ప్రకృతి సేద్యపు చుక్కాని! | much higher yields in the land | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యపు చుక్కాని!

Published Tue, Oct 18 2016 5:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ప్రకృతి సేద్యపు చుక్కాని! - Sakshi

ప్రకృతి సేద్యపు చుక్కాని!

- చౌడు భూమిలోనూ చక్కని దిగుబడులు
- పాలేకర్ శిక్షణతో సాగు పద్ధతి మార్చుకున్న విశ్రాంత వ్యవసాయ సంయుక్త సంచాలకుడు స్తంభాద్రిరెడ్డి
 
 పొలంలో నేల, నీరు చౌడు మయం అయినప్పుడు ఎవుసం (వ్యవసాయం) సాగేదెలా?..
 భూమిని నమ్ముకున్న రైతు బతుకు బండి సజావుగా సాగేదెలా??
 ఒక సాధారణ చిన్న రైతుకు ఈ సమస్యను సమూలంగా పెకలించే సరైన దారి దొరకడం కష్టమే.
 కానీ.. వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ చదువుకొని, వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేసి, సంయుక్త సంచాలకుడిగా రిటైరైన సూదిని స్తంభాద్రి రెడ్డికి కూడా చౌడు చాలాకాలం జటిల సమస్యగానే మిగిలిపోయింది. అయితే, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ సమస్యకు సమాధానం దొరికిందని తన పొలంలో కళకళలాడుతున్న పంటలను చూపుతూ సంతోషంగా చెబుతున్నారు స్తంభాద్రి రెడ్డి. పాలేకర్ శిక్షణ పొందిన తర్వాత ఘన జీవామృతం, జీవామతృం వాడుతూ చౌడు సమస్యను అధిగమించి సంతృప్తికరంగా దిగుబడి తీస్తున్నారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి రైతులకు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. దిక్కుతోచని బడుగు రైతులకు ప్రకృతి వ్యవసాయం ద్వారా వెలుగుబాట చూపుతున్నారు.
 
 సూదిని స్తంభాద్రి రెడ్డి స్వస్థలం మాడుగుల. మొన్నటి వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం శంషాబాద్ జిల్లాలోకి వచ్చింది. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయనకు 12 ఎకరాల భూమి ఉంది. అది ఎర్ర దుబ్బ నేల. చెరువు కింద ఉండడంతో భూగర్భ జలానికి ఎప్పుడూ కరువు రాలేదు. ఒకే బోరుతో 12 ఎకరాలు సాగవుతోంది. అయినా, భూమిలోను, అందులోని నీటి లోనూ చౌడు ఉండడంతో పంటలు అంతంత మాత్రంగానే పండుతుండేవి. వ్యవసాయశాస్త్రంలో పట్టభద్రుడైన స్తంభాద్రిరెడ్డి వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేసి సంయుక్త సంచాలకుడిగా రిటైరయ్యారు.

 విశ్రాంత జీవితం ప్రారంభించిన తర్వాత మనసు వ్యవసాయంపైకి మళ్లింది. చౌడు భూమి కావడంతో తనకు తెలిసిన రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ఆ పూర్వరంగంలో (2008) సుభాష్ పాలేకర్ తిరుపతిలో నిర్వహించిన శిక్షణకు హాజరై ప్రకృతి వ్యవసాయం మూలసూత్రాలను తెలుసుకొని, తమ పొలాన్ని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చారు.
 
 పండ్ల తోటలో అంతర పంటలు
 అది ప్రధానంగా మిశ్రమ పండ్ల తోట. మామిడి, జామ, నేరేడు, యాపిల్ బెర్.. ఉన్నాయి. కంది (పీఆర్‌జి 736), ఉలవ, పెసర, మునగ వంటి అంతరపంటలుగా సాగు చేస్తున్నారు. ఈ ద్విదళ జాతి అంతర పంటలు ఫలసాయాన్నివ్వడంతోపాటు గాలిలోని నత్రజనిని గ్రహించి భూమిని సారవంతం చేస్తాయి. మూడెకరాల్లో పదేళ్ల నాడు నాటిన 140 మామిడి చెట్లున్నాయి. వాటి మధ్యలో భూమిని కప్పి ఉండేందుకు జీలుగ, ఉలవ వేశారు. నేరేడు చెట్లు 30 వరకు ఉన్నాయి. నాటు రకం ఇచ్చినంత కచ్చితమైన దిగుబడి గ్రాఫ్టెడ్ చెట్లు ఇవ్వడం లేదన్నది స్తంభాద్రి రెడ్డి అనుభవం. నాలుగైదు కుంటల్లో వరి సాగులో ఉంది. జనుము/జీలుగ వేసి 40 రోజులకు భూమిలో కలియదున్నడం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, పుల్లమజ్జిగ, చీడపీడలకు కషాయాలతోనే సేద్యం జరుగుతోంది.
 
 ద్రవ జీవామృతంతోనే..
 వంద రోజుల తెలంగాణ సన్నాల (ఆర్‌ఎన్‌ఆర్15048) వరి పంట కోటాకు (ఫ్లాగ్ లీఫ్) దశలో ఉంది. పోషక లోపాలు లేకుండా కళకళలాడుతున్నది. ఐదేళ్లుగా వరిని ఏటా రెండు పంటలు పండిస్తున్నానని, ఈ ఏడాది వరి నాట్లకు ముందు ఘనజీవామృతం కూడా వేయలేదని స్తంభాద్రి రెడ్డి తెలిపారు. ద్రవ జీవామృతాన్ని రెండు సార్లు నీటితోపాటు పారించడం, మూడు సార్లు పిచికారీ చేయడం తప్ప వరి పంటకు చేసిందేమీ లేదన్నారు. ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించక పచ్చిరొట్ట పైరు కూడా అంతగా పెరగలేదన్నారు. చౌడు వల్ల భూమిలో తొలుత కొన్ని పంటలు సరిగ్గా రాలేదని, ఆవు పేడ - మూత్రంతో తయారు చేసిన జీవామృతం వేస్తుండడం వల్ల భూమి స్వభావంలో సానుకూల మార్పు వచ్చిందన్నారు. ఈ ఏడాది ఎకరానికి 25 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుందని ఆయన భావిస్తున్నారు. మామిడి చెట్టుకు నెలకు 5 లీటర్ల ద్రవ జీవామృతం పోస్తున్నామని, ప్రస్తుతం చిగుర్లు వస్తున్నందున 15 రోజులకోసారి జీవామృతం పిచికారీ చేయాలనుకుంటున్నాను. ఎండుపుల్ల, ఇతర చీడపీడల సమస్యలు లేవు. లీఫ్ వెబ్బర్ కనిపించినప్పుడు.. కత్తితో ఆ గూడును లాగేసి చిందర వందర చేస్తున్నాం. మందులేవీ వాడటం లేదని స్తంభాద్రి వివరించారు.
   
 కాలం చాలా మారింది.. అందుకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం దిశగా మన వ్యవసాయం కూడా మారాలి. అప్పుడే మానవాళికి ఆహార భద్రత చేకూరుతుందని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) వంటి అంతర్జాతీయ సంస్థలు, సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తలు చెవిన ఇల్లు కట్టుకొని చెబుతూనే ఉన్నాయి. అయితే, వ్యవసాయంలో ఏయే మార్పులు వస్తే బడుగు రైతుకు కచ్చితమైన నికరాదాయాన్ని, ఆహార భద్రతను అందించడంతోపాటు.. భూమికి, పర్యావరణానికి మేలు జరిగేదీ స్తంభాద్రి రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుందని డా. పులికంటి వెంకటేశ్వరరావు అన్నారు. డా. రావు ఇటీవల స్తంభాద్రి రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆచార్య ఎన్జీరంగా వర్సీటీలో ‘డీన్ ఆఫ్ అగ్రికల్చర్’గా రిటైరైన ఆయన.. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అకాడమీ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ఏకలవ్య ఫౌండేషన్)కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
 - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : రమేశ్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్
 
 భూముల పునరుద్ధరణకు ప్రకృతి సేద్యం ఉత్తమ మార్గం!
 40 ఏళ్లుగా రసాయనిక వ్యవసాయంతో భూమిని క్రమంగా నిస్సారంగా మార్చాం. భూముల నాశనం ఎంత తీవ్ర స్థాయికి చేరిందంటే ఎరువు వేసినా మొక్క తీసుకోలేనంత దశకు వెళ్లింది. వేసిన రసాయనిక ఎరువు 90% వృథా అవుతున్నది. రైతుకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయే తప్ప ఫలితం ఉండటం లేదు. ఇటువంటి సంక్షోభ దశలో భూముల పునరుద్ధరణకు, మంచి దిగుబడి పొందడానికి ప్రకృతి వ్యవసాయం చక్కని పరిష్కారం. స్తంభాద్రి రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రమే ఇందుకు నిదర్శనం. జీవామృతం తప్ప ఏమీ వాడకపోయినా వరి, మామిడి తదితర పంటల్లో పోషక లోపాలు, చీడపీడలు లేవు. పంటలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. చౌడు సమస్య తీరింది. జీవామృతం వల్ల మొక్కల వేళ్లు పోషకాలను సజావుగా తీసుకోగలిగే పరిస్థితి ఏర్పడింది. నత్రజని పుష్కలంగా అందడంతో కీలకమైన కోటాకు దశలో వరి పంట పచ్చగా, ముచ్చటగా ఉంది. జింక్, మెగ్నీషియం లోపాలు, ఎండుపుల్ల సమస్యల్లేకుండా మామిడి చెట్లు పచ్చగా ఉన్నాయి. జీవామృతం, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు కలిపి వాడితే ఏ భూముల్లోనైనా, ఏ పంటలోనైనా ప్రకృతి వ్యవసాయం కచ్చితమైన సత్ఫలితాలనిస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతుకు, సమాజానికి మేలు జరుగుతుంది.  
 - డా. పులికంటి వెంకటేశ్వరరావు, మొక్కల శరీర ధర్మ శాస్త్ర నిపుణులు, రిటైర్డ్ ‘డీన్ ఆఫ్ అగ్రికల్చర్’, ఆచార్య ఎన్జీరంగా వర్సీటీ, హైదరాబాద్
 మొబైల్: 94901 92672  pvraophy@gmail.com

 ప్రకృతి వ్యవసాయంతో రైతుకు కచ్చితమైన నికరాదాయం ఖాయం!
 చౌడు సమస్యను అధిగమించడానికి ప్రకృతి వ్యవసాయం దోహదపడింది. ఆవు పేడ, మూత్రం జీవామృతంలో వాడటం వల్ల భూమి స్వభావం పంటలకు అనుకూలంగా మారింది, భూసారం పెరిగింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్ర నాశనులు కొనే ఖర్చు తప్పింది. పరిస్థితులు ఎలా ఉన్నా కచ్చితమైన నికరాదాయం ప్రకృతి సేద్యం వల్లనే సాధ్యమవుతుందన్నది స్వానుభవం నేర్పిన పాఠం. గత ఏడాది 3 ఎకరాల మామిడి తోట నుంచి రూ. 1.45 లక్షల ఆదాయం వచ్చింది. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమికి, రైతుకే కాదు.. పర్యావరణ సమతుల్యత నెలకొని ఎనలేని మేలు జరగుతుంది. అందుకే ఈ వ్యవసాయాన్ని శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి మరీ రైతులకు నేర్పిస్తున్నాం.
 - సూదిని స్తంభాద్రి రెడ్డి (94402 82102), మాడుగుల, శంషాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
 
 25 నుంచి 3 రోజులు పాలేకర్‌తో క్షేత్ర సందర్శన
 మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చక్కటి దిగుబడులిస్తున్న నారింజ, బత్తాయి, అరటి, మిరప, పత్తి, చెరకు, పసుపు, కంది, కూరగాయల తోటలను సుభాష్ పాలేకర్‌తో కలసి సందర్శించాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఈ నెల 25, 26, 27 తేదీల్లో నాగపూర్, అమరావతి జిల్లాల్లోని 5 తాలూకాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల సందర్శన కార్యక్రమం ఖరారైంది. 3 రోజులకు భోజన వసతులకు ఒక్కొక్కరు రూ. 300 చెల్లిస్తే చాలు. వివరాలకు (హిందీ).. రాహుల్ చౌదరి - 097654 02121, మనోజ్ జాంజల్ - 098225 15913, నీలేశ్ చిక్లే - 075070 98811లను సంప్రదించవచ్చు.
 
 ప్రకృతి వ్యవసాయంపై బెంగళూరులో 3 నెలల శిక్షణ
 శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు ప్రకృతి వ్యవసాయంపై యువతకు 3 నెలల పాటు ఆశ్రమ శిక్షణ ఇవ్వనుంది. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో ఉండి రోజుకు 5 గంటల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. కనీసం పదో తరగతి పాసైన 18-35 ఏళ్ల మధ్య వయస్కులైన యువతీయువకులు శిక్షణకు అర్హులు. శిక్షణ పొందే వారు రుసుము, భోజన వసతి సదుపాయాలకు గాను 3 నెలలకు కలిపి మొత్తం రూ. 6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. కొందరికి దేశంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో సూపర్‌వైజర్లుగా నియమించే అవకాశం ఉంది. ఇతర వివరాలకు.. శ్రీశ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు (బెంగళూరు) బాధ్యులను సంప్రదించవచ్చు. ఫోన్ : 080- 28432965 training.ssiast@gmail.com; website: www.ssiast.com
 
 సేంద్రియ సేద్యంపై మార్కాపురంలో నేడు శిక్షణ
 
- ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో
- నాగపూర్ శాస్త్రవేత్తలతో ప్రత్యేక శిక్షణ
- 18న మార్కాపురంలో, 19న దద్దవాడలో
సేంద్రియ సేద్యంపై అవగాహన కార్యక్రమాలు

 సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించే ఉదాత్త లక్ష్యంతో ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురంలోని జార్జి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఈ  నెల 18 (మంగళవారం)న రైతులకు శిక్షణా శిబిరం జరగనుంది. సన్‌సద్ ఆదర్శ్ గ్రామీణ యోజన అమలులో భాగంగా కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీని ఎంపీ సుబ్బారెడ్డి దత్తత తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించి సేంద్రియ సేద్యం వైపు రైతులను మళ్లించేందుకు 1,500 మంది రైతులకు మార్కాపురంలో 18న శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఉంటుంది. 19వ తేదీన కొమరోలు మండలం దద్దవాడలోని సేంద్రియ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో అవగాహన కార్యక్రమం జరుగుతుంది.

ట్రైకోడెర్మా విరిడి, ఇతర సేంద్రియ ఉత్పత్తులతో సులభంగా సేంద్రియ ఎరువుల తయారీ, వాడకంపై రైతులకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని నాగపూర్ (మహారాష్ట్ర)కు చెందిన సేంద్రియ వ్యవసాయ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు డా. ఎ.ఎస్. రాజ్‌పుత్, శాస్త్రవేత్తలు డా. వి. ప్రవీణ్‌కుమార్, డి.కె. శర్మ ఈ రెండు రోజుల్లో రైతులకు శిక్షణ ఇస్తారు. దర్శి కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డా. వరప్రసాద్, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా. శారద, ఐటీసీకి చెందిన నిపుణులు సురేశ్, సునీల్ తదితరులు పాల్గొంటారు. మరిన్ని వివరాలకు జార్జి ఇంజనీరింగ్ కళాశాల  అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ప్రొ. సి.హెచ్. రాజబాబు (94401 81910)ను సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement