కొత్త కాంక్రీట్‌తో జల సంరక్షణ సులువు!
వాన చినుకులన్నీ నేలలోకి ఇంకితే భూగర్భ జలం వృద్ధి చెందుతుంది. అందరికీ మేలు జరుగుతుంది. కానీ.. నగరాల్లో అంగుళం ఖాళీ లేకుండా వేసే కాంక్రీట్ రోడ్ల కారణంగా నీరంతా కొట్టుకుపోతోంది. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల కారణంగా ఈ చిక్కు సమస్య త్వరలోనే పరిష్కారం కానుంది. దృఢమైన కాంక్రీట్ ద్వారా కూడా నీళ్లు సులువుగా జారిపోయేలా వీరు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఏటికేడాదీ పెరిగిపోతున్న కార్బన్ ఫైబర్ వ్యర్థాలతోనే ఈ ఘనతను సాధించడం విశేషం.
కాంక్రీట్ ద్వారా నీరు కొద్దిమోతాదులో ఇంకేందుకు అవకాశమున్నప్పటికీ ఇది కాస్తా కాంక్రీట్ దృఢత్వంపై ప్రభావం చూపుతుంది. కొద్దికాలానికే కాంక్రీట్ కొట్టుకుపోతుంది. ఈ నేపథ్యంలో కార్ల్ ఇంగ్లండ్, సొమాయా నాసిరీలు కార్బన్ ఫైబర్ వ్యర్థాలతో కొత్త రకం కాంక్రీట్‌ను తయారు చేశారు. ఇది దృఢంగా ఉండటమే కాకుండా సాధారణ కాంక్రీట్ కంటే ఎక్కువ మోతాదులో నీరు భూమిలోకి ఇంకేలా రంధ్రాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధన శాలలో ఈ కొత్త కాంక్రీట్ బాగా పనిచేసినప్పటికీ.. సాధారణ పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తుందో పరీక్షించాల్సి ఉందని.. ఆ తరువాత విస్తృత స్థాయి వాడకానికి సిద్ధం చేయవచ్చునని నాసిరీ అంటున్నారు.
దెబ్బతిన్న గుండెను సరిచేసేందుకు కొత్త పద్ధతి
తోక తెగిపోతే మళ్లీ పెంచుకోగల శక్తి బల్లులకు సొంతం. అలాగే కొన్ని రకాల చేపలు తమ గుండె కణజాలాన్ని మళ్లీ అభివృద్ధి చేసుకోగలవు. మనిషికీ ఇలాంటి శక్తి ఉంటే.. అనేక గుండెజబ్బులకు మెరుగైన, సులువైన చికిత్స సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ పనిలోనే ఉన్నారు గ్లాడ్‌స్టోన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వివేక్ శ్రీవాస్తవ. మన శరీరంలో కార్డియోమయోసైట్స్ అనే కణాలు కొన్ని ఉంటాయి. పిండ దశలో గుండె ఏర్పడేందుకు గణనీయంగా విభజితమయ్యే ఈ కణాలు.. ఆ తరువాత మాత్రం విభజనకు గురికావు. కార్డియోమయోసైట్స్‌కు మళ్లీ ఆ శక్తిని అందించేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వివేక్ శ్రీవాస్తవ ఇందులో విజయం సాధించారు.
జంతువులపై చేసిన ప్రయోగాల్లో కార్డియోమయోసైట్స్ విభజితమవడమే కాకుండా దెబ్బతిన్న గుండె కణజాలాన్ని మరమ్మతు కూడా చేసినట్లు శ్రీవాస్తవ ప్రకటించారు. కార్డియోమయోసైట్స్ విభజనకు సంబంధించి మొత్తం నాలుగు జన్యువులు పనిచేస్తున్నట్లు గుర్తించిన ఈయన వాటిని పూర్తిస్థాయిలో పనిచేసేలా చేయడం ద్వారా కణాలు వేగంగా విభజితమయ్యేలా చేయగలిగారు. కార్డియోమయోసైట్స్ విభజనను కచ్చితంగా నియంత్రించడం ఎలాగో అర్థం చేసుకోవడం ద్వారా ఈ పద్ధతిని మనుషుల్లోనూ ఉపయోగించవచ్చునని, తద్వారా గుండె పనిచేయని స్థితికి చేరుకున్న వారికీ సాంత్వన చేకూర్చడం వీలవుతుందని శ్రీవాస్తవ అంటున్నారు.
వెలుగులు ఒడిసి పడతాయి...
సూర్యుడి నుంచి వెలువడే వెలుగును వంద శాతం విద్యుత్తుగా మారిస్తే.. ఈ భూమ్మీద పెట్రోలు, డీజిల్ వంటివి అస్సలు అవసరం ఉండదు. కాకపోతే ఎంతటి గొప్ప సోలార్ ప్యానెలైనా కేవలం 25 శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలవు. ఈ నేపథ్యంలో జర్మనీలోని బ్రాన్‌ష్వెగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. అన్ని దిక్కుల నుంచి వెలుతురును తీసుకుని అతితక్కువ ప్రదేశంలోకి కేంద్రీకరించగలిగే సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. వీటిని వరుసగా పేర్చడం ద్వారా సూర్యకిరణాల్లోని అన్నిరకాల కాంతిని విద్యుత్తుగా మార్చవచ్చు.
ఈ పరికరం మొక్కల్లో వెలుతురును ఒడిసిపట్టే కణాల మాదిరిగా పనిచేస్తుందని ఫోటాన్లను శోషించుకుని ఇతర కణాలకు చేరవేస్తాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త పీటర్ జోమో వల్లా తెలిపారు. దాదాపు 80 శాతం కాంతిని చిన్న ప్రదేశంలోకి కేంద్రీకరించగల ఈ పరికరాలతో భవిష్యత్తులో అతితక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ కాన్‌సెంట్రేటర్స్‌ను తయారు చేయవచ్చునని ఆయన వివరించారు. ప్రస్తుతం తాము నీలిరంగు కాంతిని శోషించుకుని మళ్లించగలిగేలా చేయగలిగామని.. ఇతర రంగులకు కూడా ఈ పద్ధతిని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment