రెట్టింపయింది. గతేడాది కిలో రూ.550 ఉండగా.. ఈసారి రూ.800 చేరుకుంది. మసాలాలు, కారమే కాదు అల్లం, వెల్లుల్లి ధరలు మూడింతలు పెరిగాయి. రిటైల్ మార్కెట్‌లో అల్లం కేజీ రూ. 180–200 కాగా వెల్లుల్లి కేజీ రూ.160 విక్రయిస్తున్నారు.
అలాగే బ్రాండెడ్ వేరుశెనగ నూనె లీటర్ ప్యాకెట్ రూ.190–210, నువ్వుల నూనె కిలో రూ.410, మెంతిపొడి కిలో రూ.180, ఆవాలు కిలో 110, జీలకర్ర కిలో 600 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈసారి పెరిగిన ధరలు సామాన్య, పేద తరగతి ప్రజలకు పచ్చడి మెతుకులు కష్టంగానే కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment