మహోద్యమంగా జలసంరక్షణ | PM Modi calls for mass movement for water conservation on Mann ki baat | Sakshi
Sakshi News home page

మహోద్యమంగా జలసంరక్షణ

Published Mon, Jul 1 2019 3:08 AM | Last Updated on Mon, Jul 1 2019 3:08 AM

PM Modi calls for mass movement for water conservation on Mann ki baat - Sakshi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తావించిన ఊటకుంట ఇదే

న్యూఢిల్లీ: దేశంలో జల సంరక్షణను ఓ మహోద్యమంగా చేపట్టాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలంతా వర్షపునీటిని సంరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పలు నదులు, జలాశయాలు ఎండిపోయి ప్రజలు నీటికి కటకటలాడుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆదివారం నిర్వహించిన తొలి మాసాంతపు మన్‌కీ బాత్‌(మనసులో మాట) కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు.

నీటి పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం పాటించడం సరైన పద్ధతి కాదని మోదీ అభిప్రాయపడ్డారు. ఒక్కో ప్రాంతంలో అక్కడి స్థానిక పరిస్థితులకు తగ్గట్లు ప్రతీ నీటిచుక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నీటి వనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు, ఇతర సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని, జలసంరక్షణ పద్ధతులను అందరికీ వివరించాలని కోరారు. ప్రస్తుతం భారత్‌లో కురుస్తున్న వర్షంలో కేవలం 8 శాతం నీటిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామన్నారు. గ్రామసభలను ఏర్పాటుచేసి ప్రజలంతా జల సంరక్షణ విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జలసంరక్షణ చర్యల్ని ప్రజలంతా ‘జన్‌శక్తి4జల్‌శక్తి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా పంచుకోవాలని సూచించారు. 2014 అక్టోబర్‌ 3 నుంచి 2019, ఫిబ్రవరి 24 వరకు 53 సార్లు ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమాన్ని నిర్వహించిన మోదీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిపివేశారు.

కేదార్‌నాథ్‌ను అందుకే దర్శించుకున్నా..
సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను గెలిపించిన ప్రజలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. ‘ఈ ఏడాది ఫిబ్రవరి 24న మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ఓ 3–4 నెలల తర్వాత  మళ్లీ కలుసుకుందామని చెప్పాను. ఈ నమ్మకం మోదీది కాదు. ఇది మీరునాపై ఉంచిన నమ్మకం. ఈ నమ్మకానికి మీరే మూలకారణం. నన్ను మళ్లీ గెలిపించి ఇక్కడకు తీసుకొచ్చారు. మరోసారి మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు’ అని మోదీ తెలిపారు.

‘మన్‌కీ బాత్‌’ ఆగిపోయిన సమయంలో తనకు ప్రజలతో సంభాషించే అవకాశం లేకుండాపోయిందనీ, అసౌకర్యంగా, ఒంటరిగా అనిపించిందని వెల్లడించారు. ‘ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ  కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను దర్శించుకున్నాను. ఎన్నికల మధ్యలో ఎందుకు వెళ్లారని నన్ను చాలామంది అడిగారు. రాజకీయ ప్రచారం కోసమే వెళ్లానని కొందరు అనుకున్నారు. కానీ నా అంతరాత్మను కలుసుకోవడానికి, నన్ను నేను సమీక్షించుకోవడానికే కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ వెళ్లాను. అక్కడ ధ్యానం చేయడం మన్‌కీబాత్‌ కార్యక్రమం లేనిలోటును పూడ్చింది’ అన్నారు.

మోదీ నోట ‘ఊటకుంట’
అడ్డాకుల (దేవరకద్ర): ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తిమ్మాయిపల్లితండా శివారులో నిర్మించిన ఊటకుంటను ప్రస్తావించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన ఈ ఊటకుంట సత్ఫలితాలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. వర్షాలు కురిసినప్పుడు నీరు వృథాగా వెళ్లకుండా ఉండేందుకుగాను 4–5 ఏళ్ల క్రితం ఈ కుంటను నిర్మించారు. దీనికి అనుబంధంగా మరో రెండింటిని ఏర్పాటుచేశారు. దీనివల్ల వర్షం కురిసినప్పుడు గుట్టల పైనుంచి వచ్చే వర్షపునీరు కుంటలోనే నిలిచి పరిసరాల్లో ఉండే బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతోంది. పెద్దపెద్ద చెరువుల వల్ల కలిగే ప్రయోజనాలు ఉపాధిహామీలో చిన్న కుంటలతోనూ లభిస్తున్నాయని చెబుతూ మోదీ ఈ ఊటకుంటను ప్రస్తావించారు.

ప్రజాస్వామ్య గొప్పతనం తెలియట్లేదు..
1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘రోజూ సమయానికి భోజనం చేసే వ్యక్తికి ఆకలి కేకలు ఎలా ఉంటాయో తెలియదు. అలాగే ప్రస్తుతం ప్రజాస్వామ్య హక్కులను హాయిగా అనుభవిస్తున్న ప్రజలకు వాటి విలువ పోగొట్టుకుంటే తప్ప బోధపడదు. ఏదైనా మన దగ్గరున్నప్పుడు దాని విలువను అర్థం చేసుకోలేం. ఎమర్జెన్సీ సమయంలో ప్రతీపౌరుడికి తమకు సంబంధించినదేమో లాక్కున్న భావన కలిగింది. దీంతో 1977లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటేశారు. అత్యంత గొప్పదైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండటం నిజంగా మన అదృష్టమే.

కానీ దాన్ని మనం తగినరీతిలో గౌరవించడం లేదు’ అని తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో ఏకంగా 61 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రధాని వెల్లడించారు. ఈ సంఖ్య అమెరికా జనాభాకు రెట్టింపని తెలిపారు. భారత్‌లోని మొత్తం ఓటర్ల సంఖ్య యూరప్‌ ఖండం జనాభా కంటే ఎక్కువన్నారు. ఈ ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారనీ, ప్రస్తుతం పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారని చెప్పారు. ప్రజలంతా గూగుల్‌ ద్వారా ఎక్కువ పుస్తకాలు చదవాలన్నారు. ఈ సందర్భంగా గూగుల్‌ను ‘గూగుల్‌ గురు’గా ప్రధాని అభివర్ణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement