
సాక్షి, హైదరాబాద్: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో వన్యప్రాణులకు నీటి వసతి కల్పనపై అటవీ శాఖ దృష్టి పెట్టింది. అడవుల్లో సహజసిద్ధంగా ఏర్పడిన మడుగులు, దోనల్లోని నీటిని పరిశుభ్రంగా ఉంచటంతో పాటు జంతువులకు సమీపంలో తాగునీరు ఉండేలా సాసర్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 24, 25న అడవుల్లో నీటి వసతిపై సర్వే చేయాలని నిర్ణయించారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులతో పాటు, రక్షిత అడవులు, ఏటూరు నాగారం, కిన్నెరసాని, పోచారం అభయారణ్యాల్లో రెండు రోజుల పాటు సర్వే చేయనున్నారు.
అటవీ అధికారులు, సిబ్బందితో సహా ఇటీవల పులుల జనగణనలో పాల్గొన్న వాలంటీర్లను సర్వేలో భాగస్వామ్యం చేయనున్నారు. ఎక్కడెక్కడ సహజ నీటి వనరులు ఉన్నాయి? అవి ఏ దశలో ఉన్నాయి? నీరు స్వచ్ఛంగా ఉందా? ఏ కారణవల్లనైనా కాలుష్యం అవుతుందా? సమీపంలో మానవ ఆవాసాలు ఉన్నాయా? ఇటీవల జంతువులకు, మనషులకు మధ్య ఘర్షణలు ఏమైనా చోటు చేసుకున్నాయా? జంతువులు సంచరించే ప్రాంతానికి ఎంత దూరంలో నీటి వసతి ఉంది? కృత్రిమ నీటి వసతి ఎన్ని చోట్ల అవసరం అన్న విషయాలను నమోదు చేయనున్నారు. దీని ఆధారంగా జంతువులకు నీటి వసతిపై కార్యాచరణ రూపొందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment