చేవెళ్ల, న్యూస్‌లైన్ : వాటర్‌షెడ్ పథకం ద్వారా సహజ వనరులను పరిక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో మెగా వాటర్‌షెడ్‌కు ఎంపికైన గ్రామాల సర్పంచ్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల, షాబాద్ మండలాల్లోని పలు గ్రామాల సర్పంచ్‌లు హాజరయ్యారు. వారికి వాటర్‌షెడ్ పథకం ఉద్దేశాలను వివరించారు. వర్షపునీటిని ఒక చోట నిల్వచేసి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణకు వాటర్‌షెడ్ దోహదం చేస్తుందన్నారు.
సహజ వనరులను పరిరక్షించుకోవడంతో పాటు వ్యవసాయం, పశువుల ఉత్పాదకత, జీవనోపాధుల పెంపుదల కార్యక్రమాల ద్వారా ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి వాటర్‌షెడ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. పండ్ల తోటలు, చేపల పెంపకం, భూములు సాగుయోగ్యం కూడా వాటర్‌షెడ్ కిందికి వస్తాయని చెప్పారు. నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఊటచెరువులు, రాతికట్టలు, తదితర పనులను వాటర్‌షెడ్‌లో చేపట్టాలని సర్పంచ్‌లకు సూచించారు. చేవెళ్లలో 4,643 హెక్టార్లను వాటర్‌షెడ్ కింద గుర్తించినట్లు టెక్నికల్ అసిస్టెంట్లు శ్రీను, రాములు తెలిపారు.
షాబాద్ ప్రాజెక్టు అధికారి రాంచందర్‌రావు వాటర్‌షెడ్ పథకం, ఉద్దేశాలపై అవగాహన కల్పించారు. వాటర్‌షెడ్‌లకు సర్పంచ్‌లే కమిటీ చైర్మన్లుగా వ్యవహరిస్తారని, కమిటీ తీర్మానం, ప్రతిపాదనల మేరకే పనులు చేపడతామని స్పష్టం చేశారు. డీసీసీబీ డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రాల్లో కా కుండా గ్రామాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాటర్‌షెడ్ పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీడీ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎన్ను జంగారెడ్డి, హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.
సహజ వనరుల సంరక్షణ అందరి బాధ్యత
Published Sun, Dec 29 2013 3:16 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement