అనంతపురం సెంట్రల్ : జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో నిధుల దుర్వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉపాధి హామీ, వాటర్‌షెడ్లు వంటి భారీ పథకాలను నిర్వహించే ఈ సంస్థలో నిధులకు కొదువ ఉండదు. వాటి వినియోగం మాత్రం సక్రమంగా ఉండడం లేదు. ఈ విషయంలో అధికారులపై తరచూ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సోలార్ విద్యుత్ పరికరాల కొనుగోలులోనూ అక్రమాలు జరిగినట్లు తాజాగా విమర్శలొస్తున్నాయి. ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల హాజరుశాతాన్ని ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా ఉండడంతో అప్‌లోడ్ చేయడానికి సిబ్బంది అవస్థ పడేవారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని 12 క్లస్టర్ అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ (ఏపీడీ) కార్యాలయాల్లోనూ, 20 ప్రోగ్రాం ఆఫీసర్ (పీఓ) కార్యాలయాల్లోనూ సోలార్ విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేశారు. వీటిని 2013 మార్చి 30న రూ. 6,94,400 వెచ్చించి కొనుగోలు చేశారు. కరువు జిల్లా ‘అనంత’ కరువు నివారణ పథకం(డీడీపీ) కింద ఎంపిక కావడంతో గతంలో రూ.కోట్ల నిధులొచ్చాయి. ఖర్చు పెట్టింది పోనూ మిగులు నిధులు ఉండడంతో అప్పటి కలెక్టర్ దుర్గాదాస్, పీడీ ఢిల్లీరావు ఆదేశాల మేరకు డ్వామా అధికారులు సోలార్ పరికరాలను కొనుగోలు చేశారు. వీటిని ఏర్పాటు చేసే బాధ్యతను జిల్లా కేంద్రంలోని ఎం.ఎన్ ఇన్‌ఫోసిస్ కంపెనీకి అప్పగించారు. ఎలాంటి టెండర్లూ లేకుండానే సంబంధిత కంపెనీకి గంపగుత్తగా అప్పగించారు.
ఫలితంగా నాణ్యత లేని పరికరాలను అంటగట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా కార్యాలయాల్లో సోలార్ పరికరాలను ఏర్పాటు చేసిన ఏడాదిలోపే ఏ ఒక్కటీ పనిచేయకుండా పోయాయి. పరికరాలు బిగించినప్పుడే నాణ్యత లేవని గుర్తించినట్లు సమాచారం. అయినా కంపెనీపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఏడాది క్రితం ఓ క్లస్టర్ ఏపీడీ కార్యాలయంలో విద్యుత్ మరమ్మతులు చేసేందుకు వచ్చిన ట్రాన్స్‌కో లైన్‌మెన్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.
నాణ్యత లేని సోలార్ పరికరాలు ఏర్పాటు చేయడం వల్ల రివర్స్‌లో విద్యుత్ సరఫరా అయ్యిందని అప్పట్లోనే నిర్ధారించారు. అయినప్పటికీ సంబంధిత కంపెనీ యజమానిపై మాత్రం చర్యలు తీసుకోలేదు. జిల్లాలో ఏ ఒక్కటీ పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు పరికరాలకు ఇంకా వారంటీ ఉందని, సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని స్వయాన డ్వామా సిబ్బంది కోరుతున్నారు.
నాణ్యత లేవని తేలితే చర్యలు
సోలార్ పరికరాలు పనిచేయలేదనే విషయం నా దృష్టికి వచ్చింది. 2013లో వాటిని కొనుగోలు చేశారు. ఎందుకు పనిచేయడం లేదో ఆరా తీస్తా. పరికరాలను ఏర్పాటు చేసిన కంపెనీ నిర్వాహకులను వెంట పెట్టుకొని ప్రతి కార్యాలయానికీ వెళ్తా. ఎక్కడ లోపాలున్నాయో గుర్తిస్తాం. వాటిని మరమ్మతులు చేయిస్తాం. నాణ్యత లేవని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటా.
- నాగభూషణం, ప్రాజెక్టు డెరైక్టర్, జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా)