మనదేశంలో మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. మార్కెట్‌లో పలు రకాల మామిడి పండ్లు కనిపిస్తాయి. అయితే ఇకపై దేశంలో మామిడికి బదులు ‘అరటి’ పండ్లలో రారాజుగా మారబోతోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం.
2022-23లో ఉత్పత్తి పరంగా అరటి.. మామిడిని అధిగమించింది. అరటి వాటా 10.9 శాతం కాగా మామిడి 10 శాతంగా ఉంది. దేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా మామిడి ఉత్పత్తి అవుతుంది. మన దేశానికి చెందిన మామిడి, అరటిపండ్లకు విదేశాలలో అత్యధిక డిమాండ్ ఉంది. మన మార్కెట్లలో కనిపించని అనేక రకాల మామిడిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.
మామిడి పండించే ప్రధాన దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటా భారత్‌దే. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం మామిడి ఉత్పత్తిలో 23.64 శాతం యూపీలో ఉత్పత్తి అవుతోంది. 2022-23లో మామిడి మొత్తం ఉత్పత్తి 21 మిలియన్ టన్నులు. దేశంలో 1,500కుపైగా మామిడి రకాలు ఉన్నాయి.
మనదేశంలో అరటి పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అరటి పండు అన్ని రాష్ట్రాల్లోనూ ఉత్పత్తి అవుతుంది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలు సమిష్టిగా 67 శాతం అరటిపండ్ల వాటాను అందించాయి. అరటిపండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా భారత్ ఉన్నప్పటికీ మనదేశ ఎగుమతుల వాటా ప్రపంచం మొత్తం మీద ఒకశాతం మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment