
వృద్ధికి జల సంరక్షణే మార్గం
♦ వర్షాలపై ఆధారపడటం తగ్గించాలి
♦ డ్రైవర్లు లేని ట్రాక్టర్లు తయారు చేస్తాం
♦ ఎం అండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్య
ముంబై : వర్షపాతంపైనే ఆధారపడటం, దీని ప్రాతిపదికననే ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, ప్రణాళికలు రూపొందించుకోవడం సరికాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. జల సంరక్షణ, జల వనరుల సక్రమ వినియోగం, తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించడంపై పరిశోధన వంటివి చేయాలన్నారు. దీంతో నీటి వనరుల సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి కూడా పెరుగుతాయని, జల కాలుష్య నివారణపైనా దృష్టి సారించాల్సి ఉందని చెప్పారాయన. ‘‘ఇలా చేస్తే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకూ రుతుపవన ఒడిదుడుకుల నుంచి బయటపడతాం. పూర్తి స్వరాజ్యం సాధిస్తాం. ఈ దిశగా కృషి చేయాలి’’ అని బుధవారమిక్కడ జరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) 70వ వార్షిక సాధారణ సమావేశంలో చెప్పారు.
జీఎస్‌టీతో వృద్ధి పరుగు
దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు చర్యల పట్ల ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. భారత్ భారీ మార్కెట్‌ను బోనులో ఉన్న పులితో ఆయన పోలుస్తూ, ఇప్పుడు దీనికి విముక్తి లభించిందన్నారు. దీనివల్ల దేశంలో ప్రైవేటు పెట్టుబడుల వాతావరణం మరింత మెరుగుపడుతుందని, వృద్ధి పటిష్టమవుతుందని చెప్పారు.
డ్రైవర్ రహిత ట్రాక్టర్లు..!
డ్రైవర్ రహిత ట్రాక్టర్ల గురించి ఆనంద్ మహీంద్రా ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ ట్రాక్టర్ల ఉత్పత్తి ద్వారా భవిష్యత్‌లో ఆహారోత్పత్తి విధానంలో గణనీయమైన మార్పులు వస్తాయని ఆయన చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు, కీలక స్థానంపై సంస్థ దృష్టి సారించనుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
మహీంద్రా లాభం రూ.955 కోట్లు
ఎంఅండ్‌ఎం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో స్టాండలోన్ ప్రాతిపదికన రూ.955 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.850 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి సాధించామని సంస్థ తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.10,471 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.11,943 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ1లో వాహన విక్రయాలు 10 శాతం పెరిగి 1,10,959కు, యుటిలిటి వాహనాల అమ్మకాలు 13 శాతం వృద్ధితో 55,909కు, ట్రాక్టర్ల విక్రయాలు 21 శాతం వృద్ధితో 71,785కు పెరిగాయని వివరించింది.