తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తోందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఆరోపించారు.
వేములవాడ(కరీంనగర్ జిల్లా): తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తోందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఆరోపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత మూడు నెలలకే రూ.2600 కోట్ల నిధులు తగ్గించిందని అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలోని వాజ్‌పేయి ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజన తదితర పథకాల ద్వారా గ్రామాల అభివృద్ధికి పాటుపడిందన్నారు.
ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంకెల గారడీ చేస్తూ నిధుల్లో కోత పెడుతోందని అన్నారు. 69వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నరేంద్రమోడీ ప్రసంగంలో గ్రామాల అభివృద్ధి గురించి ప్రస్తావించలే దన్నారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రధానమంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. వాటర్‌షెడ్ పథకం నిధులు విడుదల చేయడం లేదని, మోడల్ స్కూల్స్ భారాన్ని రాష్ట్రంపైనే వేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు.