water shed scheme
-
‘నీరు’గారుతున్న పథకాలు
సాక్షి, న్యూఢిల్లీ : నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా సమగ్రమైన చర్యలు తీసుకోవాలి. వాతావరణ సమతౌల్యతను కాపాడడంతోపాటు దేశంలో జల సంరక్షణ కోసం గత రెండు దశాబ్దాలుగా నిపుణులు జాగ్రత్తగా రూపొందించిన విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2015లో అనూహ్యంగా మార్చి వేశారు. ‘ప్రధాన మంత్రి కృషి సించాయ యోజన’ పేరిట ఆయన ప్రభుత్వం కొత్త వ్యవసాయ స్కీమ్‌ను ప్రారంభించి, జల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్’ స్కీమ్‌ను వ్యవసాయ స్కీమ్‌లో కలిపేసింది. వాటర్షెడ్కు కేటాయించిన నిధులను వ్యవసాయానికి మళ్లించింది. ఇది చాలా ప్రతికూలమైన పరిణామంగా పేర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలో మూడొంతుల భూభాగం నీటి సదుపాయం లేని మెట్టభూములని, వాటికి అనుకూలంగానే ఇంతకుముందు వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ స్కీమ్‌ను రూపొందించినట్లు వారు చెబుతున్నారు. తాత్కాలిక ప్రయోజనాలను ఆశిస్తే భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దేశంలో జల సంరక్షణ కోసం 1980లో మార్గదర్శకాలను రూపొందించి, వాటిని ఓ స్కీమ్‌గా మలిచేందుకు దాదాపు రెండు దశాబ్దాలు పట్టిందని, ఫలితంగా 2009లో వాటర్‌షెడ్ స్కీమ్ ప్రారంభమైందని వారు చెబుతున్నారు. అలాగే గతంలో మోదీ ప్రభుత్వం మంచినీటి పథకాలకు కేటాయించిన నిధులను ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించారని, దాని వల్ల నీటి పథకాలకు 80 శాతం నిధులు తగ్గిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిధులు మళ్లించడం పట్ల 2016లో పార్లమెంటరీ కమిటీ సంబంధిత మంత్రిత్వ శాఖను విమర్శించింది. దేశంలో స్వచ్ఛ భారత్ కింద నిర్మించిన ప్రతి పది మరుగుదొడ్లలో ఆరింటికి నీటి సదుపాయం లేదని 2017లో కేంద్ర ప్రభుత్వ నివేదికనే వెల్లడించింది. నీటి సదుపాయం లేని మరుగు దొడ్ల వల్ల ఏం ప్రయోజనమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కొత్త పథకాలను చేపట్టక పోయినా ఫర్వాలేదుగానీ, ఉన్న పథకాలను నీరుగార్చవద్దని వారు అభిప్రాయపడుతున్నారు. -
బోరు రీచార్జి గుంతలు అభినందనీయం
► కలెక్టర్ నీతూప్రసాద్ ► భూగర్భ జలాల పెంపునకు కృషి చేయూలి ► నాబార్డు వాటర్ షెడ్డ్ పనులు పరిశీలన హుస్నాబాద్‌రూరల్: వర్షపు నీరు వృథా పోకుండా భూమిలోకి మళ్లించి భూగర్భజలాల పెంపునకు కృషి చేయూలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేట పంచాయతీ పరిధిలోని నాబార్డు సహకారంతో సతతహరిత, సహాయ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్‌షెడ్డు పథకం పనులను శుక్రవారం పరిశీలించారు. గొల్లకుంటలో సహాయ ఎన్జీవో ఆధ్వర్యంలో చేపడుతున్న బోరువెల్ రీచార్జి గుంతల గురించి నాబార్డు ఏజీఎం రవిబాబు కలెక్టర్‌కు వివరించారు. రైతు శ్రీనివాస్‌ను మాట్లాడుతూ బోరు రీచార్జి గుంత తవ్వడం ద్వారా వర్షంపడ్డ తర్వాత అదనంగా 20 నిమిషాలు నీళ్లు పోసిందని చెప్పారు. వ్యవసాయభూముల్లో ఉపాధిహామీ పథకం ద్వారా నీటికుంటలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవాలని రైతులకు సూచించారు. నీటికుంటల్లో నీరు ఉంటే సమీపంలోని అరకిలోమీటర్ వరకు భూమిలో తేమ ఉంటుందని తెలిపారు. జిల్లాలో 3 వేల వరకు నీటికుంటలు మంజూరు చేసినట్లు చెప్పారు. పత్తికి ప్రత్యామ్నాయం సాగు చేయూలి పత్తి పంటలు కాకుండా ప్రత్యామ్నాయంగా కూరగాయలు, మొక్కజొన్న, సోయూబీన్ సాగు చేసేలా చూడాలని ఎన్జీవోలను కోరారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే విత్తనాల గురించి వివరించాలన్నారు. జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ మెట్ట ప్రాంతమని, 700 ఫీట్ల వరకు బోర్లు వేసిన చుక్క నీరు రావడం లేదని, ఈ ప్రాంత అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎంపీపీ భూక్య మంగ మాట్లాడుతు అక్కన్నపేటను మండలం చేయాలని కోరారు. అనంతరం రూ.25లక్షల రుణమంజూరు పత్రాలు పంపిణీ చేశారు. సర్పంచ్ జాగిరి వసంత, టీజీబీ ఆర్ఎం రవీందర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ డీడీ ప్రభాకర్, ఏడీ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జి.రాంరెడ్డి,తహసీల్దార్ టి.వాణి, వ్యవసాయశాఖ ఏడీఏ మహేశ్, పశువైద్యులు విజయ్‌భార్గవ్, ఏవో శ్రీనివాస్, ఎంపీటీసీ బండి సమ్మయ్య, వాటర్‌షెడ్డు పథకం చైర్మన్ సూరం సమ్మిరెడ్డి, కట్కూర్ సర్పంచ్ రాంచంద్రం, భీమదేవరపల్లి వైస్ ఎంపీపీ మనోహర, సహాయ ఎన్జీవో సీఈవో రాజ్కమాల్రెడ్డి,జనవికాస ఎన్ జీవో అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌రావు, సంపత్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు కర్ణకంటి శ్రీశైలం, కంది రాంరెడ్డి పాల్గొన్నారు. -
'నిధుల్లో కోత విధించిన కేంద్రం'
వేములవాడ(కరీంనగర్ జిల్లా): తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తోందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఆరోపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత మూడు నెలలకే రూ.2600 కోట్ల నిధులు తగ్గించిందని అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలోని వాజ్‌పేయి ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజన తదితర పథకాల ద్వారా గ్రామాల అభివృద్ధికి పాటుపడిందన్నారు. ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంకెల గారడీ చేస్తూ నిధుల్లో కోత పెడుతోందని అన్నారు. 69వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నరేంద్రమోడీ ప్రసంగంలో గ్రామాల అభివృద్ధి గురించి ప్రస్తావించలే దన్నారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రధానమంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. వాటర్‌షెడ్ పథకం నిధులు విడుదల చేయడం లేదని, మోడల్ స్కూల్స్ భారాన్ని రాష్ట్రంపైనే వేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. -
సహజ వనరుల సంరక్షణ అందరి బాధ్యత
చేవెళ్ల, న్యూస్‌లైన్ : వాటర్‌షెడ్ పథకం ద్వారా సహజ వనరులను పరిక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో మెగా వాటర్షెడ్కు ఎంపికైన గ్రామాల సర్పంచ్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల, షాబాద్ మండలాల్లోని పలు గ్రామాల సర్పంచ్‌లు హాజరయ్యారు. వారికి వాటర్‌షెడ్ పథకం ఉద్దేశాలను వివరించారు. వర్షపునీటిని ఒక చోట నిల్వచేసి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణకు వాటర్‌షెడ్ దోహదం చేస్తుందన్నారు. సహజ వనరులను పరిరక్షించుకోవడంతో పాటు వ్యవసాయం, పశువుల ఉత్పాదకత, జీవనోపాధుల పెంపుదల కార్యక్రమాల ద్వారా ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి వాటర్షెడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. పండ్ల తోటలు, చేపల పెంపకం, భూములు సాగుయోగ్యం కూడా వాటర్‌షెడ్ కిందికి వస్తాయని చెప్పారు. నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఊటచెరువులు, రాతికట్టలు, తదితర పనులను వాటర్‌షెడ్‌లో చేపట్టాలని సర్పంచ్‌లకు సూచించారు. చేవెళ్లలో 4,643 హెక్టార్లను వాటర్‌షెడ్ కింద గుర్తించినట్లు టెక్నికల్ అసిస్టెంట్లు శ్రీను, రాములు తెలిపారు. షాబాద్ ప్రాజెక్టు అధికారి రాంచందర్‌రావు వాటర్‌షెడ్ పథకం, ఉద్దేశాలపై అవగాహన కల్పించారు. వాటర్షెడ్లకు సర్పంచ్‌లే కమిటీ చైర్మన్లుగా వ్యవహరిస్తారని, కమిటీ తీర్మానం, ప్రతిపాదనల మేరకే పనులు చేపడతామని స్పష్టం చేశారు. డీసీసీబీ డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రాల్లో కా కుండా గ్రామాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాటర్‌షెడ్ పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీడీ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎన్ను జంగారెడ్డి, హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.