
నీటి సంరక్షణ కోసం భారీ చర్యలు: మోదీ
అధికారిక యువజన సంఘాల పనితీరుపై సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలోని అనేక ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్న నేపథ్యంలో నీటి సంరక్షణ, నిల్వ కోసం రానున్న నెలల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద భారీ చర్యలు చేపట్టనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ చర్యల్లో అధికారిక యువజన సంఘాలైన ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలు కూడా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం మోదీ ఢిల్లీలోఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్‌క్రాస్ సొసైటీల పనినీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సంఘాలన్నీ సమన్వయం, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.
దేశంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ తదితర సంఘాలు తక్షణం రంగంలోకి దిగాలని కోరారు. యూత్ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు తమ సంఘాల పనితీరు గురించి, సమాజంలో ఆయా సంఘాల పాత్ర గురించి ప్రధాని మోదీకి వివరించారు. వారికి ప్రధాని మోదీ పలు సూచనలు, సలహాలు అందించారు. ముఖ్యంగా స్వచ్ఛత, యువతలో జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలని వారికి సూచించారు. యూత్ ఆర్గనైజేషన్లు సామాజిక మీడియాలో చురుకుగా పాలుపంచుకోవడం ద్వారా యువతకు చేరువగా ఉండేందుకు కృషి చేయాలని చెప్పారు.