సాక్షి, న్యూఢిల్లీ : నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా సమగ్రమైన చర్యలు తీసుకోవాలి. వాతావరణ సమతౌల్యతను కాపాడడంతోపాటు దేశంలో జల సంరక్షణ కోసం గత రెండు దశాబ్దాలుగా నిపుణులు జాగ్రత్తగా రూపొందించిన విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2015లో అనూహ్యంగా మార్చి వేశారు. ‘ప్రధాన మంత్రి కృషి సించాయ యోజన’ పేరిట ఆయన ప్రభుత్వం కొత్త వ్యవసాయ స్కీమ్‌ను ప్రారంభించి, జల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్’ స్కీమ్‌ను వ్యవసాయ స్కీమ్‌లో కలిపేసింది.
వాటర్‌షెడ్‌కు కేటాయించిన నిధులను వ్యవసాయానికి మళ్లించింది. ఇది చాలా ప్రతికూలమైన పరిణామంగా పేర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలో మూడొంతుల భూభాగం నీటి సదుపాయం లేని మెట్టభూములని, వాటికి అనుకూలంగానే ఇంతకుముందు వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ స్కీమ్‌ను రూపొందించినట్లు వారు చెబుతున్నారు. తాత్కాలిక ప్రయోజనాలను ఆశిస్తే భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దేశంలో జల సంరక్షణ కోసం 1980లో మార్గదర్శకాలను రూపొందించి, వాటిని ఓ స్కీమ్‌గా మలిచేందుకు దాదాపు రెండు దశాబ్దాలు పట్టిందని, ఫలితంగా 2009లో వాటర్‌షెడ్ స్కీమ్ ప్రారంభమైందని వారు చెబుతున్నారు.
అలాగే గతంలో మోదీ ప్రభుత్వం మంచినీటి పథకాలకు కేటాయించిన నిధులను ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించారని, దాని వల్ల నీటి పథకాలకు 80 శాతం నిధులు తగ్గిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిధులు మళ్లించడం పట్ల 2016లో పార్లమెంటరీ కమిటీ సంబంధిత మంత్రిత్వ శాఖను విమర్శించింది. దేశంలో స్వచ్ఛ భారత్ కింద నిర్మించిన ప్రతి పది మరుగుదొడ్లలో ఆరింటికి నీటి సదుపాయం లేదని 2017లో కేంద్ర ప్రభుత్వ నివేదికనే వెల్లడించింది. నీటి సదుపాయం లేని మరుగు దొడ్ల వల్ల ఏం ప్రయోజనమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కొత్త పథకాలను చేపట్టక పోయినా ఫర్వాలేదుగానీ, ఉన్న పథకాలను నీరుగార్చవద్దని వారు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment