ముంబై: ఐపీవో బాటలో ఉన్న ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ 2026–27 నాటికి సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిలో 20 శాతం ఈక్విటీ రూపంలో రావాలంటే.. విస్తరణ కోసం రూ.20,000 కోట్ల సొంత నిధులు అవసరమవుతాయని సంస్థ సీఎండీ గుర్‌దీప్ సింగ్ వెల్లడించారు.
రాబోయే ఐపీవో ద్వారా రూ.10,000 కోట్ల నిధులు వస్తాయని అన్నారు. కంపెనీ అంతర్గత వనరుల ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ఏజెన్సీల నుండి కంపెనీ మెరుగైన క్రెడిట్ రేటింగ్‌ను పొందుతోందని, ఇది పోటీ కంపెనీలతో పోల్చినప్పుడు తక్కువ రేట్లతో రుణాన్ని అందుకునేందుకు వీలు కల్పిస్తుందని సింగ్ చెప్పారు.
ఇతర విభాగాల్లోకీ ఎంట్రీ..
ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకూడదని, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ పవర్, ఎనర్జీ స్టోరేజీ విభాగాల్లో ఎంట్రీపై కూడా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌ను నెలకొల్పడానికి విశాఖపట్నం సమీపంలోని 1,200 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం ఎన్‌టీపీసీ తీసుకుంది. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని సింగ్ వెల్లడించారు.
2027కల్లా 19,000 మెగావాట్లు..
ప్రస్తుతం 3,220 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. 2025 మార్చికి 6,000 మెగావాట్లకు, 2026 మార్చి నాటికి 11,000 మెగావాట్లకు, 2027 మార్చి కల్లా 19,000 మెగావాట్లకు సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 11,000 మెగావాట్లకు సమానమైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని సింగ్
వెల్లడించారు.
నవంబర్ 19 నుంచి ఐపీవో..
ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో నవంబర్ 19న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఒక్కొక్కటి రూ.102–108 ప్రైస్ బ్యాండ్‌తో రూ.10,000 కోట్ల వరకు విలువైన తాజా షేర్లను జారీ చేయడానికి కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 138 షేర్లతో కూడిన లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి వాటాలు కావాల్సినవారు మరిన్ని లాట్స్‌కు బిడ్లు వేసుకోవచ్చు.
ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 75 శాతం, నాన్–ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాలు కేటాయిస్తారు. అర్హత కలిగిన కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.5 డిస్కౌంట్‌ను ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆఫర్ చేస్తోంది. ఉద్యోగుల కోటాకై రూ.200 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. హ్యుండై మోటార్ ఇండియా, స్విగ్గీ తర్వాత ఈ ఏడాది మూడవ అతిపెద్ద ఐపీవోగా ఇది నిలవనుంది.
Comments
Please login to add a commentAdd a comment