District water management company
-
సోలార్‌లోనూ కొల్లగొట్టారు!
అనంతపురం సెంట్రల్ : జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో నిధుల దుర్వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉపాధి హామీ, వాటర్షెడ్లు వంటి భారీ పథకాలను నిర్వహించే ఈ సంస్థలో నిధులకు కొదువ ఉండదు. వాటి వినియోగం మాత్రం సక్రమంగా ఉండడం లేదు. ఈ విషయంలో అధికారులపై తరచూ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సోలార్ విద్యుత్ పరికరాల కొనుగోలులోనూ అక్రమాలు జరిగినట్లు తాజాగా విమర్శలొస్తున్నాయి. ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల హాజరుశాతాన్ని ప్రతి రోజూ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా ఉండడంతో అప్లోడ్ చేయడానికి సిబ్బంది అవస్థ పడేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 12 క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ (ఏపీడీ) కార్యాలయాల్లోనూ, 20 ప్రోగ్రాం ఆఫీసర్ (పీఓ) కార్యాలయాల్లోనూ సోలార్ విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేశారు. వీటిని 2013 మార్చి 30న రూ. 6,94,400 వెచ్చించి కొనుగోలు చేశారు. కరువు జిల్లా ‘అనంత’ కరువు నివారణ పథకం(డీడీపీ) కింద ఎంపిక కావడంతో గతంలో రూ.కోట్ల నిధులొచ్చాయి. ఖర్చు పెట్టింది పోనూ మిగులు నిధులు ఉండడంతో అప్పటి కలెక్టర్ దుర్గాదాస్, పీడీ ఢిల్లీరావు ఆదేశాల మేరకు డ్వామా అధికారులు సోలార్ పరికరాలను కొనుగోలు చేశారు. వీటిని ఏర్పాటు చేసే బాధ్యతను జిల్లా కేంద్రంలోని ఎం.ఎన్ ఇన్ఫోసిస్ కంపెనీకి అప్పగించారు. ఎలాంటి టెండర్లూ లేకుండానే సంబంధిత కంపెనీకి గంపగుత్తగా అప్పగించారు. ఫలితంగా నాణ్యత లేని పరికరాలను అంటగట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా కార్యాలయాల్లో సోలార్ పరికరాలను ఏర్పాటు చేసిన ఏడాదిలోపే ఏ ఒక్కటీ పనిచేయకుండా పోయాయి. పరికరాలు బిగించినప్పుడే నాణ్యత లేవని గుర్తించినట్లు సమాచారం. అయినా కంపెనీపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఏడాది క్రితం ఓ క్లస్టర్ ఏపీడీ కార్యాలయంలో విద్యుత్ మరమ్మతులు చేసేందుకు వచ్చిన ట్రాన్స్‌కో లైన్మెన్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. నాణ్యత లేని సోలార్ పరికరాలు ఏర్పాటు చేయడం వల్ల రివర్స్‌లో విద్యుత్ సరఫరా అయ్యిందని అప్పట్లోనే నిర్ధారించారు. అయినప్పటికీ సంబంధిత కంపెనీ యజమానిపై మాత్రం చర్యలు తీసుకోలేదు. జిల్లాలో ఏ ఒక్కటీ పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు పరికరాలకు ఇంకా వారంటీ ఉందని, సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని స్వయాన డ్వామా సిబ్బంది కోరుతున్నారు. నాణ్యత లేవని తేలితే చర్యలు సోలార్ పరికరాలు పనిచేయలేదనే విషయం నా దృష్టికి వచ్చింది. 2013లో వాటిని కొనుగోలు చేశారు. ఎందుకు పనిచేయడం లేదో ఆరా తీస్తా. పరికరాలను ఏర్పాటు చేసిన కంపెనీ నిర్వాహకులను వెంట పెట్టుకొని ప్రతి కార్యాలయానికీ వెళ్తా. ఎక్కడ లోపాలున్నాయో గుర్తిస్తాం. వాటిని మరమ్మతులు చేయిస్తాం. నాణ్యత లేవని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటా. - నాగభూషణం, ప్రాజెక్టు డెరైక్టర్, జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) -
సహజ వనరుల సంరక్షణ అందరి బాధ్యత
చేవెళ్ల, న్యూస్‌లైన్ : వాటర్‌షెడ్ పథకం ద్వారా సహజ వనరులను పరిక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో మెగా వాటర్షెడ్కు ఎంపికైన గ్రామాల సర్పంచ్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల, షాబాద్ మండలాల్లోని పలు గ్రామాల సర్పంచ్‌లు హాజరయ్యారు. వారికి వాటర్‌షెడ్ పథకం ఉద్దేశాలను వివరించారు. వర్షపునీటిని ఒక చోట నిల్వచేసి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణకు వాటర్‌షెడ్ దోహదం చేస్తుందన్నారు. సహజ వనరులను పరిరక్షించుకోవడంతో పాటు వ్యవసాయం, పశువుల ఉత్పాదకత, జీవనోపాధుల పెంపుదల కార్యక్రమాల ద్వారా ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి వాటర్షెడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. పండ్ల తోటలు, చేపల పెంపకం, భూములు సాగుయోగ్యం కూడా వాటర్‌షెడ్ కిందికి వస్తాయని చెప్పారు. నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఊటచెరువులు, రాతికట్టలు, తదితర పనులను వాటర్‌షెడ్‌లో చేపట్టాలని సర్పంచ్‌లకు సూచించారు. చేవెళ్లలో 4,643 హెక్టార్లను వాటర్‌షెడ్ కింద గుర్తించినట్లు టెక్నికల్ అసిస్టెంట్లు శ్రీను, రాములు తెలిపారు. షాబాద్ ప్రాజెక్టు అధికారి రాంచందర్‌రావు వాటర్‌షెడ్ పథకం, ఉద్దేశాలపై అవగాహన కల్పించారు. వాటర్షెడ్లకు సర్పంచ్‌లే కమిటీ చైర్మన్లుగా వ్యవహరిస్తారని, కమిటీ తీర్మానం, ప్రతిపాదనల మేరకే పనులు చేపడతామని స్పష్టం చేశారు. డీసీసీబీ డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రాల్లో కా కుండా గ్రామాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాటర్‌షెడ్ పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీడీ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎన్ను జంగారెడ్డి, హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు.