నీటి వృథా ఫైన్ | Fine waste water | Sakshi
Sakshi News home page

నీటి వృథా ఫైన్

Published Tue, Oct 13 2015 2:05 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

నీటి వృథా  ఫైన్ - Sakshi

నీటి వృథా ఫైన్

వాన నీటి సంరక్షణకు  బెంగళూరు జలమండలి నూతన పంథా
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన
డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం

 
బెంగళూరు: జలసంరక్షణపై దృష్టి సారించకుండా నీటిని వృధా చేస్తున్న ఇంటి యజమానులపై ఇక జరిమానా వేటు పడనుంది. వర్షపు నీటి సంరక్షణ, సేకరణ విధానాన్ని ఇంటిలో ఏ ర్పాటు చేసుకోకుండా అలసత్వం వహిస్తున్న న గరంలోని ఇంటి యజమానులపై ‘జరిమానా’ కొరడా విదిలించాలని బెంగళూరు జలమండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జలమండలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.

50శాతం మాత్రమే అమలు.....
నగరంలో భూగర్భ జలమట్టాన్ని పెంపొందించడంతో పాటు నీటిని పొదుపుగా వినియోగించుకునేందుకు గాను వర్షపు నీటి సంరక్షణ, సేకరణలపై(రెయిన్ వాటర్ హార్వెస్టింగ్) బెంగళూరు జలమండలి గతంలోనే దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నగరంలో 40ఁ60 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్రతి ఇంటిలో వర్షపు నీటిని సేకరించే విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది.  అయితే  ప్రస్తుతం నగరంలో ఉన్న గృహాల్లో దాదాపు 50శాతం ఇళ్లలో మాత్రమే వర్షపు నీటిని సేకరించే విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక వర్షపు నీటి సేకరణకు ప్రాధాన్యం ఇవ్వని ఇళ్ల యజమానులకు నోటీసులు ఇవ్వడం తప్పితే జలమండలి మరేమీ చేయలేకపోయింది. అందుకే వసతి ఉండి కూడా వర్షపు నీటి సేకరణకు ప్రాధాన్యం ఇవ్వని ఇళ్ల యజమానులపై ఇక ‘జరిమానా’ వేటు వేయాలని జలమండలి నిర్ణయించింది. ఇంటిలో వర్షపు నీటి సేకరణ విధానం లేని వారికి నీటి బిల్లుపై మరో 25శాతం మొత్తాన్ని జరిమానాగా విధించాలని నిర్ణయించింది. ఇందుకు జలమండలి సమితి సభలోనూ అనుమతి లభించడంతో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో....
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో నగరంలో సైతం భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు నగర వాసుల నీటి విని యోగం మాత్రం రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గడం లేదు.  ఈ నేపథ్యంలో నగరంలో వర్షపు నీటి సేకరణపై మరోసారి దృష్టి సారించాల్సిన ఆవశ్యకత జలమండలికి ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఇప్పటికే వర్షపు నీటి సేకరణ విధానాన్ని ఏర్పాటు చేసుకోని యజమానులకు జరిమానాను విధిస్తున్నారు. ఇదే విధానాన్ని నగరంలో సైతం అమల్లోకి తీసుకొస్తేనే వర్షపు నీటి సంరక్షణ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని జలమండలి భావిస్తోంది.

డిసెంబర్ 1 నుండి అమల్లోకి?
ఇక జలమండలి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే డిసెంబర్ 1 నుండి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని జలమండళి అధ్యక్షుడు టి.ఎం.విజయభాస్కర్ చెబుతున్నారు. ‘వర్షపు నీటి సంరక్షణా విధానాన్ని ఏర్పాటు చేసుకోని ఇంటి యజమానులకు ముందుగా జరిమానా విధిస్తాం. మూడు నెలల తర్వాత కూడా వారు అలసత్వాన్ని ప్రదర్శిస్తే జరిమానాను రెండింతలు చేస్తాం. అప్పటికీ ఇంటిలో వర్షపు నీటి సంరక్షణా విధానం ఏర్పాటు చేయకపోతే నీటి కనెక్సన్‌ను తొలగిస్తాం’ అని విజయభాస్కర్ తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement